దేశంలోని వివిధ రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు వర్షాలతోపాటు తీవ్ర చలిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వాతావరణశాఖ అధికారులు శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో ఈ హెచ్చరిక జారీ చేసింది. జనవరి 29,31 తేదీల్లో జమ్మూకశ్మీర్,లడఖ్, గిల్గిట్, బాల్టిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ ప్రాంతాల్లో వర్షాలతో పాటు మంచు తీవ్ర స్థాయిలో పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
జమ్ముకాశ్మీర్, లద్దాక్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా పడుతున్న హిమపాతంతో జనజీవనం స్తంభించింది. అత్యవసర సరుకు రవాణా వాహనాలు మినహా మిగతా వాటి రాకపోకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో తేలికపాటి నుంచి భారీవర్షాలు,మంచు కురిసే అవకాశముందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
రాబోయే రెండు రోజుల్లో తూర్పు భారతదేశంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్, సిక్కిం రాజధాని గ్యాంగ్ టాక్ నగరాలను మంచు దుప్పటి కప్పేసింది. ఉత్తర సిక్కిం లోని యుమ్ తాంగ్ లోయ, లచుంగ్ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోగా ప్రఖ్యాత చంగు లేక్ మంచు గడ్డగా మారింది. వేకువ జామున అయిదు గంటలకే పర్యాటకులను ఆకట్టుకునే కంచన్ జంగా పర్వతం 11 గంటలవరకు కనిపించటం లేదు.
Also Read : లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకం రెపరెపలు