ఢిల్లీలో సీడబ్ల్యూసీ విస్తృత సమావేశం శనివారం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీశ్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
సీడబ్ల్యూసీ సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ అధికార ప్రతినిధి జైరామ్ రమేశ్ మీడియాతో మాట్లాడారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని సీడబ్ల్యూసీ సమావేశంలో తాము ఏకగ్రీవంగా ప్రతిపాదన చేశామని కేసీ వేణుగోపాల్ చెప్పారు.
తమ ప్రతిపాదనపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని రాహుల్‌గాంధీ చెప్పారని ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారని అన్నారు. రెండు చోట్ల గెలిచిన రాహుల్‌గాంధీ ఏ స్థానానికి రాజీనామా చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్లమెంటరి పక్షనేతగా సోనియాగాంధీ ఎన్నుకున్నట్టు వెల్లడించారు.