ఢిల్లీ, నేషనల్ కేపిటల్ రీజియన్‌లలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం పడింది. ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), పరిసర ప్రాంతాల్లో శనివారం ఒక మోస్తరు నుంచి భారీ తీవ్రతతో కూడిన ఉరుములతో వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం తెల్లవారుజామున 4.55 గంటలకు ట్వీట్ చేసింది. ఢిల్లీ, ఢిల్లీ-ఎన్సీఆర్ (గురుగ్రామ్, ఫరీదాబాద్, మనేసర్, బల్లభ్‌గఢ్) కర్నాల్, పానిపట్, మట్టన్‌హైల్, ఝజ్జర్, ఫరూఖ్‌నగర్, కోసలి, రేవారీ, బవాల్, నూహ్ (హర్యానా) పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. షామ్లీ, కంధ్లా, బరౌత్, బాగ్‌పత్ (ఉత్తర ప్రదేశ్), భివారీ (రాజస్థాన్)లలో భారీవర్షం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. గురుగ్రామ్ లో ఈ సీజన్ కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఢిల్లీలో గాలులు వీస్తుండటంతో గాలి నాణ్యత కొంత మెరుగుపడింది.