Friday, November 22, 2024
HomeTrending Newsరాయ్ బరేలి వైపే రాహుల్ గాంధి మొగ్గు

రాయ్ బరేలి వైపే రాహుల్ గాంధి మొగ్గు

కేర‌ళ‌లోని వ‌య‌నాడ్, యూపీలోని రాయ్‌బ‌రేలీ నుంచి రాహుల్ గాంధీ లోక్‌స‌భ‌కు ఎన్నికయ్యారు. రెండింటిలో ఒకదాన్ని వదులుకోవల్సి వస్తే వ‌య‌నాడ్ సీటును రాహుల్ గాంధీ ఖాళీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రాయ్‌బ‌రేలీ ఎంపీ సీటు ఉంచుకొని, యూపీలో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంటుంద‌ని యూపీ కాంగ్రెస్ క‌మిటీ పేర్కొన్న‌ది. రాయ్ బరేలి గాంధీ కుటుంబానికి కంచుకోట.. వారసత్వంగా వస్తున్న సీటు పటిష్టం చేసి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన పార్టీ నాయకత్వంలో ఉంది. వ‌య‌నాడ్‌లోనే ఉండాల‌ని తొలుత కేర‌ళ కాంగ్రెస్  కోరినా.. యూపీ కాంగ్రెస్ అభ్య‌ర్థ‌న మేరకు వాళ్లు వెన‌క్కి త‌గ్గారని సమాచారం.

వ‌య‌నాడ్ నుంచి 3,64,422 ఓట్ల తేడాతో రాహుల్ గాంధీ గెలిచినా.. 2019 నాటి ఫ‌లితాల‌తో పోలిస్తే సుమారు 67,348 ఓట్ల సంఖ్య త‌గ్గింది. వ‌య‌నాడ్‌లో అన్నా రాజాను ఓడించ‌గా, రాయ్‌బ‌రేలీలో దినేశ్ ప్ర‌తాప్ సింగ్‌పై 3,89,341 ఓట్ల‌తో విక్ట‌రీ కొట్టారు. శ‌నివారం జ‌రిగిన కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ మీటింగ్‌లో దీనిపై చ‌ర్చ జరిగినట్లు తెలుస్తోంది. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించిన త‌ర్వాత దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలుబ‌డే అవ‌కాశాలున్నాయి.

వ‌య‌నాడ్ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ప్రియాంకా గాంధీ పోటీ చేయాల‌న్న అభ్య‌ర్థ‌న‌ను గాంధీ కుటుంబం తిర‌స్క‌రించిన‌ట్లు తెలుస్తోంది. కేర‌ళ‌కు చెందిన సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌ను వ‌య‌నాడ్ నుంచి రంగంలోకి దింపాల‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఏ సీటు వదులుకునేది ఫలితాలు వెలువడిన రెండు వారాల్లోగా స్పష్టత ఇవ్వాలని, ఈ నెల 17వ తేదీలోగా స్పష్టం చేయాలని పార్లమెంటు సచివాలయంలో పదవి విరమణ చేసిన అధికారులు పేర్కొన్నారు.

రాయ్ బరేలి వదులుకుంటే బిజెపితో గట్టిగా పోరాడాల్సి ఉంటుంది. సిఎం యోగి, పిఎం మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ తో తలపడే సూచనలు ఉన్నాయి. అదే వయనాడ్ లో సీటు వదులుకుంటే కాంగ్రెస్ కు దక్కవచ్చు. లేదంటే మిత్రపక్షాలైన వామపక్షాల ఖాతాలో పడే అవకాశం ఉంది. దీంతో వచ్చే నష్టం లేదు.

రాయ్ బరేలి స్థానం గాంధీ కుటుంబానికి వంశ పారంపర్యంగా వస్తోంది. దీంతో ఇటువైపే రాహుల్ మొగ్గు చూపుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. యుపిలో బిజెపిని తిరస్కరించిన ప్రజలకు అందుబాటులో ఉండి, ఉత్తరాదిలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని పార్టీలో చర్చ జరుగుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్