Mass role: ఒకప్పుడు గ్లామరస్ కథానాయికగా రమ్యకృష్ణ ఒక ఊపు ఊపేసింది. ఆ తరువాత అభినయం పరంగా కూడా అదరగొట్టేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను స్టార్ హీరోలతో వరుస సినిమాలను చుట్టబెట్టేసింది. ఇక రమ్యకృష్ణ తన కెరియర్లో చేస్తూ వచ్చిన అన్ని సినిమాలు ఒక ఎత్తు .. ‘నరసింహ’ సినిమాలో ఆమె పోషించిన ‘నీలాంబరి’ పాత్ర ఒక ఎత్తు. సాధారణంగా రజనీకాంత్ హీరోగా ఉన్నప్పుడు మరొకరికి క్రెడిట్ దక్కడమనేది జరగదు. కానీ ‘నీలాంబరి’ పాత్రలో ఆమె రజనీతో సమానమైన మార్కులను కొట్టేసింది.

ఆ తరువాత ఆమెకి అంతగా పేరు తెచ్చిపెట్టిన పాత్ర ఏదైనా ఉందంటే .. అది ‘శివగామి’నే.  ‘బాహుబలి’ సినిమాలోని ఈ పాత్రలో రమ్యకృష్ణ తప్ప మరొకరు ఆ స్థాయిలో చేయలేరని అంతా అనుకున్నారు. ఆ సినిమాలో ప్రభాస్ .. రానా తరువాత ఆ స్థాయిలో జనం నుంచి ఆదరణ పొందిన పాత్ర ఆమెదే. ఆ సినిమా తరువాత రమ్యకృష్ణ ప్రాధాన్యత కలిగిన పాత్రలనే చేస్తూ వెళ్లిందిగానీ, ఆ స్థాయిలో విలక్షణమైన పాత్రలు మాత్రం పడలేదు. కానీ ‘లైగర్’ ట్రైలర్ చూస్తుంటే ఆమెను గురించి మరోసారి అంతా మాట్లాడుకునే సమయం మళ్లీ వచ్చేలానే అనిపిస్తోంది.

పూరి జగన్నాథ్ దర్శక నిర్మాతగా ‘లైగర్’ సినిమాను రూపొందించాడు. బాక్సర్ గా విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాలో ఆయన తల్లి పాత్రలో రమ్యకృష్ణ  కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె లుక్ .. మాట తీరు ..  యాస పూర్తిగా మార్చేశారనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ఎలాంటివారినైనా లెక్క చేయకుండా పోట్లాడే ఈ పాత్రలో రమ్యకృష్ణ ఒక రేంజ్ లో విజృభించిందనే విషయం ట్రైలర్  చూస్తేనే తెలిసిపోతోంది. ఈ పాత్ర కూడా ఆమె కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే అనిపిస్తోంది. ఆగస్టు 25 తరువాత రమ్యకృష్ణ గురించి ఎలా మాట్లాడుకుంటారనేది చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *