Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసామాన్యశాస్త్రం-3

సామాన్యశాస్త్రం-3

“మీరు సామాన్యులు కావడం ఎలా?” అన్న కందుకూరి రమేష్ బాబు రచన వ్యక్తిత్వ వికాస పుస్తకం కాదు, జీవన వికాసం. సామాన్యుడి నిత్యోత్సవం. అదెలాగో తెలియాలంటే అందులో కొన్ని ఉత్సవాల్లోకి మనం తలదూర్చాలి. మనసుతో చూడాలి. మచ్చుకు కొన్ని:-

ఆకాశమంత ఆనందం:-
ఆతడు ఏదో ఒక పాటను తనలో తాను పాడుకుంటూ వెళుతున్నాడు. శాంతంగా, ఆనందంగా పండ్లబండిని తోసుకుంటూ వెళుతున్నాడు.

మా వీధిలో అతడిని తరచూ చూస్తూ ఉంటాను. మాట్లాడలేదు గానీ పరిచితుడే.

“ఏమిటా సంతోషానికి కారణం’ అని అడిగితే హాయిగా చెప్పాడు. ‘కూతురి పెండ్లి పెట్టుకున్నాం, శనివారం’ అన్నాడాయన.

చిత్రంగా అనిపించింది. అమ్మాయి పెళ్లి అనగానే తల్లడమల్లడం అయ్యే తల్లిదండ్రులను చూసిన అలవాటు కదా! ‘ఇతడేమిటి? సునాయాసంగా బతుకుబండిని లాగుతూ, అంత పెద్ద కార్యాన్ని పెట్టుకుని కూడా సంతోషంగా పని చేసుకుంటున్నాడు!’ అని ఆశ్చర్యపోయాను.

అతడు నా ఆశ్చర్యాన్ని కూడా పట్టించుకునే స్థితిలో లేడు.

శుభకార్యం పెట్టుకున్నాక మనిషి ఉల్లాసంగా ఉండకుండా ఎలా ఉంటాడో కూడా తెలియనట్లు ఆయన ఈసారి బయటకే పాడుతున్నాడు, ఆ హిందీ పాటను.

ఆమ్ ఆద్మీ తను.
అరటిపండ్లు అమ్మే మనిషి.

తన తాహతులో పెళ్లి చేయడం తప్ప అనవసర భారాలేమీ పెట్టుకోని లక్షలాదిమందిలో తానొక్కడు.

తన స్థాయి తెలిసిన మనిషి ఆకాశమంత పందిరి వేయడు!

తూకానికి అందని విలువ:-
హైదరాబాద్ నగరంలో నిసార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు తూకం వేయకుండా కూరగాయలు అమ్ముతారు. ఏది అడిగినా రెండు చేతులతో పెడతాడు. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే కానక్కరలేదు అనడానికి ఆయన ఒక అత్యుత్తమమైన నిదర్శనం. అసాధనకు సరైన కొలమానం. Un learning అలాంటి వారి నుంచి నేర్చుకున్నాను అని భావిస్తాను. కొలమానాలు లేనప్పుడు జీవితం ఒక ఉత్సవం అని కూడా అతడి నుంచి గ్రహించాను.

నిసార్ గురించి మరొక మాట కూడా చెప్పాలి. తూకం వేయకుండా కూరగాయలను ఎందుకు అమ్ముతున్నావు అని అడిగినప్పుడు నవ్వి ఊరుకున్నాడు ఆయన. గట్టిగా అడిగితే, ” కూరగాయలు సార్. దానికి కూడా తూకమా?” అని అన్నాడు. అది కాదు ఇక్కడ చెప్పవలసింది, సినీ నటి జయసుధ గారితో ఒక రియాల్టీ షో చేసినప్పుడు ఆయనకు తోపుడు బండి కొన్నిద్దామా అని అడిగారు ఆవిడ. వెళ్లి “ఇది నీకు అవసరం కదా… స్నేహితుడి బండి వాడుతున్నావ్ కదా “ అన్నప్పుడు.. “ఉన్నది కదా.. స్నేహితుడిది. మళ్లీ ఎందుకు?” అని సున్నితంగా తిరస్కరించాడు ఆయన.

ఉన్నది అన్న భరోసా.. స్నేహం పట్ల ఆయన విశ్వాసం.. వద్దనడంలో ఒక ఒక నమ్మిక, గంపెడంత కుటుంబం ఉన్నా కూడా తూకాన్ని పక్కన పెట్టిన ఆయన వివేకం.. వీటన్నిటి మధ్య చెరగని చిరునవ్వుతో ఆయన సాగిస్తున్న జీవనయానం..ఇదంతా ఉత్సవం.

జీవనవ్యాపార పరిధులు:-

కవాడిగూడ చౌరస్తాలో ఒక పాన్ షాప్ నడిపే నరసింహారెడ్డి దాని రెక్కలు తెరిచి రోజూ మంచి వాక్యాలు రాసే అలవాటు ఉంది. చాక్ పీస్ తో. తన పాన్ షాప్ డబ్బా అతడికి పాఠశాల. వచ్చిపోయే బస్సుల్లోంచి కిటికీ గుండా రెక్కలపై తానేమీ రాశాడో, ఏ సందేశం ఇచ్చాడో చదవడం ఒక అలవాటు. చిత్రంగా అతడు సిగరెట్లు అమ్మడు. నిజానికి అమ్మగలిగే అవకాశం ఉన్నా కూడా. ఎందుకు అని అడిగినప్పుడు ఎదురుగా ఉన్న ఇంకొక షాపును చూపించాడు. అతడు సిగరెట్లు అమ్ముతాడు, పాన్ అమ్మడు. తాను ఒకటి అమ్మితే ఎదురుగా ఉండే అతను ఇంకొకటి అమ్ముతాడు. ఒక సామాన్య ఔదార్యం…. ఉదయం నుంచి రాత్రి దాకా చిరునవ్వుతో ఇద్దరు జీవన వ్యాపారంలో నిమగ్నం అవుతారు. పోటీ లేదు. ఇది కూడా ఒక ఉత్సవమే. బ్రతుకుతెరువులో ఒకరికొకరు అడ్డు నిలవని అనుబంధం.

ఉన్నదాన్నే పంచుకునే ఆనందం:-
ఇబ్రహీం అనే మిత్రుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యంగా నూర్ భాయ్ కుటుంబం కూడా వారింట్లోనే ఉంది. వారింట్లోనే ఒక పక్క గదిలో నివసిస్తోంది. తను కూడా ఇక్కడే ఉంటారా? అంటే అవును… చాలా ఎళ్లయింది అన్నాడు ఇబ్రహీం భాయ్.

తమలపాకులు అమ్మే నూరుబాయి కుటుంబానికి తాను చేయగలిగిన చిరు సాయం- తమ ఇంట్లోనే ఒకటి రెండు గదులను ఇవ్వడం. వారిద్దరూ నాకు మిత్రులే అయినా ఆ సంగతి తెలియడానికి చాలా ఏళ్లు పట్టింది. ఇది ఔదార్యం అంటే కాదు, పంచుకోవడం. ఉన్నదాన్ని సెలబ్రేట్ చేసుకోవడం.

ఒక సైన్ బోర్డు ఆర్టిస్టు, మోండా మార్కెట్లో చిరు వ్యాపారం చేసే మరో మిత్రుడు, ఇట్లాంటి వందలు… వేలు.. లక్షలాదిమంది. ఉన్నదాంట్లో జీవించడం ఉత్సవం.

సామూహిక ఉత్సవం:-
గమనించండి… లేబర్ అడ్డా మీద పదులు, వందల మంది ఉదయాన్నే చేరుకుంటారు. 9.. 10 లోగా తిరిగి వెనక్కి వెళతారు. పని దొరికేది కేవలం 20… 30 మందికే. మిగతా 70 మంది తిరిగి వెనక్కి నడిచి వెళ్తూ కనిపిస్తారు. వెనక్కి వెళ్లే వారి ముఖంలో నైరాశ్యం మీరు గమనించరు. పని దొరికిన వారిలో పట్టలేని ఆనందాన్ని కూడా మీరు గ్రహించలేరు. కష్టజీవులకు ఒక నిరంతర వలయం ఇది. కానీ ఎంతో ఉత్సాహంగా బయలుదేరుతారు . అదే స్థితిలో వెనక్కి వెళతారు. విశేషం ఏమిటంటే ఇవాళ పని దొరికిన వారికి రేపు దొరకదు. రేపు దొరికిన వారికి ఎల్లుండి దొరకదు. మరి వారిని ఉత్సాహంగా ఉంచుతున్నది ఏమిటి అని పరిశీలిస్తే- రెక్కల కష్టం మీద కొండంత నమ్మకం. విధి లేని స్థితే కావచ్చు. కానీ ఒక ఉత్సవంగా బయలుదేరుతారు. ఒక పండుగకో, పబ్బానికో వెళ్ళినట్లు వెళతారు. స్త్రీలయితే బతుకమ్మ ఆడడానికి వెళ్ళినట్లు వెళతారు.

ఏమీ లేని మనుషులు…పోగొట్టుకోవడానికి ఏమీ లేని వ్యక్తులు…ప్రతిక్షణం జీవిస్తారు. పనిలోనూ, పని లేని సమయంలోనూ, విశ్రాంతిలోనూ వారి జీవన బలిమి గొప్ప వికాసం. దాన్ని అర్థం చేసుకోవడం ఒక ఉత్సవం.

ముఖ్యంగా కాయ కష్టం చేసుకునే వారి జీవితంలో కష్టసుఖాల పట్ల వాళ్ళ దృక్పథం భిన్నంగా ఉంది. కష్టమొస్తే బాధపడతారు. సుఖం వస్తే సంతోషపడతారు. వ్యక్తం చేస్తారు. బొచ్చ కొట్టుకొని ఏడ్చేంత దుఃఖాన్ని ఏడ్చి సేద తీరుతారు. సుఖపడితే ఒళ్ళు హూనమయ్యేలా సుఖపడతారు. పూర్తి అనుభవం వారి సొంతం. దాచుకోవడానికి ఏమీ లేని మనిషిలోని ఈ వైవిధ్యం, ఈ విశేషం అర్థం చేసుకుంటే ‘అరుదు’గా అనిపిస్తుంది. స్థితప్రజ్ఞత జోలికి పోరు వారు. తమది గాంభీర్యమైన జీవితం కాదు. రణగొణ ధ్వనుల మధ్య పశుపకక్ష్యాదులతో పంచభూతాల మధ్య ఓపెన్ గా సాగిపోయే జీవితం వారిది. బీభత్సంతో కూడిన నవరసాలతో సాగిపోయే బ్రతుకులు వారివి. వారి జీవన వర్ణం చామన చాయ. మంచికి మంచి, చెడుకు చెడు వారి లక్షణం. అందుకే ప్రతి పండగ వారిదే.

ఒక కవి అన్నట్టు బ్రతుకు నిత్య నృత్యం కాదు, వారికి ఉత్సవం.

ఇక్కడ మాట్లాడుతున్నది నూటికి 60 శాతం ప్రజల విషయం.

జీవించడమే కాదు జీవితం ముందు వినయంగా నిలబడ్డమే ఉత్సవం. చిన్న పెద్ద… ధనిక పేద.. అన్న తారతమ్యం లేకుండా…అందరూ భాగ్యవంతులు అన్న నిశ్చయంతో.

‘గాలించడం’. అతి సామాన్యమైన దృశ్యం. అందరి జీవితాల్లో ఉన్నదే కానీ రమేష్ కి ‘ఉత్సవం’.

సామాన్యంగా బతికే మనుషులను ఆర్థిక కోణంలో పరిశీలించడం కారణంగానే వారి జీవితాన్ని ‘ఉత్సవం’గా కాకుండా ‘దరిద్రం’గా చూడడం, భావించడం మొదలైంది. దీనికి విరుద్ధంగా పనిచేయవలసిన ఆవశ్యకతే సామాన్య శాస్త్రానికి పునాది అంటాడు రమేష్.

రేపు:-
సామాన్యశాస్త్రం-4
“జీవన చిత్రాలు”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్