Saturday, February 22, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంత్రిబుల్ ఆర్ పుస్తకం

త్రిబుల్ ఆర్ పుస్తకం

RRR philosophy: RRR అంతా భారీతనమే. బడ్జెట్, స్టార్ కాస్ట్, గ్రాఫిక్స్ నుండి కలెక్షన్ల దాకా. ప్రతీ సీన్ లోనూ భారీతనమే. సినిమా ఏ.రామరాజు (రాంచరణ్ పాత్ర) చదుకున్నవాడు. సినిమా భీం (ఎన్టీఆర్ పాత్ర) చదువురానివాడు. సినిమా చివరి సీన్ లో ఏ. రామరాజు ని భీం అడుగుతాడు ‘చదువు చెప్పించమని’. RRR కొన్ని సీన్లలో ఏ. రామరాజు రూమ్ నిండా పుస్తకాలే. ఆ సీన్లలో పుస్తకాల విషయంలోనూ రాజమౌళి భారీతనం చూడొచ్చు.

అసలు ఈ మూడార్ల ప్రత్యేకత ఏమిటో గానీ చరిత్రలో మరెన్నో సందర్భాల్లో వాడబడింది. మచ్చుకు కొన్ని…. Reduce Reuse Recycle అని వ్యర్ధపదార్ధాల నిర్వహణ విషయంలోనూ, Replacement, Reduction, Refinement అని జంతువులపై చేసే పరిశోధనల్లో క్రూరత్వాన్ని ఎలా తగ్గించాలి అనే మానవతా సూత్రాలుగానూ, Relief, Reform Recovery అని New Deal లో అమెరికా ఆర్ధిక మాంద్యం నుండి గట్టెక్కడానికి ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ 1933 లో ప్రతిపాదించిన కార్యాచరణ గానూ ప్రసిద్ధి.

RRR సినిమాలో Reading కూడా ఓ భాగమేనేమో. విద్యాబోధనలో RRR (Reading, wRiting, aRithmetic) ప్రాధాన్యత గురించి చర్చోపచర్చలు తెలిసిందే. విలియం కర్టిస్ అనే చదువురాని లండన్ మేయర్ 1795 లో రీడింగ్-రైటింగ్-అరిథ్మేటిక్ అనే మూడు పదాల స్పెల్లింగ్ ఒకటే అనుకుని 3R అని వాడి నవ్వులపాలయ్యాడని గూగుల్ కథ. మరి మన RRR, 1920 నాటి కాలంనాటి కథ అని రాజమౌళి కథ…. అప్పటి 1921 జనాభా లెక్కల ప్రకారం హిందూ బ్రాహ్మినికల్ కులాలలో అక్షరాస్యులు 6.5 శాతం అయితే, ఆంగ్లాక్షరాస్యులు కేవలం 0.75 శాతం. మరి గిరిజన మతాల వారిలో ఈ శాతాలు 0.76 మరియు 0.02. ఇక పొతే, 1921 లో హిందూ గోండుల్లో అక్షరాస్యత శాతం 0.32, ఆంగ్లాక్షరాస్యులు కేవలం 7 మందే. గిరిజన గోండుల్లో 0.04 శాతం అక్షరాస్యులైతే 0.0008 శాతం అంటే కేవలం నలుగురికే ఇంగ్లేషు తెలిసింది. అసలీ జనాభా లెక్కల్లో గమనించాల్సింది ఈ శాతాల కన్నా, ఇంగ్లీషోడు మనల్ని హిందూ బ్రాహ్మినికల్, హిందూ గోండు, గిరిజన గోండు, ముస్లీం, క్రిస్టియన్ అనే మతాల లెక్కలు కట్టాడని. కట్టడం మొదలు పెట్టాడని. ఇలాంటివి మరెన్నో వాడు శాసించాడు మనం ఈనాటికీ శ్వాసిస్తున్నాం. అయితే, కొద్దోగొప్పో సంతోషించాల్సిన విషయం ఏమిటంటే, గోండుల్లో అక్షరాస్యత ఇప్పుడు 62 శాతం పైనే. వంద శాతం రావాలని ఆశిద్దాం.

రాంచరణ్ రూమ్ లో పుస్తకాల విషయానికొస్తే అవేవీ షెల్ఫ్ లో పేర్చినట్లు ఉండవు. లెక్కలేనన్ని నేలమీద చెల్లాచెదురుగా పడేసి ఉంటాయి. ఏ.రామరాజు (రాం చరణ్ పాత్ర) అంత భారీస్థాయిలో పుస్తకపఠనం చేసేవాడన్నమాట. ఇక సినిమా అయ్యాక భీం చేత ఎన్ని పుస్తకాలు చదివించాడో రాజమౌళికే తెలియాలి. సీక్వెల్ ఉంటే తెలియాలి. అన్ని పుస్తకాలు చూస్తే కిందా మీదా పడి చదువుతూ కలలుగనే ఎంతోమంది గ్రూప్ వన్, సివిల్స్ ఆస్పిరంట్స్ గుర్తొస్తారు. ఏ. రామరాజు కూడా అలాగే చదివి సెలెక్ట్ అయ్యాడేమో బ్రిటిష్ పోలీసుగా.

Ramaraju Characters Books

ఈమధ్య మా కజిన్ శశి ఇల్లు మారుతుంటే పెట్టెలు పెట్టెల పుస్తకాలు చూసి లాయర్ల ఇంట్లో కూడా ఇన్ని పుస్తకాలు చూడలేదని ఆ ప్యాకర్స్ & మూవర్స్ వాళ్ళు గుసగుస లాడుకున్నారట. విని గర్వపడ్డాడు. తను సందర్భానుసారంగా దాదాపు మూడొందల పద్యాలు చెప్పగలడు. కాబట్టి గర్వ పడొచ్చు. అయితే, ఈ రోజుల్లో అన్ని పుస్తకాలు ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఎంతమంది? ఉన్నా చదివేది ఎన్ని? పుస్తకాలు కొని చదవకుండా పేర్చిపెట్టే వాళ్ళని Tsundoku అంటారట జపనీస్ భాషలో. ఎప్పటికైనా చదవకపోతామా అనే ఆశావాదులన్న మాట.

నేనూ అలాంటి ఆశావాదినే. ఈసారి ఎగ్జిబిషన్ లో ఒక్క బుక్కూ కొనకూడదని ఒట్టేసుకుని అటూఇటూ తిరిగి ఓ ప్లేటు మిరపబజ్జీ లాగించేసి వచ్చేశా. అయినా మా ప్రసాదరావు, అనల్ప బుక్ కంపెనీ బలరాం తన ఫ్రెండని అతనో bibliopole అనీ (అరుదైన, ఆసక్తికర పుస్తకాల డీలర్) మళ్ళీ పట్టుకుపోయాడు. బలరాం సుండోకూ కాడు. బహుశా స్టాల్లో ఉన్న పుస్తకాలన్నిటికీ సమీక్ష రాయగల సత్తా ఉన్నవాడు. తను ఓపిగ్గా ఒక్కో పుస్తకం గురించి చెప్తూంటే ఇద్దరం ఓ పది పుస్తకాలు కోనేశాం. నేను మాత్రం మళ్ళీ సుండోకూనయ్యా ఎందుకంటే ప్రసాదరావు పుస్తక పఠన ప్రియుడు. అలాగే నా కొలీగ్ ఒకడు అవసరం మించి అస్సలు పుస్తకం కొనడు, చదవడు. అవసరానికి మించి తినడం, చదవడం శరీరానికి మంచిది కాదనే క్లారిటీ ఉన్నవాడు. అందుకేనేమో ప్రొఫెషనల్ కెరీర్ లో చాల మెట్లే ఎక్కాడు. దీనికి పూర్తిగా విరుద్ధంగా ఛాలెంజ్ లు చేసి మరీ వారానికో పుస్తకం చదివే వాళ్ళూ ఉన్నారు. పడకెక్కి కూడా పుస్తకం చదివే ‘Librocubicularist’ లూ ఉన్నారు. మరికొంత మంది ఏ పేపర్ కనపడితే అది బజ్జీలు చుట్టిచ్చిన పేపర్ అయినా సరే చదివేసి అయ్యో ఇంక చదవదానికేమీ మిగలలేదే అని ‘Abibliophobia’ కి లోనయ్యేవాళ్ళూ ఉన్నారు.

ఇప్పుడంతా డిజిటల్ యుగం. స్క్రీన్ మీదే పుస్తకాలు. మరి పేపర్ పుస్తకాలు బెటరా, డిజిటల్ బెటరా అంటే ఎవడికి మాత్రం తెలీదు పేపర్ పుస్తకాలే బెటరని. అచ్చేసిన పుస్తకాన్ని చేతులోకి తీసుకోగానే ఆ ‘Bibliosmia’ కే (పుస్తకాల వాసన) మనం ఫిదా అవుతాం. అయినా, 17 ఏళ్ల వ్యవధిలో లక్ష డెబ్బైవేల మందిని పరిశీలించిన 54 స్టడీలను క్రోడీకరించి స్పెయిన్, ఇశ్రాయల్ కి చెందిన ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ లు తేల్చారు అచ్చు పుస్తకం చదవడమే భేషని. స్క్రీన్ మీద చదివేటప్పుడు వేగంగా చదువుతారనీ దానివల్ల పుంఖాను పుస్తకాలు చదివేస్తారే గానీ డీప్ స్టడీ జరగదని తేల్చారు.  సరదాగా చదవాలంటే స్క్రీన్, సీరియస్ గా అయితే పేపర్.

అయితే డిజిటల్ మీడియాని కాదనలేని రోజులు. అందుకే పేపర్ కి దగ్గరగా స్క్రీన్ ఉండే టెక్నాలజీతో పాటు చదవడంలో శాస్త్రీయ పద్ధతుల్ని అభివృద్ధి చెయ్యాల్సిందే. కిండిల్ లో e-పేపర్ టెక్నాలజీ లాగా. ప్రపంచ వ్యాప్తంగా ఎల్.సీ.డీలు, ఎల్.ఈ.డీ.లూ  పోయి ఆర్గానిక్ ఎల్.ఈ.డీ (OLED), క్వాంటం డాట్ ఎల్.ఈ.డీ లు (QLED) రానున్నాయి. ఒక అంచనా ప్రకారం (బీ.ఐ.ఎస్) ఈ కొత్త తరం స్క్రీన్ ల మార్కెట్ దాదాపు 123 బిలియన్ డాలర్లు (దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు). మనం ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వచ్చాం అయినా ఇక్కడా రాజమౌళి తరహా భారీ మార్కెట్టే.

మార్కెట్లు ఎంత పెద్దవైనా, మన దేశంలో డిజిటల్ డివైడ్ కూడా పెద్దదే. ఒక తట్టు పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్థాయి గ్రాఫిక్స్ తో సినిమాలు తీసే సామర్ద్యం ఉండటం సంతోషమే అయినా, డిజిటల్ అక్షరాస్యత లేని వాళ్ళూ ఉండటం శోచనీయం. NSO రిపోర్ట్ (2017) ప్రకారం భారత దేశంలో పదిళ్ళలో ఒక ఇంటికి మాత్రమే కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. పట్టణాలలో 42 శాతం ఇళ్ళకు (ఢిల్లీ లో 55 శాతం ఇళ్ళకు) మాత్రమే ఇంటర్నెట్ ఉంటే, ఆ శాతం గ్రామాల్లో కేవలం 15. అలాగే దేశంలో 30 ఏళ్ల లోపు వయసు వాళ్లలో కేవలం 40 శాతం మందికే డిజిటల్ అక్షరాస్యత ఉందని తేల్చింది NSO రిపోర్ట్. ఇంటర్నెట్, సెల్ ఫోన్లు, కంప్యూటర్స్ ఉంటేనే ఆన్ లైన్ క్లాసులు సాధ్యం. కోవిడ్ సమయంలో దేశంలో పేదవిద్యార్ధులు ఆన్ లైన్ అందుబాటు లేకా, స్తోమత లేకా,ఆఫ్ లైన్ క్లాసులు జరగకా చదువుకి దూరమయ్యారు. 1920 నాటి RRR లో చదువు కావాలని భీం అడిగితే, సీక్వెల్ అంటూ ఉంటే అందులో Router, ComputeR, InteRnet కావాలని రాజమౌళి అడిగిస్తాడేమో చూడాలి.

-విప్పగుంట రామ మనోహర

Also Read :

పీక తెగుద్ది!

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్