Saturday, January 25, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅరుదైన సినిమా

అరుదైన సినిమా

ఎనభయ్యేళ్ల పైనే ఉంటుంది హీరాదేవి వయసు. ఉండేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గడతిర్ అనే గ్రామంలో. తోడు ఒక గేదె.ఇక్కడ చాలామంది పట్టణాలకు వెళ్లిపోయారు. ఇక్కడనే కాదు చుట్టుపక్కల చాలా గ్రామాలు అంతే. పనులు దొరక్క, సరయిన విద్య, వైద్యం అందక … ఇలా రకరకాల కారణాలపై పట్టణాలకు వలస వెళ్లిపోగా వెళ్లలేని ముసలివారు, పశువులు ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు.

సాధారణంగా ఒక ఇల్లు పాడుపడితే దయ్యాల కొంప అంటాం. ఒక ఊరే పాడుబడితే దయ్యాల గ్రామం (ఘోస్ట్ విలేజ్) అంటున్నారు. అలాంటి గ్రామాలు ఉత్తరాఖండ్లో చాలా ఉన్నాయి. ఆమాట కొస్తే తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ఉన్నాయి. ప్రముఖ కవి గోరటి వెంకన్న తన ఆవేదన ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ అనే పాట రూపంలో ఎప్పుడో చెప్పారు. దేశమంతా ఉన్న ఈ సమస్యతో ముడిపడిన సున్నితమైన అంశం ‘పైర్’ సినిమాగా రూపొంది అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది. చిత్ర కథాంశం.

అది ఉత్తరాఖండ్ కొండప్రాంతంలో ఒక పాడుబడ్డ గ్రామం. అక్కడ ఒక భార్యాభర్త జంట. ఒకరికొకరుగా జీవిస్తున్నారు. వారి ఒక్కగానొక్క కొడుకు ఉపాధి వెతుక్కుంటూ వలస వెళ్ళాడు. అతని రాక కోసం ఎదురు చూస్తూ ‘ నీ నగుమోము నా కనులారా’ అని పాడుకుంటూ ఒకరినొకరు కనిపెట్టుకుని ఉన్న వృద్ధ దంపతులు ఉదంసింగ్, తులసిల ప్రణయగాథ ‘పైర్’ సినిమా. ఇంతకు మించి కథ గురించి చెప్పడానికి లేదు. పేరున్న నటులు లేరు. ఉన్న ఇద్దరూ సినిమా రంగానికి చెందినవారు కాదు. అందుకే ఈ సినిమా ప్రత్యేకమైంది. నవంబర్ 19న ఎస్తోనియా దేశంలో 28 వ తాల్లిన్ బ్లాక్ నైట్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమవుతోంది.

ఇతర సినిమా దర్శకులకు భిన్నంగా డైరెక్టర్ వినోద్ కాప్రి ఈ నిజ జీవితగాథకు సినిమా వాళ్ళు కాకుండా గ్రామీణులే ఉండాలని కోరుకున్నాడు. అందుకోసం అనేకమందిని పరిశీలించాడు. స్థానికుల సూచనపై ఉదంసింగ్, హీరా దేవి ఎంపిక జరిగింది. వీరిలో ఉదంసింగ్ ఆర్మీ లో చేసి రిటైర్ అయ్యాడు. అప్పుడప్పుడు గ్రామంలో రాంలీలా ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటాడు. కథానాయిక హీరాదేవి ఉండే కొండ గ్రామంలో చాలా ఇళ్ళు ఖాళీ. సినిమా కథ ఈమె నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. కొడుకులిద్దరూ ఢిల్లీలో ఉన్నారు. కూతురికి పెళ్లయి వేరే గ్రామంలో ఉంటోంది. భర్త లేడు. ఉన్నదల్లా ఒక గేదె మాత్రమే. అదే ఆమె తోడు నీడ. దాన్ని వదిలి ఎక్కడికీ వెళ్ళదు. సినిమా అవకాశం వచ్చినప్పుడూ షూటింగ్ దూరమని ముందు ఒప్పుకోలేదు. కొడుకు నచ్చచెప్పాక సరేనంది. ఫిలిం ఫెస్టివల్ కి ఆహ్వానం వస్తే తన గేదెని అన్నాళ్ళు వదిలేసి వెళ్లలేనంది. చివరకి కూతురు వచ్చి బాధ్యత తీసుకున్నాకే విమానమెక్కింది. ఈ పెద్దవాళ్ళిద్దరికీ ఇది తొలి విమాన విదేశ పర్యటన. వీరితో పాటు వెళ్తున్న వినోద్ కాప్రి వారిద్దరూ అక్కడ కెమెరాలకు భయపడకుండా అందరితో మాట్లాడితే చాలనుకుంటున్నాడు. అన్నట్టు ఈ సినిమాకి పనిచేసిన ప్రముఖుల్లో గుల్జార్, లైఫ్ అఫ్ పై సినిమా కంపోజర్ మైఖేల్ డానా ఉన్నారు. మానవీయ విలువలతో రూపొందిన ఈ సినిమా చక్కటి విజయం సాధించాలని కోరుకుందాం.

-కె . శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్