Truth of Life: వేమన జయంతి(జనవరి 19) సందర్భంగా చాలామంది ఆయన పద్యాలను స్మరించుకున్నారు. వేమన పద్యం వినని తెలుగువారు తెలుగువారే కాదు. వేమన సాహిత్యం మీద లెక్కలేనన్ని ఎం ఫిళ్లు, పి హెచ్ డి లు ఉన్నాయి. శతాబ్దాలుగా ఎందరో వేమన సాహిత్యం అందచందాల మీద వ్యాసాలు రాశారు. ఇంకా రాస్తున్నారు. అనేక భాషల్లో పండితుడు, ప్రఖ్యాత విమర్శకుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 1928లో విశాఖపట్టణం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వేమన సాహిత్యం మీద చేసిన ఏడు ఉపన్యాసాలను “వేమన” పేరిట 1929లో ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. అందులో “వేమన కవిత్వం, హాస్యం, నీతులు” ఏడో భాగానికి – ఇప్పటి భాషకు అనుగుణంగా ఇది సంక్షిప్త రూపం.
వేమన ఇతరులకు మంచి జరగాలని రాశాడే కానీ…ఇతరులను తృప్తిపరచడానికి రాసినవాడు కాదు. విన్నవారు తనను పొగడాలని అనుకోలేదు. తిట్టినా పట్టించుకోలేదు. “కావ్యం యశసేర్థ కృతే” అన్న ప్రమాణం ప్రకారం కీర్తికోసమే చాలామంది కావ్యాలు రాశారు. అలా కవిత్వం రాసి కీర్తి సంపాదించాలని కూడా వేమన ప్రయత్నించలేదు.
ఆ కాలంలో రాజాస్థానాల్లో బంగారు పల్లకీల్లో తిరుగుతూ…బిరుదు భుజకీర్తులతో కవిసార్వభౌములయిన వారు వేమనను గుర్తించలేదు. వారిని వేమన లెక్కచేయనే లేదు. అలాగని…ప్రాచీన సాహిత్యం, పురాణాలను వేమన చదవలేదు అనుకోవడానికి వీల్లేదు.
“వేముడిట్లు చెప్పు వివరపువాక్యముల్
వేముడిట్లు పోవు వెర్రిపోక
పామరులకునెల్ల ప్రతిపక్షమై యుండు
పండితులకునెల్ల పరము వేమ”
అని తను చెప్పిందేమిటో పండితులే ఎప్పటికయినా తెలుసుకుంటారని స్పష్టంగా చెప్పుకున్నాడు.
గాలిలాంటి అమూల్య పదార్థం వేమన సాహిత్యం. అది అంతటా ఉంటుంది. ఉండాలి. లేకపోతే బతకలేం. వేమన లేని తెలుగు సాహిత్యాన్ని ఊహించగలమా?
భావించేవాడు; అతడి భావం; ఆ వస్తువు; దాన్ని వ్యక్తం చేసే భాష; దాన్ని గ్రహించేవారు- ఈ అయిదు అంశాలు కవిత్వానికి పంచమహాభూతాలు. ఈ అయిదు అంశాల్లో ఏ ఒక్కటి లేకపోయినా అది కవిత్వం కాదు. వేమనతో మనం విభేదించవచ్చు. విభేదించకపోవచ్చు. కానీ…వేమన చెప్పినది వినకుండా ఉండలేం. విని వదిలిపెట్టలేం. వేమన మన బాగుకోసం మన వెంటపడతాడు. తిడతాడు. కసురుకుంటాడు. విసుక్కుంటాడు. కోప్పడతాడు. శపిస్తాడు. ఇంటిపెద్ద లేదా ఊరిపెద్ద చెప్పినట్లు అనుభవసారాన్ని కాచి వడపోసి ఆటవెలది పద్యాల్లో వేమన చెబుతుంటే అప్పుడు విన్నారు. ఇప్పుడు వింటున్నాం. భవిష్యత్తు కూడా విని తీరాలి.
వేమన కవిత్వంలో అసాధారణ గుణం భావాల తీవ్రత. అందుకు కారణం అవన్నీ ఆయన అనుభవాలు. ఇంకొకరివి కావు. రెండో గుణం అతి సామాన్యమయిన భాష. దీనికి కారణం ఆయన లోక సంచారి. జనం భాష తెలిసినవాడు. ఆటవెలది లాంటి చిన్న పద్య వృత్తంలో అంతంత గొప్ప భావాలను, యతి స్థానాలు తడబడకుండా వేమన నల్లేరుమీద బండి నడకలా చేసిన పద్యరచన మహా మహా కవులకు కూడా ఆశ్చర్యకరం.
చాలా గంభీరమయిన విషయాన్ని హాస్యం మేళవించి వేమన ఎగతాళిగా చెప్పడంతో కొందరు ఆయన్ను అపహాస్యానికి వాడుకున్నారు. తెలుగుభాషలో ఒక సీరియస్ విషయానికి హాస్యరసాన్ని ఎంత అద్భుతంగా వాడుకోవచ్చో చూపిన ధీరుడు కన్యాశుల్క గురజాడ అప్పారావు. అలా వేమన కూడా పారమార్థిక విషయాలకు అంతులేని హాస్యాన్ని జోడించాడు.
“పాలసాగరమున పవ్వళించినవాడు
గొల్లయిండ్ల పాలు కోరనేల?”
గుహలోన జొచ్చి గురువుల వెదకంగ
కౄరమృగమొకండు తారసిల
ముక్తి మార్గమదియె ముందుగా జూపురా”
గొడ్డుటావు పితుక కుండ గొంపోయిన
పండ్లు రాలదన్ను; పాలనీదు;
లోభివానినడుగ లాభంబు లేదయా”
“మేనమామ బిడ్డ మెరసి పెండ్లామాయె
అరవలందు చెల్లెలాయెనదియు,
వలసిన పుణ్యంబు, వలదన్న దోషంబు”
కొన్ని సందర్భాల్లో వేమన సకల ధర్మార్థ కామ మోక్షాలను, వేదాంత సారాన్ని ఒక్క ఆటవెలదిలో తేల్చి పారేస్తాడు.
“చంపదగినట్టి శత్రువు తనచేత
చిక్కెనేని కీడు చేయరాదు,
పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు”
“అనువుగాని చోట అధికులమనరాదు
కొంచెముండుటెల్ల కుదువగాదు,
కొండ అద్దమందు కొంచెమై ఉండదా?”
“కులము గలుగువారు గోత్రంబు గలవారు
విద్యచేత విర్రవీగువారు,
పసిడి కల్గువాని బానిసకొడుకులు”
సంస్కృత సాహిత్యం కళ్ళజోడు పెట్టుకుని వేమనను చదివినంత కాలం వేమన మనకు కాకుండా పోయాడు. దానివల్ల నష్టపోయింది మనమే. తెలుగు కళ్లతో వేమనను చూస్తే…ఇంకో యుగానికయినా ఇలాంటి ప్రజాకవి పుడతాడా? అని వేమనను నెత్తిన పెట్టుకుంటాం.
-రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ
(1893లో జన్మించి 1979లో మరణించిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ సంగీత, సాహిత్యాల్లో హిమవన్నగం. ఆధునిక తెలుగు వచనం ఆయన కలంలో హొయలు పోయింది. తెలుగు సాహిత్య విమర్శకు దారిదీపం)
Also Read :