Friday, March 29, 2024
HomeTrending NewsRaitha Siri : కర్ణాటకలో జీవనజ్యోతి పేరుతో రైతుబీమా

Raitha Siri : కర్ణాటకలో జీవనజ్యోతి పేరుతో రైతుబీమా

రైతును రాజును చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ర్టాలు అమలు చేస్తుండగా, తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటక పథకాల పేర్లు మార్చి అమలు చేసేందుకు సిద్ధమైంది.

రైతుబంధు పథకాన్ని ‘రైత సిరి’, రైతుబీమా పథకాన్ని ‘జీవనజ్యోతి’ పేరుతో అమలు చేయాలని అక్కడి సర్కారు నిర్ణయించింది. జీవనజ్యోతి పథకం అమలుకు తాజా బడ్జెట్‌లో రూ.180 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా కర్ణాటకలో సుమారు 56 లక్షల మంది రైతులకు బీమా సౌకర్యం కలుగనున్నది. రైతుబీమా పథకం కింద తెలంగాణలో రూ.5 లక్షల పరిహారం ఇస్తుండగా, కర్ణాటకలో రూ.2 లక్షలకే పరిమితం చేశారు. రైతులు అకాల మరణం చెందితే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ దేశంలోనే తొలిసారి 2018లో రైతుబీమా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద రైతు ఏ కారణంతో మరణించినా వారం రోజుల్లోనే రూ.5 లక్షల ఆర్థిక సాయం ఆ రైతు కుటుంబానికి అందుతున్నది. ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుండటం గమనార్హం. ఇందుకోసం ప్రతి బడ్జెట్‌లో రూ.1000 నుంచి 1,500 కోట్ల వరకు కేటాయిస్తున్నది. వచ్చే వార్షిక బడ్జెట్‌లోనూ రూ.1,589 కోట్లు ప్రతిపాదించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు సుమారు 97 వేల మంది రైతు కుటుంబాలకు రూ.4,803 కోట్ల ఆర్థిక సాయం అందించింది.

రైతుసిరిగా రైతుబంధు
పంట పెట్టుబడి కోసం రైతులు అప్పులపాలు కావొద్దన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున ఎన్ని ఎకరాలున్నా సాయం అందజేస్తున్నది. మన రైతుబంధు పథకాన్ని రైతుసిరి పేరుతో కర్ణాటకలోని బొమ్మై ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ మాదిరిగానే ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నది. అయితే తెలంగాణలో ఏ పంట పండించినా రైతుబంధు సాయం అందుతుండగా, కర్ణాటకలో మాత్రం చిరుధాన్యాలు సాగు చేసే రైతులకే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అది కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే రైతులకు ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లే తమ రాష్ట్రంలో జీవనజ్యోతి బీమా పథకం అమలు చేయనుండటం పట్ల కర్ణాటక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఏపీలో రైతుబంధు తరహా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. ఎకరానికి రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో సాయం అందిస్తున్నది. మిషన్‌ భగీరథ పథకాన్ని హర్‌ ఘర్‌ జల్‌, మిషన్‌ కాకతీయను అమృత్‌ సరోవర్‌ పేరుతో అమలు చేస్తున్నది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్