Thursday, December 12, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసామాన్యశాస్త్రం-2

సామాన్యశాస్త్రం-2

నేర్చుకోవడం, తెలుసుకోవడమే కాదు…నేర్చుకున్నది, తెలుసుకున్నది వదిలించుకోవడం కూడా అవసరమవుతుంది కొన్ని సందర్భాల్లో. కానీ రమేష్ బాబు ఇది ఇంకా ఎక్కువ అవసరమైనదని అంటాడు.

Unlearning అన్న ఇంగ్లిష్ పారిభాషిక పదాన్ని తెలుగులోకి ఇప్పటిదాకా ఎవరూ అనువదించలేదు. “అనభ్యసనం” అని మా గురువుగారు డి. చంద్రశేఖర్ రెడ్డి కొత్తగా కాయిన్ చేశారు. అయితే వాడుకలో లేదు. తెలుగువారు ఇంకా నేర్చుకునే ప్రవాహంలోనే కొట్టుకుపోతున్నారు కాబట్టి ఆగి…అనభ్యసన ప్రక్రియలోకి వచ్చే అవకాశం రాక ఆ మాటతో పనిపడలేదు.
“to make an effort to forget your usual way of doing something so that you can learn a new and sometimes better way” అని అన్ లర్నింగ్ మాటకు నిఘంటు వివరణ. కొత్తది, ఇంకా మెరుగైనది నేర్చుకోవడానికి ఇప్పటికే నేర్చుకున్నది, నేర్చుకుంటున్న విధానాన్ని మరచిపోవడం లేదా పక్కన పెట్టడం. అలా మీరు అన్ లర్నింగ్ మోడ్ లోకి వస్తే తప్ప కందుకూరి రమేష్ ఏమి చెప్పాడో, ఏమి చూపాడో, ఏవేవి చెప్పాలనుకుంటున్నాడో, చూపాలనుకుంటున్నాడో అర్థం కాదు. ఇది ఎంత సులభమో అంత కష్టం కూడా. ఈ అన్ లర్నింగ్ ను రమేష్ “అసాధన” అంటాడు.

క్తిత్వ వికాసానికి ‘సాధన’ ఎలా ముఖ్యం అని సాధారణంగాభావిస్తామో రమేష్ బాబు ‘అసాధన’ అన్నది జీవన వికాసానికి మూలంగా భావిస్తాడు.  

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో యాభై రెండేళ్ళ కిందట(1972లో)పుట్టిన కందుకూరి రమేష్ బాబు ఎప్పుడు అన్ లర్నింగ్ బాటపట్టాడో తెలుసుకుంటే తప్ప మనకు ఆ అన్ లర్నింగ్ భావన కొద్దిగానన్నా అర్థం కాదు. తండ్రి హెడ్ మాస్టరయిన ఫోటోగ్రాఫర్. కాబట్టి తాను చిన్ననాటి నుంచే ఫోటోగ్రఫి నేర్చుకున్నాడు. ఎం ఏ ఇంగ్లిష్ పూర్తీ చేసి కొన్నాళ్ళు సిరిసిల్లలో లెక్చరర్ గా పనిచేశాడు. ఒక ఎన్ జి ఓ లో పనిచేశాడు. 1997లో సుప్రభాతంలో జర్నలిస్టుగా చేరాడు. తరువాత వివిధ మీడియా సంస్థల్లో పనిచేశాడు. ఇప్పటికీ జర్నలిస్టే. అయితే మాటలు మోయలేని ప్రపంచమేదో చిత్రాలు మోయగలవని కెమెరా పట్టుకున్నాడు. కెమెరాతో ఆ ప్రయాణంలో 2009లో భారతీయ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ రఘురాయ్ పరిచయమయ్యాడు. రఘురాయ్ దృష్టికోణం రమేష్ బాబుకు నచ్చింది. ఆయన్ను గురువుగా ఎంచుకుని ఆయనతో ప్రయాణం ప్రారంభించాడు. సామాన్యులను వార్తా వస్తువులుగా, ఎపిసోడ్లకు సబ్జెక్ట్ లుగా, చిత్రాలకు భూమికలుగా చూస్తూ…చివరకు సామాన్యతను పండుగ చేయడమే రమేష్ కు వృత్తి, ప్రవృత్తి అయ్యింది. ఆ ప్రయాణంలో వందలమందితో నెలలు, ఏళ్ళపాటు తిరుగుతున్నప్పుడు రమేష్ మొదట గ్రహించింది- అన్ లర్నింగ్ కావాలని.

ఇప్పటికి 13 పుస్తకాలు రాశాడు. “సామాన్యశాస్త్రం” పేరిట భారతదేశంలో సామాన్యుల జీవన చిత్రాలతో తొలి శాశ్వత ప్రదర్శశాలను 2012లో ఏర్పాటు చేశాడు. ఏ లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నావని నేను చాలా రొటీన్ ప్రశ్న అడిగాను. ఇలాంటివాటితో పూటగడవదు కదా? అని చనువుకొద్దీ అడిగాను. అప్పుడాయనలక్ష్యం లేకుండా అని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి ప్రశ్నలుఅడిగి చాలా మంది నామీద అనవసరంగా జాలిపడుతుంటారనికూడా అన్నాడు. అంటూ నాలుగు గంటల సమాధానం సంభాషణజరిపాడు. దాన్ని నాలుగు ముక్కల్లో చెబితే-

1. సామాన్యశాస్త్రానికి జీవ లక్షణమే తప్ప లక్ష్యం లేదు.

2. దానికదిగా ఏర్పడినదే సామాన్యశాస్త్రం. ఒకసారి ఏర్పడ్డాక ఇదొకపని కాదు, విశ్రాంతి. అందుకే ‘ఇక బతకడం మానేశాను’ అన్నాడు.“బతకడానికి సాధన కావాలి. కానీ జీవించడానికి అసాధన అవసరం. అందువల్లే నా లక్ష్యం సునాయాసం” అన్నాడు.

3. “సామాన్యశాస్త్రాన్ని అర్థం చేసుకునేవారు; అందులో తమను తాము చూసుకునేవారు వారికి వారే ఎలాగో వెతుక్కుంటూ వస్తారు. వస్తున్నారు. వారికోసం నేను ఇంకో పనేదీ పెట్టుకోకుండా గ్యాలరీలో కూర్చుంటున్నా. ఇది ప్రయత్నంతో చేస్తున్నది కాదు. అప్రయత్నం” అన్నాడు. “దానికదిగా ఏర్పడటం” అని వివరించాడు.  ఒక చిన్నపనిలో ఇమడటం, ఆ పనిని నిరాటంకంగా, ఒక చోట స్థిరంగా చేయడంతో అదే తనను పోలిన వారిని ఎంచుకుంటుంది అన్నది రమేష్ బాబు విశ్వాసం.

4. “ఈ జగత్తులో బతికిన మనుషులందరి గురించి ఒక లైబ్రరీ తెరవాలి. అందులో మీ పరిచయ వ్యాసం/చిత్రం తప్పక ఉండాలి”- అన్నది సామాన్యశాస్త్ర ఆదర్శం. రచనా వ్యాసంగానికి తాను పెట్టుకున్న మకుటం ఇది. గ్యాలరీ పెట్టాక ఆ మనుషులకోసం ‘లైబ్రేరీ’స్థానంలో ‘గ్యాలరీ’ అన్న మాట మార్చి, అటు లైబ్రరీని ఇటు గ్యాలరీని ఎనిమిదేళ్లుగా నిరాటంకంగా నడుపుతున్నాడు. “పైపైకి ఎగబాకే లక్ష్యం లేకుండా మనుషులు శిఖరాలుగా కాకుండా  మైదానాలుగా విస్తరించడమే అసాధన’ అన్నాడు రమేష్ బాబు. ‘వర్టికల్ కాదు, హారిజాంటల్’ అన్నాడు.

ఇలా ఒక పని విశ్రాంతిగా జరగడంలో ఒక అందం ఉంది. మీరుగ్యాలరీలోకి వెళితే దాన్ని ఫీలవుతారు. ఐతే, ఈ నిర్మాణం వెనకాల తాను అనుసరించిన విధానం మటుకు అన్ లర్నింగ్ అనే అంటాడు రమేష్ బాబు. అది అర్థం చేసుకోవడానికి తాను చెప్పే మరిన్ని ఉదాహరణలు తరచి చూడాలి. ఇంకొన్ని ముందు పెట్టుకోవాలి.

సికిందరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర చిన్న గుడి. ఒకాయన బతుకుపోరులో దేశమంతా తిరిగాడు. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఒక కాలు పోయింది. జైపూర్ కృత్రిమపాదం పెట్టించుకున్నాడు. తిరిగి తిరిగి మళ్ళీ పుట్టినచోటుకే వచ్చాడు. తనవాళ్ళెవరూ లేరు. తనకు తలదాచుకోవడానికి చోటు లేదు. గుడిముందు కూర్చున్నాడు. చెప్పులు వదిలి వెళ్ళేవాళ్ళు పావలా, రూపాయి ఇచ్చేవారు. అదే అతడి వృత్తి అయ్యింది. హిందూ పేపర్ కొనుక్కుని చదువుతూ ఉండేవాడు. ఏళ్ళు గడుస్తున్నాయి. ఇలా దుర్భరంగా ఉండడంకంటే పక్కవారిలా కర్చిఫ్ లు అమ్ముకుని తన కాళ్ళమీద తాను నిలబడదామనుకున్నాడు. అంతే. అప్పటిదాకా మనిషిగా చూసిన పక్కవారు పురుగులా చూడడం మెదలుపెట్టారు. నువ్వెంత? నీ బతుకెంత? నువ్ చెప్పులు చూసుకోవాలి. అడుక్కోవాలి- అంతే. వ్యాపారంలోకి రావడానికి వీల్లేదు అని శారీరకంగా, మానసికంగా హింసించడం మెదలుపెట్టారు. “ఇక్కడ ఎవరి పరిధిలో వారున్నంతవరకే మనుగడ” అన్న ఎరుకతో అతడు మళ్ళీ తలదించుకుని చెప్పులనే చూసుకుంటున్నాడు. అంతేకాదు, ఒకసారి దిగాజరాక మళ్ళీ మునుపటిలా జీవించలేం” అని అర్థం చేసుకుని, తలదించుకుని హిందూ పేపరే చదువుకుంటున్నాడు. తల ఎత్తి మనుషులను, ప్రపంచాన్ని చూడడం మానేశాడు. మళ్ళీ పక్కవారు మునుపటిలాగే ప్రేమగా చూసుకుంటున్నారు.

ఇతడి అనుభవం ‘సాధన’. కానీ దాన్ని మానేశాడు. ఐతే అతడు బాధితుడు. రమేష్ బాబు అనేది ఏమిటంటే, ఒకసారి ఎదిగి తగ్గడం కాదు, తగ్గి ఎదగడాన్ని ఎంచుకున్నాడు. జీవితంలోసాధించేందుకు ఎక్కడికీ వెళ్ళలేదు. సహజంగా సుందరంగా తనను తాను నిలుపుకున్నాడు. మంచి అవకాశం కోసం పని చేయకుండా తన పని ఐతే అక్కడ చేరాడు. అ పని తనది కాకుండా పోతే తప్పుకున్నాడు. అట్లా ఎన్నో పత్రికల్లో, టీవీల్లో పని చేసి నిరంతరం సామాన్యశాస్త్రాన్నే ఎక్కడైనా ప్రొడ్యూస్ చేశాడు.

‘అన్ లెర్నింగ్’ ఒక ముఖ్య సాధనగా ఎంచుకోవడం అతడి లక్షణం. అదే ‘సామాన్యశాస్త్రం’ ముఖ్య ప్రతిపాదన.

వ్యక్తిగత ఎదుగుదలలో భవిష్యత్తు లేదు. మన భవిష్యత్తు అంటే ‘ఒక్కరి’ సుఖ సంతోషాలతో లేదని కూడా అతడి నిశ్చితాభిప్రాయం. అందుకే అతడు రాసిన జీవిత పాత్రల్లో అనేక మంది మనల్ని చకితుల్ని చేస్తారు. దుబాయ్ లో సోఫా మేకర్ గా పనిచేసే ఇబ్రహీం ఒక ఉదాహరణ. తాను ఇక ఇండియాకు వెళ్ళిపోతాను అంటే అతడి యజమాని ‘భార్యా పిల్లలను ఇక్కడికే తెచ్చుకోవచ్చు కదా?’ అని సూచిస్తాడు. కానీ ఇబ్రహీం ‘కుటుంబాన్ని తెచ్చుకుంటాను గానీ ఇండియాను తెచ్చుకోలేను కదా” అని సమధానమిచ్చి తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. ‘ఆర్ట్ పాయింట్’ పేరుతో అక్కడే చిన్న వ్యాపారంలో స్థిరపడుతాడు. కాలిగ్రఫీ ఆర్టిస్టుగా కూడా ఇప్పుడు రాణిస్తున్నాడు. ఇతడు వెనక్కి రావడం అసాధన. తనలోకి తాను రావడమే అంటాడు రమేష్ బాబు.

పరుగు పందెం నుంచి సడెన్ గా నిష్క్రమించే ఒక ప్రతిభావంతమైన చాంపియన్ ద్వారా మరో అధ్బుత వికాసాన్ని విశదీకరిస్తాడు రమేష్ బాబు. ఒకతను కొద్ది మంది అధికారుల ఒత్తిడితో పరుగు పందెంలో పాల్గొంటాడు. తన విజయం సదరు సంస్థకు అవసరం. తనకు మాత్రం కాదు. అది గ్రహిస్తాడాయన. గ్రహించి అంటాడు- “ఈ పందెం నాది కాదు. ఈ విజయం కూడా నాది కాదు” అని. “అందుకే గెలవగలిగే అవకాశం ఉన్నా తప్పుకుని ఓడిపోతున్నాను. జీవితాన్ని గెలుచుకునేందుకు” అని ఆ పందెం నుంచి నిష్క్రమిస్తాడు. అన్ లెర్నింగ్ అంటే ఇది. తనది కానిది వదులుకోవడం. అట్లా రమేష్ బాబు కూడా అందివచ్చిన అవకాశాలను కాదని స్వతంత్రంగా ఉండటానికి మొగ్గు చూపాడు.

వదులుకోవడంలో అనేక పాత్రలను రచించాడు రమేష్ బాబు. అందులో ఒక ముఖ్యమంత్రి ఆహ్వానం ఉన్న మనిషి కూడా ఉంది. ఫుట్ పాత్ నివాసులకు పది రూపాయలకే అన్నం పెట్టే ఒక అమ్మ ప్యారడైజ్ హోటల్ వద్ద ఉంటుంది. పదిహేనేళ్ళ కింద రాసిన ఆమె పరిచయం మరో విధమైన ‘అసాధన’.

రోజూ కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని వచ్చి పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు దాకా వందలాది మందికి చవకగా అన్నం పెడుతుంది ఆ తల్లి. ఆమె కథనం చదివిన వైఎస్ రాజశేఖర రెడ్డి తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి ఆమెకు సహకరించాలని అనుకుంటాడు. కానీ తాను వెళ్ళదు. అదేమిటని ఫోన్ చేస్తాడు మరుసటి రోజు. “ఆకలితో నకనకలాడే వాళ్ళను వదిలి నీ దగ్గరకు ఎలా వస్తాననుకున్నావు బిడ్డా? రాలేను” అని ప్రేమగా చెబుతుంది. “నన్ను చూసుకునేందుకు నాకు కొడుకులున్నారు. కడుపునిండా అన్నం కోసం ఎదురు చూసే ఆ బిడ్డలకు నేనున్నాను. నాకు నీ సహాయం ఎందుకు బిడ్డా?” అని సున్నితంగా ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని తిరస్కరిస్తుంది. ఏదీ ఆశించకుండా చేతనైన సహాయం చేసే ఇలాంటి ‘అన్నపూర్ణ’లను అర్థం చేసుకోవడంలో -అవి ఎంత గొప్పవైనప్పటికీ, మనకున్న పదవీ అధికారాలు కూడా చిన్న బోతాయి. ఔదార్యం గల మనుషులకు ఎవరి సహాయ సహకారాలూ అక్కర్లేదన్న ఇంగితం ఆమె కార్యాచరణ బోధపరుస్తుంది. అలా అసాధనతో వన్నె తేలిన వ్యక్తులు మనం చూస్తున్న రమేష్ బాబును తీర్చిదిద్దారనవచ్చు.

ఒక విమలమ్మ గురించి చెప్పాలి. ఆమె అంధురాలే. కానీ గొప్ప దూరదృష్టి తన సొంతం. ఫుట్ పాత్ పై ఇరవై ఆరేళ్ళు జీవించి ధర్మం అడుక్కొంటూ తన ఇద్దరు కొడుకులను ఉన్నత విద్యావంతులను చేసిందామె. వారికి ఉద్యోగాలు వచ్చాక ఆ ‘వేదిక’ దిగి చిన్న గుడిసె వేసుకొని చరమ జీవితాన్ని గడుపుతోంది. చదువే పిల్లలకు బంగారు బాట అని తెలిసి, వారికి దూరంగా అంతకాలం ఒంటరి జీవితాన్ని గడిపి భవిష్యత్తును గెలుచుకున్న యోధురాలు ఆమె. “రెండున్నర దశాబ్దాలు ఫుట్ పాత్ పై గడిపాను. పిల్లల కోసమే అక్కడున్నాను. వారు ప్రయోజకులు అయ్యాక బిక్ష అక్కర్లేదనుకుని ఫుట్ పాత్ దిగేశాను” అని రమేష్ బాబు రిపోర్ట్ చేస్తాడు. ఎక్కడ తన కర్తవ్యాన్ని ఆపాలో తెలిసిన వివేకశీలి ఆమె అని గురించి ఆర్ద్రంగా రాస్తాడు.  “అనివార్య జీవన ప్రస్థానంలో ఎక్కడా దైన్యం లేదు. విచారం లేదు. పాదచారుల అడుగుల శబ్దం వింటూ వారిని ఆకర్షించేందుకు తాళం వేసుకుంటూ బ్రతికిన బాధ్యతాయుత మాతృమూర్తి ఆమె” అంటూ అసాధన అన్న భావనలో ఉన్న పరిమితిని, అందలో శాంతిని దర్శింపజేస్తాడు.

‘పరిమితిలోనే విస్తృతి ఉంది’ అని వివరించే మరో అసాధనమైనకథనం రాశాడు. చెట్లు నాటే ‘అశోకుడి’ పరిచయం అది. సాధారణంగా కోటి మొక్కలు నాటిన రామయ్య మనకు మంచి ఉదాహరణ. ఇతడు వేరు. “అతడిలా నువ్వు అంతటా కాకుండా మీ ఊర్లో మూడు చోట్ల మాత్రమే మొక్కలు నాటావు. బస్టాప్ లో, శ్మశానంలో, గుడి వద్ద మాత్రమే. ఎందుకని?” అని అడిగితే – విజయనగరం జిల్లాకు చెందిన ఆ మారుమూల సామాన్య రైతు ఏమన్నాడో తెలుసా?“మా ఊర్లో నలుగురు కూడే చోట నాటాను. పక్క ఊర్లో కూడా నేనే ఎందుకు నాటాలి? ఆ ఊర్లో మనుషులు లేరా?” అని అడిగాడు. అసాధనకు ఇంతకన్నా మంచి ఉదాహరణ బహుశా లేదేమో.

నీ బాధ్యత నీవు నిర్వహించడం. నిస్వార్థంగా. అది ఎవరో చెప్పినది కాకుండా ‘స్వీయ లక్ష్యం’ కావడం. అది అహంకారానికి తావిచ్చేది కాకపోవడం, దానికి పేరు, ప్రఖ్యాతి, డబ్బు, హోదాలతో నిమిత్తం లేకపోవడం. ఇదే పేరులేని పెద్దమనుషుల నుంచి సహజంగాసుందరంగా రమేష్ బాబు గ్రహించిన సారాంశం. అదే ‘అసాధన’.‘అన్ లెర్నింగ్’. సామాన్యశాస్త్త్రం కోర్ ఎస్సెన్స్ కూడా అదే.

దీన్ని వ్యక్తిత్వ వికాసం కాదంటాడు రమేష్ బాబు. ‘జీవన వికాసం’అంటాడు. అదే రాస్తాడు, చూపుతాడు. అవన్నీ విడివిడిగా వైవిధ్యమైనవి. ఎన్నెన్నో సామాన్యరూపాలు. కానీ వాటన్నిటిలో అంతస్సూత్రం …సామాన్య లక్షణాలు మాత్రం ఒకటే. అవేమిటో రేపు చూద్దాం.

రేపు:-
సామాన్యశాస్త్రం-3
“జీవితమే ఒక ఉత్సవం”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్