Saturday, January 18, 2025
HomeTrending Newsలోక్ సభలో చెలరేగిన రాహుల్ గాంధి

లోక్ సభలో చెలరేగిన రాహుల్ గాంధి

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధి మొదటి ప్రసంగంలోనే అధికార పక్షానికి చురకలు అంటిస్తూ వాడి వేడిగా ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ అధికార పక్షానికి చెమటలు పట్టించారు. అయోధ్యలో బిజెపి ఓటమి, సైన్యంలో అగ్నివీర్ జవాన్ల పాత్రపై రాహుల్ లేవనెత్తిన అంశాలపై సభలో అధికార, విపక్షాల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం సాగింది. సైన్యంలో కొందరికి పదవీ విరమణ తర్వాత పథకాలు వర్తిస్తే… మరికొందరికి వర్తించకపోతే అసమానతలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఓ అగ్నివీర్ .. ల్యాండ్‌మైన్ పేలుడులో ప్రాణాలు కోల్పోయాడ‌ని, అత‌న్ని తాను అమ‌రుడిగా పిలుస్తాన‌ని, కానీ ఈ ప్ర‌భుత్వం పిల‌వ‌డం లేద‌ని, ఆ వీరుడి కుటుంబానికి ఎటువంటి ల‌బ్ధి చేకూర‌డం లేద‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ స‌మ‌యంలో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ జోక్యం చేసుకున్నారు. యాక్ష‌న్‌లో ఉన్న అగ్నివీర్ చ‌నిపోతే కోటి సాయాన్ని ఇస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. త‌ప్పుడు స్టేట్మెంట్ల‌తో స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌వ‌ద్దు అని పేర్కొన్నారు.

మణిపూర్ లో రెండు వర్గాల మధ్య అల్లర్లు రాజుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు రాష్ట్రాన్ని సందర్శించకపోవటం సిగ్గుచేటని ఘాటుగా విమర్శించారు. కుకి, మైతాయి వర్గాల మధ్య అల్లర్లు చెలరేగితే రాజీ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం… అసమంజస విధానాలతో గొడవలు మరింత రాజేసిందని ధ్వజమెత్తారు.

నోట్ల రద్దు చేసి జిఎస్టి పేరుతో చిన్న వ్యాపారులకు నష్టం చేకూర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. గుజరాత్ లో రాబోయే ఎన్నికల్లో బిజెపిని కాంగ్రెస్ ఓడిస్తుందని ఈ సందర్భంగా రాహుల్ సవాల్ చేశారు.

మద్దతు ధర కోసం రైతులు ఆందోళన చేస్తుంటే వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేశారని ఆరోపించారు. 700 వందల మంది రైతులు చనిపోతే పార్లమెంటులో సంతాపం తెలిపేందుకు కనీసం అవకాశం ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు.

నీట్ పరీక్షను వ్యాపారంగా మార్చేశారని… మెరిట్ విద్యార్థులకు నష్టం చేసి… ధనవంతుల పిల్లలకు మేలు చేకూర్చేలా పరీక్ష నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే హయంలో ఏడేళ్ళలో డెబ్బై సార్లు పోటీ పరీక్షలు లీకయ్యాయని ఆరోపించారు. కోటా కేంద్రంగా కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. కేంద్రప్రభుత్వం నిర్వాకంతో కష్టపడి చదివిన విద్యార్థులు నిరశాకు గురయ్యారని… నీట్ పరీక్ష తెలివితేటలు కలిగిన వారికి నిరుపయోగమని విద్యార్థి లోకం గ్రహించిందని రాహుల్ అన్నారు.

లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధి తన మొదటి ప్రసంగంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. రాహుల్ గాంధి ఇదే రీతిలో అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తే రాబోయే అయిదేళ్ళు ఎన్డీయే ప్రభుత్వానికి కత్తి మీద సాము కానుందని హెచ్చరిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్