Sunday, September 8, 2024
HomeTrending Newsయువతకు తెలంగాణలో కొత్త పథకం

యువతకు తెలంగాణలో కొత్త పథకం

తెలంగాణలో ఉన్నత విద్యావంతుల కోసం ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. సివిల్స్‌లో ప్రిలిమ్స్ సాధించి మెయిన్స్‌కు ఎంపికైన రాష్టానికి చెందిన యువతీ యువకులకు… సింగరేణి సంస్థ సహకారంతో లక్ష రూపాయల ఆర్థిక సహాయం  ప్రభుత్వం అందచేస్తుంది. ప్రజాభవన్‌లో ఈ రోజు(శనివారం) “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం” కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ నుంచి UPSC 2024 లో విజయం సాధించిన అభ్యర్థులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

నిరుద్యోగ సమస్య పరిష్కరించాలన్నదే ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణంగా నిలిచిన నిరుద్యోగ సమస్య పరిష్కరించే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలండర్‌ ప్రకటించబోతున్నామని చెప్పారు. ప్రతి ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించి జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలను ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని సీఎం చెప్పారు.

గ్రూప్ I, II, III, పారా మెడికల్, పోలీస్, డీఎస్సీ, టెట్… తదితర అన్ని రకాల పరీక్షలు సరైన సమయంలో సమర్థవంతంగా నిర్వహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. కష్టపడే విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే చిత్తశుద్ధితో 30 వేల ఖాళీలు భర్తీ చేసి నియామక పత్రాలను అందజేసిన విషయాన్ని సిఎం గుర్తుచేశారు.

ప్రభుత్వం తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. నిరుద్యోగ భ్రుతి మరిపించేందుకు జాబ్ క్యాలెండర్ తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలండర్ అమలు చేస్తూనే అప్పటి వరకు ఉన్న నిరుద్యోగులకు భ్రుతి చెల్లించాలని కేంద్రమంత్రి డిమాండ్ చేశారు.

మొద‌టి సంవ‌త్స‌రంలోనే రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌న్న సిఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు జాబ్ క్యాలెండ‌ర్ అని మభ్య పెడుతున్నారన్నారు. కేసీఆర్ హ‌యాంలో జారీ అయిన‌ గ్రూప్-1, 2, 3 నోటిఫికేష‌న్లు ర‌ద్దు చేసి పోస్టుల సంఖ్య‌ పెంచుతామ‌ని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశించారు. ఇప్ప‌టి వ‌ర‌కు జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయ‌లేదని, ప్రభుత్వం తీరుపై ఈ రోజు గవర్నర్ కు ఫిర్యాదు చేశామని కేటిఆర్ తెలిపారు.

 

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్