Sunday, January 19, 2025
Homeసినిమాతెలుగు సినీ పరిశ్రమకు దొరికిన ముత్యం

తెలుగు సినీ పరిశ్రమకు దొరికిన ముత్యం

Rao Gopal Rao Is A TrendSetter For Ever In Telugu Cinema Villain Characters : 

తెలుగుతెరపై విలనిజం తన రూపును, రేఖలను మార్చుకుంటూ వచ్చింది.  తొలితరం విలన్లు వేషధారణతో భయపెట్టడమే కాకుండా, అరుపులు..కేకలతో ఆడియన్స్ కి దడపుట్టించేవారు.  అలా రాజనాల తరహా విలనిజం చాలాకాలంపాటు కొనసాగింది. ఇక నాగభూషణం దగ్గరికి వచ్చేసరికి, ఆయన తన విలనిజానికి కామెడీని మిక్స్ చేశారు. అందితే జుట్టు .. అందకపోతే కాళ్లు అన్నట్టుగా ఆయన తన విలనిజాన్ని డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో నడిపించారు. ఆ తరువాత విలనిజం రావు గోపాలరావు చేతిలోకి వచ్చింది.

రావు గోపాలరావు వీలైనంతవరకూ విలనిజాన్ని మార్చేశారు. నాగభూషణంలా కామెడీ విలనిజం చేయకుండా, కామెడీ  కోసం తన పక్కన అల్లు రామలింగయ్యను పెట్టేసుకుని, తను మాత్రం సీరియస్ విలనిజాన్నే కదను తొక్కించారు. హీరోను కంగారు పెట్టాలేగానీ .. విలన్ టెన్షన్ పడకూడదు  అన్నట్టుగా నిదానంగా .. నిబ్బరంగా .. తాపీగా తన విలనిజాన్ని కొనసాగించారు. హీరో ఎదురుగా వచ్చి ఆవేశంతో  భారీ  డైలాగు చెప్పినా, ఒక సామెతనో .. నానుడినో జోడించి చాలా సింపుల్ గా పాలపై మీగడను తీసేసినంత తేలికగా తేల్చిపారేసేవారు.

డైలాగ్ లోని పదాలను ఎక్కడ నొక్కి పట్టాలి .. ఎక్కడ ఎక్కు పెట్టాలి అనేది రావు గోపాలరావుకి బాగా తెలుసు. ఆ విరుపుతోనే అయన విరుగుడు లేని విలనిజానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. ఏ పాత్రను ఇచ్చినా ఆయన గొప్పగా పండించడానికీ, అద్భుతంగా వండి వడ్డించడానికి కారణం ఆయన నాటక రంగం నుంచి రావడమే. కాకినాడ సమీపంలోని ‘గంగనపల్లి’లో జన్మించిన రావు గోపాలరావుకి, నాటకాలపై ఆసక్తి పెరుగుతూ వెళ్లింది. తనే ఒక నాటక సంస్థను ఏర్పాటు చేసుకుని, అనేక నాటక ప్రదర్శనలిస్తూ వెళ్లారు. అలా ఒకసారి ఒక నాటక ప్రదర్శన ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఎస్వీ రంగారావు కంటపడ్డారు.

రావు గోపాలరావును అభినందించిన ఎస్వీ రంగారావు. మద్రాసు వచ్చి తనని కలవమని చెప్పి వెళ్లారట. ఆ తరువాత ఆయన మద్రాసు వెళ్లి ఎస్వీఆర్ ను కలవడం .. ఆయన రావు గోపాలరావును దర్శకుడు గుత్తా రామినీడుకి పరిచయం చేయడం జరిగిపోయింది. గుత్తా రామినీడు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తూ .. చిన్నచిన్న పాత్రలను చేస్తూ రావు గోపాలరావు ముందుకు వెళ్లడం మొదలుపెట్టారు. అలా ఆయన ఒక నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి కొంత సమయం పట్టింది. అయితే రావు గోపాలరావుకి ఒక చిత్రమైన పరిస్థితి ఎదురైంది.

ఏ వాయిస్ కారణంగా తాను నాటకాల్లో ఫేమస్ అయ్యాడో .. సినిమాల్లోకి వచ్చాక  ఆ వాయిస్ పనికి రాదని అంటూ ఉంటే ఆయన నీరుగారిపోవడం మొదలైంది. తాను చేసిన కొన్ని పాత్రలకి వేరేవారితో డబ్బింగ్ చెప్పించడం ఆయనను పూర్తిగా నిరాశ పరిచింది. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన వాయిస్ లోను … డైలాగ్ డెలివరీలోను గల ప్రత్యేకతను బాపు – రమణ గుర్తించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన డైలాగ్స్ రాసి, ‘ముత్యాల ముగ్గు‘ సినిమాతో ప్రోత్సహించారు. ఈ సినిమాలో ‘కైలాసనాథ శాస్త్రి’ పాత్రలో ఆయన చేసిన విశ్వరూప విన్యాసం అందరికీ తెలిసిందే.

కథాకథనాల పరంగా ‘ముత్యాలముగ్గు’ ఎన్ని మార్కులు కొట్టేసిందో, రావు గోపాలరావు డైలాగ్స్ కారణంగా అన్ని  మార్కులను సొంతం చేసుకుంది. ఆ తరువాత వచ్చిన ‘భక్త కన్నప్ప’ ఆయన విలనిజాన్ని మరింత బలపరిచింది. ఇక అప్పటి నుంచి రావు గోపాలరావు వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. గ్రామీణ వ్యవస్థలో  అన్యాయాలకు పాల్పడే భూస్వామిగా .. అవినీతికి పాల్పడే గ్రామ పెద్దగా .. స్వార్థపరుడైన జకీయనాయకుడిగా .. అక్రమాలకు పాల్పడే వ్యాపారవేత్తగా .. ఇలా వివిధ రకాల పాత్రల్లో విలనిజాన్ని విస్తృతమైన స్థాయిలో పరచుకుంటూ వెళ్లారు.

‘ముత్యాల ముగ్గు’లో కాంట్రాక్టరు పాత్రలో “ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టుగా లేదూ ..” అంటూ ఆయన చెప్పిన డైలాగులు .. ” నిన్న రాత్రి యథా ప్రకారం కైలాసం వెళ్లి వచ్చాను .. “ అంటూ ‘భక్త కన్నప్ప’లో చెప్పిన డైలాగులు .. ‘వేటగాడు’లో ప్రాస వచ్చేలా గుక్కతిప్పుకోకుండా ఆయన పేల్చినా మాటల తూటాలను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ‘ఫర్ సపోజు’ అనే ఊతపదం వాడుతూ ‘ఆ ఒక్కటీ అడక్కు’  సినిమాలో ఆయన పోషించిన రొయ్యల నాయుడు పాత్ర, ‘క్రమశిక్షణ తప్పినవారిని దారిలో పెట్టడం నా ధర్మం’ అంటూ అన్న కొడుకును దండించే ‘యముడికి మొగుడు’లోని పాత్ర అంతేలా గుర్తుండిపోతాయి.

ఇలా విలనిజంలోనే ఆయన వీలైనన్ని పాత్రలను చేశారు. పైకి పెద్ద మనిషిలా కనిపిస్తూ పగ .. పన్నాగాలు .. కుట్రలు .. కుతంత్రాలకు సంబంధించిన హావభావాలను ఆయన అద్భుతంగా పలికించారు. కార్పొరేట్ స్థాయి విలన్ గా .. గ్రామీణ స్థాయి ప్రతినాయకుడిగా ఆయన అద్దినట్టుగా సరిపోయేవారు. ఆయా పాత్రల్లో చెలరేగిపోయేవారు. ఎన్టీఆర్ .. ఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు వంటి సీనియర్ స్టార్ హీరోలకు తన విలనిజంతో కుదురు ఉండనీయలేదు. ఆ తరువాత తరం వారైన చిరంజీవి .. బాలకృష్ణ వంటి హీరోలకు సైతం తన విలనిజంతో కునుకుపట్టనీయలేదు.

ఇలా రావు గోపాలరావు విలక్షణమైన పాత్రలతో దాదాపు మూడు దశాబ్ధాల పాటు ఎదురులేని ప్రయాణాన్ని కొనసాగించారు. తిరుగులేని ప్రతినాయకుడు అనిపించుకున్నారు. ఆ తరువాత ఎంతమంది ప్రతినాయకులు తెలుగు తెరపైకి వచ్చినా, ఆయన స్థానానికి అల్లంత దూరంలోనే ఉండిపోయారు. అభిమానుల హృదయాల్లో ఆయన ప్రత్యేకత అలాగే ఉండిపోయింది. నట విరాట్ .. కళాప్రపూర్ణ వంటి బిరుదులను పొందిన ఆయన వర్ధంతి నేడు(ఆగస్ట్ 13). ఈ సందర్భంగా మనసారా ఓ సారి ఆయనను స్మరించుకుందాం.

(రావు గోపాలరావు వర్ధంతి ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : ఎదురులేని నటుడు ఎస్వీఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్