Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅడుక్కుతినే వేదాంతం

అడుక్కుతినే వేదాంతం

Begging Buffet: ఆది భిక్షువు వాడినేది అడిగేది? అన్న తాత్విక, వైరాగ్య ప్రశ్న అకెడెమిగ్గా బాగానే ఉంటుంది కానీ…ప్రాక్టికల్ గా బతుకంతా భిక్ష అడుగుతూనే ఉండాలి. అసలు ఓం ప్రథమంగా మన బతుకే అమ్మ పెట్టిన భిక్ష. కడుపులో రూపుదిద్దుకుంటున్న ప్రాణాన్ని కనను పొమ్మని అమ్మ అని ఉంటే మన ఉనికే లేదు. మనుగడ ప్రశ్నే ఉత్పన్నం అయ్యేది కాదు. అమ్మపాలు మలి భిక్ష. నాన్న పెంపకం మూడో భిక్ష. గురువు పాఠం నాలుగో భిక్ష. ఇక అక్కడనుండీ అంతా భిక్షే భిక్ష.

పంచభూతాల భిక్ష. ప్రకృతి భిక్ష. ఉద్యోగం భిక్ష. జీతం భిక్ష. జీవితం మొత్తం భిక్షే. సంస్కృతం మాట భిక్ష గౌరవంగా అనిపిస్తుంది కానీ…తెలుగు అడుక్కోవడం, అడుక్కు తినడం చాలా అమర్యాదగా, లేకిగా, అసహ్యంగా అనిపిస్తుంది. మన సొంత భాష మనకు చులకన. పెరటి భాష వాడుకకు పనికిరాదు.

అడుక్కుతినడంలోనే సమాజగతి ఆధారపడి ఉంటుంది. ఎవరి స్వశక్తితో వారు సంపాదించుకుని, వారి కాళ్ల మీద వారే నిలబడినట్లు అనిపిస్తుంది కానీ…అడగనిదే అమ్మయినా పెట్టదు కాబట్టి అడుక్కుతినడమే ఆదర్శమయ్యింది. ఇంతకంటే భిక్ష అడుక్కోవడానికి సంబంధించిన తాత్వికత మీద లోతుగా వెళ్లడం సభా మర్యాద కాదు.

ఈమధ్య మూడు వారాలుగా రోజూ మధ్యాహ్నం పూట బఫే భోజనం తినాల్సి వచ్చింది. పైగా అది ఉచిత ప్రాథమిక నిర్బంధ మధ్యాహ్న భోజనం. తప్పనిసరి. ఆ భోజనాన్ని నిరాకరిస్తే ఇక రాత్రి వరకు మెతుకు దొరకదు. మొదటి నుండి బఫే భోజనానికి నేను వ్యతిరేకం. ఎవరికి ఏది నచ్చదో అదే ఎదురుకావడం దేవుడి లీల. సరిగ్గా ఒంటి గంటకు ఒక టోకెన్ ఇస్తే ఒక ప్లేటు ఇస్తారు. మొదట ప్లేటు కోసం క్యూ. ఆ తరువాత ఆ ప్లేటులో అన్నం మెతుకుల భిక్ష వేయించుకోవడానికి క్యూ. అంబలి తాగేవాడికి మీసాలు సవరించేవాడొకడు అన్నట్లు నాకు ప్లేటు తెచ్చి ఇవ్వడానికి మా ఉద్యోగుల సాయం ప్రస్తావనార్హం.

నిలుచుని తినడానికి యుద్ధ విద్యలు, సాము గరిడీలు వచ్చి ఉండాలి. ప్లేటులో మారు వడ్డనకు వెళ్లడం మహా సాహసం. పప్పులో నంజుకు తినడానికి వేసిన వడియాలు ఎయిర్ కూలర్ గాలికి కొట్టుకుపోయేలా ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు చేశారు కాబట్టి ఎవరూ వడియాల జోలికి వెళ్లరు.

నాలుగు రోజులయ్యాక నా చొక్కాల మీద రంగు రంగుల మచ్చలు. ఏ సి లో చేస్తున్న కూలి పనికి ఇలా మచ్చలెలా వచ్చాయో తెలియలేదు. తరువాత రోజు గమనిస్తే అర్థమయ్యింది. కిక్కిరిసిన బఫే భిక్షం దగ్గర అటు ఇటు తిరుగుతూ అన్ని ప్లేట్లల్లో ఉన్న అన్ని ఐటమ్స్ అందరూ శాంపిల్ కు ఒకటి చొప్పున ప్రేమగా అంటించారు. అందులో చికెన్ కలర్ కూడా ఉండడం- తామరాకు మీద నీటి బిందువులా ఏదీ అంటకుండా వెళ్లాలన్న నీతికి సంకేతం.

సాయుధ బలగాల మధ్య భయం భయంగా భోజనం. అంటే నాకు జెడ్ ప్లస్ భద్రత ఉందనుకునేరు. బొడ్లో రివాల్వర్లు, చేతిలో వాకీ టాకీలు ఉన్నవారితో కలిసి తినడం. అన్ని తుపాకుల గొట్టాలు నన్నే గురిపెట్టినట్లు ఆ క్షణం అన్నం మరచి తూటాల గురించే అలోచించాల్సిన అవసరం మరో బాధ.

“లక్షాధికారయిన లవణమన్నమే గాని, మెరుగు బంగారంబు మ్రింగబోడు”
“ఆహారం లేక కృశించినా…సింహం గడ్డి మేస్తుందా?”
“బలి చక్రవర్తి ముందు సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు చేయి చాచలేదా?”
“అడుక్కునే వేళ విశ్వాత్మకుడు మరుగుజ్జు కాలేదా?”
“అన్నం లేకపోతే పోయింది…తాగబోయిన గ్లాసుడు నీళ్లు కూడా మిగలని రంతిదేవుడు”
“అన్నమో రామచంద్రా!”
“చేతిలో అన్నరేఖ”

లాంటి చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, శ్లోకాలు, నుడికారాలు, వాడుక మాటలు గుర్తుకు రావడం సాహిత్య బాధ.

మానావమానాలు, శీతోష్ణ సుఖదుఃఖాల్లో సమదృష్టి సాధించాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎందుకు చెప్పాడో ఇలాంటప్పుడు నాకు కొద్దికొద్దిగా అర్థమవుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది.

Buffet

అడుక్కోవడంలోనే ఉంది మొత్తం ప్రపంచం. దానికి బఫే భిక్షం ఒక ప్రతీక. అందుకే ఉపనయనంలో అడుక్కోవడాన్ని మంత్రపూర్వకంగా నేర్పిస్తారు. అదొక ఆచారం. “భిక్షామ్ దేహి” అని వినయంగా, పద్ధతిగా నేర్చుకున్న సనాతన ధర్మంలో అడుక్కోవడం ఒక మర్యాద. భిక్ష పెట్టడం ఒక సంప్రదాయం.

అందుకే శంకరాచార్యులు-
“భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ!
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే!
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి!”
అని అన్నంతో పాటు జ్ఞాన వైరాగ్యాలను భిక్షగా పెట్టమని ప్రార్థించాడు.

అలాంటి జ్ఞాన వైరాగ్యాలు సులభంగా దొరికే చోటు బఫే భోజనం. ఇందులో ఎవరికయినా అనుమానాలుంటే కిక్కిరిసిన బఫేలో భోంచేసి రండి. మీకు జ్ఞాన వైరాగ్యాలు కలగకపోతే నన్ను మన్నించండి.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్