Friday, March 29, 2024
HomeTrending Newsఎసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవు

ఎసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవు

Grain Purchasing :

దేశంలో ఆహార రక్షణ, భవిష్యత్ అవసరాల కోసం బఫర్ స్టాక్ ఉంచటం రాజ్యాంగ బద్దంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని, నిత్యావసరాల ధరల నుంచి, పెట్రో ధరలు, గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో బిజెపి విఫలమైందని విమర్శించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఈ రోజు మంత్రి వర్గ సమావేశం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన కెసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, పియూష్ గోయల్ తో పాటు బిజెపి పార్టీని దుమ్ము దులిపారు.

మీడియా సమావేశంలో కెసిఆర్ విమర్శలు ఆయన మాటల్లోనే….

దేశ రైతాంగం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం గందరగోళ పరుస్తోంది. లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఓ కిరాణ దుకాణం యజమానిలా మాట్లాడటం తగదు. కొనిసార్లు నిల్వలు పెరిగితే కేంద్రం భరించాలి అందుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలి. భవిష్యత్తులో పార బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాసిస్తేనే ఇప్పుడు తీసుకుంటామని కేంద్రమంత్రి మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నారు. బాయిల్డ్ రైస్ ఒక గింజ తీసుకోమని కేంద్రమంత్రి తెగేసి చెప్పారు. వర్షాకాలం పంటనే తీసుకోలేదు ఇక ఎసంగి పంట సంగతి ఏంది. ఎండాకాలం పంటలో నూకలు ఎక్కువగా వస్తాయి. బియ్యం తక్కువగా వస్తే ఆ నష్టం ఎవరు భరించాలి. అందుకు ప్రతిగా బాయిల్డ్ రైస్ సాగు చేయటం వచ్చింది.

యాసంగి పంట కొనమని కేంద్రం అంటే ఇప్పుడు రైతులు ఏమి చేయాలి. మేము అనేక సమస్యలు ఎదుర్కొని పక్క రాష్ట్రంతో సమస్యలు, రాష్ట్రంలోని కొన్ని పార్టీల వాళ్ళు కేసులు వేసినా విధ్యుత్, సాగు నీటి సమస్యలు పరిష్కరించుకున్నాం. పాత నీటి తీరువా బకాయిలు రద్దు చేసి, పన్నులు తీసుకోని రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. ఒక రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి ఉంటె ప్రజలు సంతోషించాలి. మా దగ్గర ఇదే పండుతుంది అని కేంద్ర పెద్దలకు కిషన్ రెడ్డి సర్ది చెప్పాలి. అంతే కాని కేంద్రం మాటలకే వంత పాడే రండ కేంద్ర మంత్రి ఉండటం అంత అవసరమా? చేతకాని దద్దమ్మ కేంద్రమంత్రి తెలంగాణకు ఎందుకు? మీది రైతు హంతక ప్రభుత్వం. ప్రధానమంత్రి రైతులకు క్షమాపణ చెప్పారు. ఎందుకు చెప్పారు క్షమాపణ? మీది రైతు రాబందు పార్టీ. ఏడు వందల యాభై మంది రైతులను చంపిన పార్టీ. మాది రైతు బంధు పార్టి. రా కావాలంటే రాష్ట్రంలో చూడు ఎన్ని సాగు,తాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేశామో చూడండి.

చమురు ధరలను పెంచింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రం వ్యాట్ తగ్గించాలని ధర్నాలు చేస్తారు. ఇలాంటి పనులతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. వ్యవసాయ శాఖ విధానం లేదు అంటారు మాకు పాలసీ లేనిదీ ఇంత పంట పండిస్తామా? ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం 22 లక్షల టన్నుల ధాన్యం కొన్నది. ఇప్పుడు వరి కల్లాల దగ్గరికి వెళితే రైతులు వారి(బిజెపి నేతల ) భరతం పడతారు. రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర మంత్రి దగ్గరికి వెళితే మీకు పనిలేదా అని అయన ఎలా అడుగుతారు. సాటి లైట్ చూపెట్టడం లేదని, మీ దగ్గర అంత పంట లేదని తర్వాత వాళ్ళే యాభై రెండు లక్షల ఎకరాలు సాగు జరిగిందని అన్నారు. కేంద్రంలోని ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ రైతాంగాన్ని ముంచేదే ఈ విషయం రాష్ట్ర రైతులు, మేధావులు ఆలోచించాలి.

దేశంలో నకిలీ విత్తనాలు అమ్మే వారిని పిడి చట్టం కింద అరెస్టు చేస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణనే ఒకసారి తెలుసుకో కిషన్ రెడ్డి. దేశంలో ఎక్కువ వరి పంట పండిస్తున్నది తెలంగాణ ఈ విషయం తెలవని మంత్రి కిషన్ రెడ్డి ఎదో మాట్లాడుతున్నాడు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మన దేశ స్థానం 101, పాకిస్తాన్ 92 బంగ్లా దేశ, నేపాల్ 76 స్థానాల్లో ఉన్నాయి. అంటే బిజెపి హయంలో దేశం ఎక్కడికి పోతోంది. కేంద్రమంత్రి  పియూష్ గోయల్ ఓ తెలివి తక్కువ కేంద్ర మంత్రి. ఇప్పటికైనా సిగ్గు రావాలి. మన దేశ పరిస్థితి ఈ రోజు ఓ కవి చెప్పినట్టు అన్నపు రాశులు ఒక వైపు, ఆకలి కేకలు మరో వైపు అన్నట్టుగా ఉంది. ఈ ఘనత వహించిన కిషన్ రెడ్డి చాలా మాట్లాడుతున్నాడు. రెండు వేల పదహారులో 96 స్థానంలో ఉంటె ఈ రోజు 101కి చేరింది. వ్యవసాయ రంగాన్ని అదాని, అంబానిలకు అప్ప చెప్పాలని చూస్తే రైతులు తిరగబడ్డారు. యుపి, పంజాబ్ లో ఓడిపోతామని భయంతో ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేశారు.

పొలాల దగ్గర మీటర్లు పెట్టాలని లేదంటే రుణాలు ఇవ్వమని అంటున్నారు. అంటే పొలాల దగ్గర మీటర్లు పెట్టి ఆ తర్వాత మీకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వమని మా రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఈ దేశం బాగుపడాలంటే బిజెపి పార్టీని దేశం నుంచి తరిమి కొట్టాలి. బిజెపి ని  ఢిల్లీ గద్దె దించితేనే దేశం బాగుపడుతుంది. బిజెపి పాలనలో భయంకరమైన పేదరికం పెరిగింది. దేశంలో పాతవి 50 లక్షల కోట్లు ఉంటె 85 లక్షల కోట్లు అప్పులు చేశారు. విభజన రాజకీయాలతో ఈ దేశాన్ని రావణ కాష్టం చేయాలని బిజెపి చూస్తోంది. ఆర్థికంగా తెలంగాణ నంబర్ వన్ స్థానానికి పోతోందని ఇండియా టుడే సర్వే చెపుతోంది. మత రాజకీయాలతో బిజెపి ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది. తెలంగాణలో ఈ రోజు ఐదు ఎకరాలు ఉన్న రైతు కోటీశ్వరుడు. గతంలో రైతులు హైదరాబాద్ కు ఉపాధి కోసం వచ్చే వారు. మేము కల కన్న తెలంగాణ వచ్చింది. గొర్రెల పెంపకంలో గతంలో రాజస్తాన్ ఉంటె ఈ రోజు తెలంగాణ ఉంది.

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు వరి పంటనే వేయండని అంటే కేంద్ర వ్యవసాయ మంత్రి ఆయనను మందలించాడు. తెలంగాణలో  ఎసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో ఈ నిర్ణయం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నాం. నేను మూడు నాలుగు సార్లు అధికారులు 15 సార్లు మంత్రులు ఆరు సార్లు వెళ్ళారు. చివరకు విమాన ఖర్చులు అయినయి కాని వారి నుంచి సమాధానం లేదు. ధాన్యం ఎంత కొంటారో కేంద్రం చెప్పటం లేదు. మేము మిల్లర్లకు అనుకూలం అని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సామాజిక బాధ్యత నుంచి తప్పుకుంటున్న దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం విధానాలతో ఈ ఏడాది ఎండాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు.

వర్షాకాలం పంట మొత్తం మేము కొంటాం, కేంద్రం కొనుగోలు చేయకపోతే ఢిల్లీ లో ఎర్రకోట ముందు పారపోస్తాం. తెలంగాణ రైతులను మోసం చేస్తున్న కిషన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఢిల్లీలో ఈ కిషన్ రెడ్డిని ఎవరు పట్టించుకోరు. వర్షాకాలానికి 40 లక్షల టన్నులు టార్గెట్ కేంద్రం ఇచ్చింది, తెలంగాణలో 90 లక్షల టన్నులు రానున్నాయి. రైతులు ఎవరైనా వారి అవసరాలకు అనుగుణంగా వేస్తె అభ్యంతరం లేదు. తెలంగాణ ప్రభుత్వం తరపున అందాల్సినవి అన్ని ఇస్తాము అందులో ఎలాంటి అనుమానం లేదు. మేము నామినేట్ చేసిన ముఖ్యమంత్రులం కాదు, ప్రజలతో ఎన్నుకున్న ముఖ్యమంత్రులం. విద్యుత్ చట్టాలకు మేము వ్యతిరేకం, రైతు సమస్యలపై కేంద్రాన్ని అన్ని చోట్ల నిలదీస్తాం. ఉత్తరాదిలో చనిపోయిన రైతులకు సాయం మంజూరు చేశాం, త్వరలోనే వారికి అందిస్తాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్