Hard Work:
ఆస్కార్ అవార్డు కోసం లాబీయింగ్ చేసారా?
మేనేజ్ చేయడం వల్లే ఆస్కార్ నామినేషన్ వరకు వచ్చారా?
కోట్లలో డబ్బు ఖర్చు చేసారా?
అలా చేయడం తప్పా?
మీరెప్పుడైనా మేజిక్ షోకి వెళ్ళారా?
ఆడియన్స్ లో రెండు రకాలుంటారు.
కొందరు ప్రతి ఫీట్ ని అద్భుతంలా చూసి ఆశ్చర్యపోతూ ఎంజాయ్ చేస్తారు.
ఇంకొందరు… ఆ.. ఏవుంది.. వాడి షర్ట్ లో దాచిపెట్టాడు అని తేల్చేస్తారు.
నిజంగానే మేజిక్ లో మంత్రతంత్రాలేం వుండవు..
ఎక్కడో ఒక చోట దాచిందే తీయాలి.
ఎంత లాఘవంగా , ఎంత మాయచేసి, మన కళ్ళను మనమే నమ్మలేకుండా చేయడమే మేజిక్.
అదొక టెక్నిక్. అదొక విద్య. అదొక సైన్స్.
ఇప్పుడు నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ చుట్టూ జరుగుతున్న చర్చ చూడండి.
కొంత మందికి ఇదంతా ఒక అద్భుతం.
తెలుగు సినిమా సాధించిన మహా విజయం.
రాజమౌళి మాయాజాలం.
మరికొందరికి అబ్బే ఇదంతా రాజమౌళి లాబీయింగ్.
మార్కెటింగ్, డబ్బు పెట్టి చేసిన మేనేజ్మెంట్.
ఇంతకీ ఆస్కార్ అవార్డుల కోసం లాబీయింగ్ చేయడం తప్పా?
కాంపెయిన్ కి ఖర్చు పెడితే డబ్బిచ్చి కొనుక్కున్నట్టా?
ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్కార్ అవార్డులంటేనే లాబీయింగ్..
ఇందులో తప్పు లేదు కదా.. తన సినిమా మీద నమ్మకం వున్నవాళ్ళెవరైనా చెయ్యాల్సిందిదే.
అసలు ఆస్కార్ ప్రక్రియలోనే లాబీయింగ్ ఒక భాగం.
నిజానికి ఇప్పటి వరకు మన సినిమా పరిశ్రమ ఈ విషయం మీద దృష్టిపెట్టకపోవడమే తప్పు.
ఎంత సేపూ గొప్పసినిమా తీస్తే ఆస్కార్ అవార్డు వచ్చేస్తుందన్న అపోహలోనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వుండిపోయింది.
ఒకటీ అరా సినిమాలకి అమెరికాలో మార్కెట్ కోసం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు హడావిడి చేయడం తప్ప ఆస్కార్ రేసులో్ ఇండియన్ ప్రొడ్యూసర్లు సీరియస్ గా పార్టిసిపేట్ చేసిందేలేదు.
ఏదో ఇంటర్నేషనల్ ఫిల్మ్ అని ఒక కేటగరీ వుంది కాబట్టీ, ప్రభుత్వం ఒక సినిమాని పంపేసి ఊరుకుంటుంది.
ఆ తర్వాత ఆ ఎంట్రీని ఫాలో అప్ చేసే నాధుడే వుండడు.
అందుకే ఇప్పటి వరకు ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్ళిన ఇండియా సినిమాలు మూడే.
అన్ని భాషలు కలిపి ఏడాదికి దాదాపు అయిదారు వందలుసినిమాలు తయారయినా.. ఆస్కార్ వేదిక మీద వాటికి అసలు గుర్తింపే లేదు.
కానీ, రాజమౌళి అందరి లాంటి వాడు కాదు.
తనకి కల గనడం తెలుసు, అది నెరవేర్చుకోవడం తెలుసు.
అతని సినిమాల్లో అద్భుతమైన కథా, కథనాలు వుండకపోవచ్చు.
కానీ, సినిమా అనే మాధ్యమం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయాలని అతను నమ్ముతాడు.
అలా చేయడానికి ఎంత కష్టమైనా పడతాడు. ఎన్నాళ్లైనా కష్టపడతాడు.
అలా కష్టపడి తెరకెక్కించిన సినిమాని అంతే గొప్పగా పబ్లిసిటీ ఇవ్వడానికి అతనేం మొహమాటపడడు.
ఒక్క ప్రకటన ఇవ్వకుండా మొత్తం మీడియా తన సినిమా గురించే మాట్లాడేలా చేయగల మాంత్రికుడు రాజమౌళి.
తన ప్రొడక్ట్ మీద అపారమైన నమ్మకమున్న సేల్స్ మ్యాన్ రాజమౌళి.
ఆ నమ్మకంతోనే ఇప్పుడు ఆస్కార్ వీధుల్లో కూడా తన సినిమాను సక్సెస్ ఫుల్ గా అమ్మగలిగాడు.
ప్రభుత్వాలతో పని లేకుండా సినిమాని నామినేషన్ వరకు తీసుకెళ్ళగలిగాడు.
ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించాడు.
ఇదంతా ఆషామాషీగా జరగదు.
క్యాంపెయన్, లాబీయింగ్, మార్కెటింగ్..
ఏ పేరైనా పెట్టండి.
ప్రపంచం అంతా వుండే ముక్కు మొహం తెలియని వేలాది మంది ఆస్కార్ వోటర్లకు ఒక తెలుగుసినిమాని, అందులో ఒక పాటని పరిచయం చేయడం అంటే ఉట్టి మాటలతో జరగదు.
అనేక స్క్రీనింగ్స్ జరగాలి.
ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొనాలి.
అంతర్జాతీయ సినీవిమర్శకులను ఆకర్షించాలి.
ఫిల్మ్ జర్నల్స్ లో , వివిధ మీడియాల్లో ఈ సినిమా, అందులో గొప్పతనం గురించి చర్చ జరగాలి.
ఇదంతా నోటిమాటలతో జరగదు.
అందుకే రాజమౌళి అండ్ టీమ్ దాదాపు రెండు మూడు నెలలు అమెరికా , యూరోప్ లో తిరిగింది.
పలు అంతర్జాతీయ మీడియా మేనేజ్మెంట్ సంస్థలని రంగంలోకి దించింది.
దానికి కొన్ని కోట్లు ఖర్చయితే అయుంటుంది.
అదేం రహస్యం కాదు.
తాను ఏయే పబ్లిసిటీ సంస్థలతో కలిసి పనిచేసిందీ, రాజమౌళి పబ్లిక్ గా ట్వీట్ చేసాడు.
ఇదంతా ఒక అవార్డు కోసం మాత్రమే పడే తపన కాదు..
తన చేసిన పని , తాను కన్నకల, తాను సృష్టించిన కళ మీద రాజమౌళికి వున్న నమ్మకం.
ఈ అవార్డుతో కొత్తగా రాజమౌళికి వచ్చేదేం వుండదు.
కానీ, నిజంగా ఆస్కార్ వస్తే, ఇండియన్ సినిమాకి, ప్రత్యేకించి తెలుగు సినిమాకు జరిగేమేలు చాలా వుంటుంది.
ఒక పాన్ ఇండియా సినిమా అనే నిర్వచనాన్ని రాజమౌళి ఎలా నిజం చేసాడో..
అంతర్జాతీయ పురస్కారం అనే గౌరవాన్ని కూడా అలాగే సాధిస్తాడని ఆశిద్దాం.
-శివప్రసాద్
Also Read :