Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనాటకాన్ని మింగిన సినిమా- థియేటర్ ను మింగేయబోతున్న ఓటీటీ

నాటకాన్ని మింగిన సినిమా- థియేటర్ ను మింగేయబోతున్న ఓటీటీ

ఇది రంగమార్తాండ సినిమా సమీక్ష కాదు. ఆ సినిమాలో కొన్ని అంశాల ప్రస్తావన.

బ్రహ్మానందం విశ్వరూపం
బ్రహ్మానందం తెలుగు సాహిత్యాన్ని బాగా చదివినవాడు. మంచి చిత్రకారుడు. మంచి టైమింగ్ ఉన్నవాడు. నోరు విప్పకుండా ముఖ కవళికలతో కూడా భావాన్ని పలికించగలిగినవాడు. కను సైగలతోనే హాస్యం ఒలికించగలిగినవాడు. దశాబ్దాలుగా ఆయన లేని సినిమాలు లేవనేంతగా తెలుగు తెరమీద వ్యాపించినవాడు. ఇవి అందరికీ తెలిసిన విషయాలే. ఇన్నేళ్లయినా…ఇన్ని వందల సినిమాలు చేసినా…ఇంకా…ఒక సరయిన పాత్ర దొరికితే…బ్రహ్మానందం ఎంతగా ప్రాణం పెట్టి…ఆ పాత్రకు ప్రాణం పోయగలడో తెలియాలంటే…రంగమార్తాండ చూడాలి. సినిమాలో టైటిల్ పాత్ర ప్రకాష్ రాజ్ దే అయినా…నా వరకు బ్రహ్మానందమే ఆ మధ్యందిన రంగమార్తాండుడు.

ప్రకాష్ రాజ్ నటరూపం
అలాగని...ప్రకాష్ రాజ్ ను తక్కువ చేయడానికి వీల్లేదు. రంగమార్తాండ రాఘవ రావు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. పెరిగే పిల్లలు, మారే వారి అభిరుచులు, ప్రాధాన్యాల ముందు విలువ లేనివారయ్యే తల్లుదండ్రులు నిలువ నీడ లేని వారై…తల దాచుకోవడానికి పని మనిషి దాపు కూడా పనికిరానిదై అర్ధరాత్రి రోడ్డున పడి…భార్యను కూడా కోల్పోయి ఒంటరి వాడు కావడం లాంటి అనేక సందర్భాల్లో ప్రకాష్ రాజ్ కు ప్రకాష్ రాజే ఎలా పోటీగా నిలబడ్డాడో తెలియాలంటే రంగమార్తాండ చూడాలి.

సిరివెన్నెల మహా కావ్యం
“ఒక పాత్ర ముగిసింది నేడు 
ఇంకెన్ని మిగిలాయో చూడు 
నడిపేది పైనున్న వాడు 
నటుడేగా నరుడన్న వాడు 
తానే తన ప్రేక్షకుడూ అవుతాడు 
ఎవడో ఆ సూత్రధారి? 
తెలుసా ఓ వేషధారి?
మళ్ళి మళ్ళి వందేళ్లు రోజూ సరికొత్తే 
ఎప్పటికైనా తెలిసేనా
బతకడమేంటంటే?”

సినిమాల్లో ఇంత జీవన వేదాంత సారాన్ని పిండి…పాటలుగా మలిచి…జనం చెవులు దాటి…లోలోపల మనసు, మెదళ్లలోకి దూరి...ప్రశ్నించగల సిరివెన్నెల ఒక్కో మాట ఒక్కో కావ్యం. ఒక మనిషిలోనే ఎన్నెన్నో పాత్రలు. ఎన్నెన్నో మజిలీలు. ఎన్నెన్నో అంకాలు. తెరపడేవి కొన్ని. ఎప్పటికీ తెరపడనివి కొన్ని. ఏరోజుకారోజు సరికొత్త నాటకమే. వందేళ్లయినా తెలుస్తుందా? అసలు బతుకు నాటకం ఏంటో?

ఇంకో సిరివెన్నెలను సినిమా పరిశ్రమ పుట్టించకపోతే…తెలుగు పాటలు నెమ్మదిగా పాటకున్న మౌలికమయిన స్వరూపాన్ని, స్వభావాన్ని, ఉద్దేశాన్ని మరిచిపోయే ప్రమాదం ఉంది. సిరివెన్నెలకు ప్రత్యామ్నాయం ఎందుకు లేదో తెలియాలంటే రంగమార్తాండ చూడాలి.

తెలుగు నిషేధం
ఆధునిక ఇంగ్లీషు బడి చదువుల్లో తెలుగు మాట్లాడినందుకు పిల్లలను మండే బండలెక్కించే శిక్షలు అనుభవించాల్సిన రోజుల్లో ఉన్నాం. ఇంగ్లీషు తప్పనిసరి అయినా…మాతృ భాష కూడా ఎందుకు అంతే తప్పనిసరో తెలియాలంటే రంగమార్తాండ చూడాలి.

తల్లిదండ్రులు బరువు
తమ సర్వస్వము ధార పోసిన తల్లిదండ్రులు ఒక వయసు రాగానే ఎందుకు పిల్లలకు బరువైపోతున్నారో? పిల్లల దగ్గర ఉండలేక…ఇంకెక్కడికి వెళ్లలేక …తల్లిదండ్రులు అనుభవించే నరకయాతన తెలియాలంటే రంగమార్తాండ చూడాలి.

కృష్ణ వంశీ తపన
నానా పటేకర్ హీరోగా మరాఠీ నటసామ్రాట్ సినిమాతో పోలిస్తే రంగమార్తాండ ఎలా ఉంది? లాంటి కంపారిటివ్ స్టడీలోకి నేను వెళ్లడం లేదు. సినిమా కలెక్షన్లు, స్క్రీన్లు, ఓ టి టి రాబడులు, లాభ నష్టాలు నాకు తెలియవు.

నాటకాన్ని సినిమా మింగేసింది.
ఇతర కళలను టి వి పెట్టె ముంచేసింది.
థియేటర్లను ఓ టీ టీ మింగేస్తోంది.
చిన చేపను పెద చేప మింగుతూనే ఉంటుంది.

ఒకానొక రంగస్థల నటుడి కోణంలో కృష్ణవంశీ చెప్పిన రంగమార్తాండ కథనంలో సగటు తల్లిదండ్రులు కనిపిస్తారు. అంతరించిపోయే కళలు చివరికి అంట్లు తోముకోవడం దగ్గర చూడాల్సి రావడం అధివాస్తవికత కాదు. అదే వాస్తవికత.

వెలితి
“నేనొక నటుడ్ని…తొమ్మిది తలల నట రావణాసురుడిని” అని లక్ష్మీ భూపాల్ రాయగా చిరంజీవి నేపథ్య వ్యాఖ్య చెప్పారు. సినిమాలో మరో రెండు చోట్ల మాత్రం రావణుడి పది తలలు అని డైలాగ్ లు ఉన్నాయి. (వాల్మీకికి మాత్రం రావణుడు పడుకున్నప్పుడు ఒక తల, లేచినప్పుడు పది తలలు కనిపించాయి)

ప్రారంభంలో చిరంజీవి నేపథ్య వ్యాఖ్యకు ఫోటోల మాంటేజ్ లో సావిత్రి, జమున, కన్నాంబ లాంటి మేరునగ సమానులయిన ఒక్క స్త్రీ పాత్ర అయినా లేకపోవడం ఒక వెలితి.

సిరివెన్నెల అనితరసాధ్యమయిన రచన సినిమా అంతా పాటగా మధ్య మధ్యలో వస్తూనే ఉంటుంది. ఇళయరాజా కాకుండా ఏ కీరవాణి లేదా కైలాష్ ఖేర్ లా వైవిధ్యమయిన గాత్రం ఉన్నవారు పాడి ఉంటే ఇంకా ఆర్ద్రంగా ఉండి ఉండేదేమో!

ఉపసంహారం:-
తెలుగు వ్యంగ్య రచనలో చేయి తిరిగిన జి. ఆర్. మహర్షి “నాటకం విషాదాంత మరణం” అని 2008లో రాసిన ఒక కాలంలో ముగింపు మాటలు యథాతథంగా:-

“రంగస్థలంపై తెరలు ఎత్తకముందే విదూషకుడు ప్రత్యక్షమయ్యాడు.

విదూషకుడు:
దయతో ప్రేక్షకులందరూ వెళ్లిపోవాలని ప్రార్థన. మీరు చూడదలచుకున్న నాటకం తొందరపడి ఆత్మహత్య చేసుకుంది. పరదాకి కట్టిన తాడుతో ఉరేసుకుంది. రంగస్థలం ముసుగు తొలగిస్తే మీరు ఉరికొయ్యకి వేలాడుతున్న నాటకాన్ని చూడొచ్చు. చివరిసారి నాటకం రాసిన ఉత్తరాన్ని చదవమంటారా?

విదూషకుడు చక్కని హాస్యం సృష్టిస్తున్నాడనుకున్న ప్రేక్షకులు బిగ్గరగా నవ్వుతూ ‘తొందరగా చదువు’ అంటూ అరిచారు.

విదూషకుడు జేబులోనుంచి ఒక ఉత్తరాన్ని తీసి

“ఇప్పుడు ప్రజలకు నాటకాలతో పనిలేదు. ఎవడి నాటకంలో వాడు మునిగిపోయాడు. ఇళ్లలోనూ, సందుగొందుల్లోనూ, వీధుల్లోనూ ఎక్కడ చూసినా నాటకాలే. ఎవడి స్క్రిప్ట్ వాడే రాసుకుని నటించేస్తున్నాడు. ఒకే వ్యక్తి అనేక పాత్రల్లో దూరి రక్తి కట్టిస్తున్నాడు. నటనిప్పుడు వెన్నతో పెట్టిన విద్య.

పరదాల చాటున, ఫోకసింగ్ లైట్ల వెలుగులో నడిచే నాటకం ఇక ఎవ్వరికీ అక్కరలేదు. ఆత్మహత్య చేసుకోవడం కూడా కొన్నిసార్లు సంఘసేవతో సమానం” అని చదవడం ముగించాడు.

జనం మళ్లీ చప్పట్లు కొట్టి “ఇంతకీ ఏమంటున్నావ్?” అని అరిచారు.

విదూషకుడు:
నాటకం అంతిమ యాత్రలో పాల్గొనమని అడుగుతున్నాను.

ప్రేక్షకులు:
కుదరదు. మేము టికెట్లు కొని వచ్చాం. నాటకం చూపాల్సిందే. లేదా డబ్బులివ్వండి.

విదూషకుడు:
అయ్యా, నిర్వాహకుడు పరారయ్యాడు. వాడు బహుశా ఏ వీధిలోనే నాటకం శవాన్ని ముందు పెట్టుకుని డబ్బులు అడుక్కుంటూ వుంటాడు. (ఈ మాట ముగియక ముందే విదూషకుడిపై టమోటాలు, కోడిగుడ్లు పడ్డాయి)

ఇంతలో ఒక పెద్దమనిషి స్టేజిపైకి వచ్చి ఆగండి” అని అరిచాడు. “అయ్యా తమరెవరు?” అని విదూషకుడు అడిగాడు.

మనుషుల్ని జంతువులు వాసన పట్టినట్టు, రాజకీయమెక్కడున్నా నేను వాసన పడతాను” అన్నాడా పెద్దమనిషి.

విదూషకుడు:
ఇక్కడ రాజకీయమెక్కడుంది?

పెద్దమనిషి:
టికెట్లమ్మి నాటకం చూపించకపోవడం రాజకీయం కాదా. పెద్దమనిషి అనుచరులు ఐదుగురు స్టేజిపైకి ఎక్కారు.

“మా అన్న ఒక్క ఎమ్మెల్యే టికెట్ తప్ప ఇంకే టికెట్ కొనడు. అన్న కోరినట్టు నాటకం వేయకుంటే ఇప్పుడే ఆత్మాహుతి చేసుకుంటా” అని ఒక అనుచరుడు కిరోసిన్ నెత్తిన పోసుకున్నాడు. వెంటవున్న నలుగురు గట్టిగా పట్టుకుని అగ్గిపెట్టె అతనికి దొరక్కుండా జాగ్రత్తపడ్డారు.

పెద్దమనిషి:
వీడు నాకోసం ఇప్పటికి నూటపదారుసార్లు ఆత్మాహుతికి ప్రయత్నించాడు. వాడిని రెచ్చగొట్టకు.

విదూషకుడు పారిపోడానికి ప్రయత్నించాడు. ఇదంతా చూస్తున్న జనం ఈలలు వేశారు.

పెద్దమనిషి:
ప్రజలకు ఏదీ నేరుగా చెప్పకూడదు. అర్థం కాకుండా గందరగోళంగా సంక్లిష్టంగా చెప్పాలి. అప్పుడే చప్పట్లు కొడతారు. నాటకం అనవసరంగా ఎందుకు చనిపోయిందో ఇప్పటికైనా అర్థమైందా?

ప్రేక్షకులు:
నాటకం చస్తే పీడపోయింది. కనీసం ఒక అధివాస్తవిక నాటకాన్నయినా చూపించండి.

విదూషకుడు:
ఎవరి మొహాలను వాళ్లు అద్దంలో చూసుకోండి. అద్దంలో మన మొహానికి బదులు వందరకాల ముఖాలు కనిపించడమే అధివాస్తవికత అంటే!

జనం మళ్లీ కోడిగుడ్లు విసిరారు. విదూషకుడి మొహం పచ్చడైంది”.

కొన్ని సమస్యలకు పరిష్కారాలు ఉండవు.
కొన్ని ఏడుపులకు ఓదార్పులు కూడా ఉండవు.
రంగువెలిసి…ఉనికి కోల్పోయిన రంగస్థలం బాధ, రంగమార్తాండుడి విషాదాంత మరణం కూడా అంతే!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్