Three Lakh Assistance On Behalf Of Telangana To The Families Of The Deceased Farmer :

ధాన్యం కొనుగోలుపై చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీ వెళ్లి ప్రయత్నం చేస్తామని తెరాస అధినేత కెసిఆర్ ప్రకటించారు. మేము ధర్నా చేసిన రోజు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు చేస్తాం అని కేంద్రం నుంచి వార్తలు వచ్చాయని, ఏది నిజమో ఏది అబద్దమో తెలియదన్నారు. అందుకని స్వయంగా వెళ్లి మంత్రులు, ప్రధానమంత్రిని కలుస్తామని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ నేతలతో కలిసి ఈ రోజు తెలంగాణ భవన్ లో విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. రెండు మూడు రోజులు అక్కడే ఉండి స్పష్టత తీసుకుంటామని కెసిఆర్ అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…

రైతాంగ పోరాట వీరులకు అభినందనలు. ఈ రైతు ఉద్యమాల దరిమలా వారిపై వేల కేసులు పెట్టారు. దేశ ద్రోహం కేసులు కూడా పెట్టారు. అవన్నీ ఉపసంహరించుకోవాలి. దిశా అనే బెంగుళూరు అమ్మాయి మీద కూడా కేసులు విత్ డ్రా చేసుకోవాలని ప్రధానమంత్రిని కోరుతున్నాం. ఈ పోరాటంలో కేంద్ర ప్రభుత్వ దుర్మార్గానికి ఆరు వందల మంది రైతులు చనిపోయారు. చనిపోయిన వారి కుటుంబాలకు మూడు లక్షల చొప్పున తెలంగాణ తరపున సాయం అందిస్తాం.  కేసులు, వేధింపులు తట్టుకొని పోరాటం చేసిన వారిని అభినందిస్తున్నాం.

చనిపోయిన రైతు కుటుంబాలకు కేంద్రం తరపున ఇరవై ఐదు లక్షల సాయం అందించాలి. కేసులు ఎత్తివేయాలి. కనీస మద్దతు ధర చట్టం తీసుకొని రావాలని డిమాండ్ చేస్తున్నాం. దేశానికి అన్నం పెట్టె రైతు కనీస మద్దతు ధర కోరుతున్నారు అందులో తప్పులేదు.

కనీస మద్దతు ధర కావాలని ఈ రోజు 15 కోట్ల రైతు కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మేము పోరాటం కూడా చేస్తాం. ఈ విషయంలో ప్రధానమంత్రి భేషేజాలకు పోకుండా కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలి. భారత దేశంలో అనావృష్టి వస్తే ప్రపంచంలో ఎవరు తీర్చలేరు. తీర్చే స్థితిలో లేరు. అందుకని రైతాంగాన్ని బలోపేతం చేయాలి. ఆత్మనిర్భార్ కన్నా ముందు కృషి నిర్భర్ ప్రకటించాలి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలి.

కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది. చాల సంతోషకరం పనిలో పనిగా విద్యుత్ చట్టం కూడా ఉపసంహరించుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం నష్టపోయింది. మా రైతాంగాన్ని ఆదుకునేందుకు ఉచిత కరెంటు, నీటి తీరువ పన్ను లేకుండా సాగు నీరు అందిస్తున్నాం. ఇప్పుడు నూతన కరెంటు చట్టం తీసుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారు. ఉచిత కరెంటు ఇస్తా అనే రాష్ట్రాలను ఆ చట్టం నుంచి మినహాయించాలి. రాష్ట్రాల మీద కొత్త చట్టాలు రుద్దకూడదు. ఇంకా చట్టం కాలేదు. ఆ విద్యుత్ చట్టాన్ని కూడా విరమించాలని కోరుతున్నాం. విద్యుత్ చట్టాన్ని తెరాస వ్యతిరేకుస్తుంది. విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో మా పార్టీ ఎంపీలు పోరాటం చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 3 కింద హైకోర్టు ఏర్పాటు చేసేందుకే చాలా సమయం తీసుకున్నారు. నీటి వాటా తేల్చాలి. గోదావరి, కృష్ణ నదుల్లో మా న్యాయమైన వాటా ఎంతో తేల్చాలి. ఏడు ఏళ్ళు గడిస్తే ఏ లాభం నీటి వాటా తేల్చ లేదు. దీంతో కొత్త ప్రాజెక్టులు చేపట్ట లేకపోతున్నాం. వాటాలు తేల్చేందుకు నిర్ణీత సమయం పెట్టి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. వాటా తేలితే గందర గోళం పోతుంది. ఏడేళ్ళు ఆగినం ఇక సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దీనికి సంబంధించి కేసు ఉపసంహరించుకున్నాం. వడ్ల విషయంలో కూడా స్పష్టత ఇవ్వాలి.

రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణలో గిరిజన జనాభా పెరిగింది. గిరిజన జనాభాకు అనుగుణంగా తమిళనాడు తరహాలో రిజర్వేషన్ పెంపునకు కేంద్రం సహకరించాలి. దాంతో పాటు సుదీర్ఘంగా ఉన్న డిమాండుకు అనుగుణంగా  ఎస్సి విభజన చేయాలని  అసెంబ్లీలో తీర్మానం చేశాం. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలి. కులాల గణన చేపట్టాలి. కుల గణన సున్నితమైన అంశం అంటారు. అందులో ఎం మతలబు ఉంది. మనమే కులాల వారిగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. బీసీలు తమ జనాభా ఎంత ఉందో తెలుసుకోవాలనుకోవటంలో తప్పు లేదు. అందులో ఏముంది. లేని వివాదాన్ని తయారు చేయటం తప్పితే. రాబోయే జనగణనలో కులాల వారిగా జనాభా లెక్కలు చేపట్టాలి.

ఏడాది లో ఎంత వడ్లు కొంటారో ప్రకటించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారుల బృందం,పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో మంత్రుల బృందం రేపు ఢిల్లీ వెళ్తుంది. నేను కూడా ఢిల్లీ లో అందుబాటులో ఉంటాను. మంత్రులతోపాటు ప్రధానమంత్రి సమయం ఇస్తే ఖచ్చితంగా కలుస్తాం.

రాష్ట్ర రైతాంగానికి మరోసారి చెపుతున్నాం. చివరి గింజ వరకు వర్షాకాలం ధాన్యం ప్రభుత్వం కొంటది. అందుకని ఎవరు ఆందోళన చెందవద్దు. గతంలో మాదిరిగా డబ్బులు కూడా చెల్లిస్తాం. ఏసంగిలో ఏ పంటలు వేయాలో ఢిల్లీ వెళ్లి వచ్చాక ప్రకటిస్తాం.

కృష్ణ, గోదావరి నదుల్లో వాటా కోసం ట్రిబ్యునల్ ను ఆదేశించమంటే ఎందుకు చేయటం లేదు. రాష్ట్రం వచ్చిన మొదటి రోజు నుంచి అడుగుతున్నాం. ట్రిబ్యునల్ వేస్తామంటే మేము వద్దు అంటున్నామా? మన రాష్ట్రం నుంచి కూడా కేంద్ర మంత్రి ఉన్నాడు ఏం చేస్తున్నాడు. ఆయనకు ఎవరు అడ్డం పడుతున్నారు.

వ్యవసాయ చట్టాలను మేము పార్లమెంటు ఉభయసభల్లో వ్యతిరేకించాం. మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ దేశంలో ఎవరు నమ్మటం లేదు. కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే రద్దు ప్రకటన చేశారని అందరు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భార్ కన్నా ముందు కృషి నిర్భర్ ప్రకటించాలి. కనీస మద్దతు ధర ప్రకటించి రైతాంగాన్ని బలోపేతం చేయాలి.

Also Read :చుక్కా రామ‌య్య‌ను కలిసిన మంత్రి ఎర్రబెల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *