Friday, April 26, 2024
HomeTrending Newsఇది చంద్రబాబు వికృత క్రీడ : శ్రీకాంత్ రెడ్డి

ఇది చంద్రబాబు వికృత క్రీడ : శ్రీకాంత్ రెడ్డి

సొంత పార్టీని కాపాడుకోలేక చంద్రబాబు ఇలాంటి రాజకీయ వికృత క్రీడలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ స్వలాభం కోసం ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారని విమర్శించారు.  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికే ప్రజలు ఎన్నోసార్లు టిడిపికి, చంద్రబాబుకి బుద్ధి చెప్పారని, రాబోయే రోజుల్లో టిడిపికి మరోసారి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

చంద్రబాబునాయుడే పట్టాభితో మాట్లాడించారని, రాజకీయాల్లో 40 ఏళ్ల చరిత్ర అని చెప్పుకునే చంద్రబాబు తన అనుచరులతో మాట్లాడించిన తీరు దారుణమని వ్యాఖ్యానించారు. ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో విజయవాడలో లేని వ్యక్తి ముందస్తు ప్రణాళికల ప్రకారం రెచ్చగొట్టడం కోసమే హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చారని ఆరోపించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడాలానే ధోరణిలో చంద్రబాబు తీరు ఉందని, తన రాజకీయ విష క్రీడలో ఘోరాతి ఘోరంగా ముఖ్యమంత్రిపై చంద్రబాబు వ్యాఖ్యలు చేయించారని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇన్ని రోజులు సంయమనంతో ఉండాలని సిఎం జగన్ కోరారని, కార్యకర్తలు, నాయకులు సంయమనం కోల్పోయే పరిస్థితి చంద్రబాబు తెస్తున్నారని ధ్వజమెత్తారు. వయసు పెరిగే కొద్దీ చంద్రబాబు తీరు దారుణంగా తయారైందన్నారు. పట్టాభి మాట్లాడిన మాటలు కన్న తల్లులు, ఆడవారిని కించపరిచేలా లేవా అని సూటిగా ప్రశ్నించారు. ఎందుకు ఇంత దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నారో అర్ధం కావడంలేదన్నారు.

పట్టాభి మాట్లాడే మాటలు ఎవరికి వర్తిస్తాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మగాడి లాగా దేశ చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని, మీరు మాట్లాడిన పదాలు, వ్యాఖ్యలు మీకే వర్తిస్తాయని అన్నారు.

ప్రజాస్వామ్య విలువలు కాపాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు సంయమనం కోల్పోరని, సహనంతో ఉంటారని… పదవి రాదు అన్న భయంతో చంద్రబాబు ఇలా చేయిస్తున్నారని, ఇది పద్ధతి కాదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజాభిమానం పొందేందుకు ప్రయత్నం చేయాలి కానీ ఇలా నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పై ఏవైనా తప్పులు ఉంటే నేరుగా తెలియజేయాలి కానీ చంద్రబాబు కు హుందాతనం ఉంటే వెంటనే పట్టాభితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్