Sunday, January 19, 2025
Homeసినిమాతరాలు మారినా మరువలేని హాస్యం....

తరాలు మారినా మరువలేని హాస్యం….

రాజబాబు .. హాయిగా నవ్వుకునే పేరు .. హాస్యం పుట్టిపెరిగిన ఊరు. ఈ పేరు వింటేనే ఎవరి ముఖంపై నైనా నవ్వు వికసిస్తుంది. ఆయన చేసిన పాత్రలు కొన్ని కళ్ల ముందు కదలాడతాయి. ఆయన  డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ గుర్తుకొస్తుంది. నవరసాలలో హాస్యరసమే కష్టమైనదని ఎంతోమంది మహానుభావులు సెలవిచ్చారు. అలాంటి హాస్యాన్ని అవలీలగా పండిస్తూ ..  పసందుగా వడ్డించిన నటుడు రాజబాబు. తెరపై  ఆయన కనిపించగానే థియేటర్లలో సందడి మొదలయ్యేది. ఆయన ఎంట్రీ తోనే థియేటర్లు నవ్వుల నదిలా మారిపోయేవి. అంతలా రాజబాబు హాస్యాన్ని పరుగులు తీయించారు .. ప్రేక్షకులను ప్రభావితం చేశారు.

రాజబాబు  అసలుపేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. పశ్చిమ గోదావరి జిల్లా ‘నరసాపురం’లో ఓ మధ్యతరగతి కుటుంబంలో  ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. నాటకాల్లో కూడా ఆయన తనదైన ప్రత్యేకతను కనబరిచేవారు. నాటకం ఏదైనా ఆయన ప్రత్యేకంగా కనిపించేవారు. అందుకు కారణం అక్కడ కూడా ఆయన తనదైన స్టైల్లో సందడి చేయడమే. అలా నాటకాలలో రాజబాబు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాప్యులర్ అయ్యారు. అలా ఒకసారి ఆయన వేసిన నాటకాన్ని ప్రముఖ దర్శక నిర్మాత ‘గరికపాటి రాజారావు’ చూసి అభినందించారు. సినిమాల్లో ట్రై చేయమని సలహా కూడా ఇచ్చారు. 

అప్పటి నుంచి రాజబాబులో సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన మొదలైంది. సినిమాల్లోకి వెళితే  పేరుకు పేరు .. డబ్బుకు డబ్బు .. పైగా నాటకరంగం నుంచి వెళ్లిన వాళ్లకి అక్కడ ఆదరణ లభిస్తోంది. తనకంటే ముందుగా వెళ్లిన వారు చాలామంది అక్కడ సెటిల్ అయ్యారు అనిపించగానే రాజబాబు ఇక ఆలస్యం చేయలేదు. ఏదైతే అదే కానీ అనుకుని ధైర్యంగా చెన్నై రైలు ఎక్కేశారు. ఆవేశంతో చెన్నై అయితే వెళ్లారుగానీ అక్కడ ఎవరూ తెలియదు .. ఎక్కడి నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాలనేదీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో హాస్య నటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు పాఠాలు చెబుతూ, ఆయన ద్వారా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు.

ఆయన రాజబాబును వెంటబెట్టుకుని సినిమా కంపెనీలకు తిప్పుతూ, ‘సమాజం’ అనే సినిమాలో చిన్న వేషం ఇప్పించారు. అప్పటి నుంచి చిన్నచిన్న పాత్రలు వేస్తూ .. వచ్చిన చిన్న మొత్తంతోనే సర్దుకుంటూ ముందుసాగారు. హాస్యనటుడిగా తనకి సరైన పాత్ర పడటానికీ .. తన ప్రత్యేకత నలుగురికి తెలియడానికి  రాజబాబుకి కొంత సమయం పట్టింది. ఒక వైపున అల్లు రామలింగయ్య .. మరో వైపున పద్మనాభం  గట్టిపోటీ ఇస్తున్నప్పటికీ, రాజబాబు తనదైన ప్రత్యేకతను  చాటుతూ దూసుకుపోవడం మొదలుపెట్టారు. డైలాగ్ .. ఎక్స్ ప్రెషన్ .. టైమింగ్ .. ఎక్కడ తడుముకోకపోవడం .. ఇవన్నీ కూడా రాజబాబుకి అవకాశాలను పెంచుతూ వెళ్లాయి. 

ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ . శోభన్ బాబు వంటి స్టార్ హీరోలు, తమకి దర్శక నిర్మాతలు కథ వినిపిస్తే, అందులో రాజబాబును ఏ పాత్ర కోసం అనుకుంటున్నారు? అని అడిగేవారట. ఇక తమ డేట్స్  సంగతి తరువాత,  ముందుగా రాజబాబు డేట్లు ఉన్నాయో లేదో కనుక్కోండి అనేవారట. ఆ స్థాయికి రాజబాబు వెళ్లిపోయారు. ఇక  రేలంగి – గిరిజ తరువాత ఆ స్థాయిలో పాప్యులర్ అయింది రాజబాబు – రమాప్రభ జోడీనే. కథ ఏదైనా .. హీరో హీరోయిన్లు ఎవరైనా అందులో తప్పకుండా రాజబాబు – రమాప్రభ ట్రాక్ ఉండవలసిందే, వాళ్లపై ఒక పాట ఉండవలసిందే.

అందువల్లనే అప్పట్లో ఈ జోడీ లేని సినిమా అంటూ ఉండేది కాదు. ఆ సమయంలో ఆయన హీరోలతో  సమానమైన పారితోషికం అందుకోవడం విశేషంగా చెప్పుకునేవారు. అవకాశాల కోసం చెన్నై వీధుల్లో పాత సైకిల్ పై తిరిగిన రాజబాబు, ఆ తరువాత ఖరీదైన కార్లలో తిరిగారు. అంతటి ఖరీదైన కారు అప్పట్లో అతి తక్కువ మందికి మాత్రమే ఉండేదట. ‘తాతా మనవడు’ .. ‘పిచ్చోడి పెళ్లి’ వంట కొన్ని సినిమాల్లో ఆయన కథానాయకుడిగా కూడా కనిపిస్తారు. నిర్మాతగా కూడా కొన్ని ప్రయోగాలు చేశారు. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా దశాబ్దాలపాటు నవ్వించడం ఆయనకి మాత్రమే సాధ్యమైంది. 

అలా 500 సినిమాలకు పైగా ఆయన నటించగలిగారు. వరుసగా ఏడుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న తొలి హాస్యనటుడిగా ఆయన పేరుపై ఒక రికార్డు ఉంది. అంతేకాదు ఈ ‘శతాబ్దపు హాస్యనటుడు’ అనిపించుకున్నారు. రాజబాబు స్టార్ స్టేటస్ .. ఆయన అనుభవించే వైభవం చూసినవారు, చాలా గర్వం ఉంటుందని అనుకుంటారు. కానీ ఆయన చాలా సున్నితమైన మనసున్నవారనే విషయం, ఆయన జీవితాన్ని పరిశీలిస్తే  అర్థమవుతుంది. ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నా ఆదుకోవడంలో ఆయనే ముందుండేవారు. మనిషికి మనిషే సాయం చేయాలి అనే కాన్సెప్ట్ తోనే ఆయన ముందుకు వెళ్లారు.

తనకంటే సీనియర్ కళాకారులను సత్కరించడం .. ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్న పేద కళాకారులను  ఆదుకోవడం చేసేవారు. కోరుకొండలో తన పేరుతో ఒక కళాశాల కట్టించారు. అంతేకాదు అనేక విద్యాలయాలకు విరాళాలు ఇచ్చేవారు. ఇక ఆయనకి సావిత్రి అంటే ఎంతో అభిమానం. చివరి రోజుల్లో ఆమెకి అండగా నిలిచిన అతికొద్దిమందిలో రాజబాబు ఒకరు. తెరపై నవ్వించడమే కాదు, తనకళ్ల ముందు ఎవరూ బాధపడకుండా చూడగలిగిన మంచి మనసున్న గొప్ప నటుడు రాజబాబు. ఎన్నితరాలు మారినా ఎప్పటికీ మరిచిపోలేని నవ్వుల దొరబాబు ఆయనే. ఈ రోజున ఆయన జయంతి .. ఈ సందర్భంగా మనసారా ఓ సారి ఆయనను స్మరించుకుందాం.

(జయంతి ప్రత్యేకం)

– పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్