అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని తెలుస్తోందన్నారు. పంటల గణనను సత్వరమే చేపట్టి మానవతా దృక్పథంతో నష్టపరిహారం చెల్లించాలని సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటనను జనసేన పార్టీ విడుదల చేసింది.
ధాన్యం కొనుగోలు సవ్యంగా సాగడంలేదని, ఉభయ గోదావరి జిల్లాల్లో సాగు చేసిన జయ రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని, దీనివల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని పవన్ ఆరోపించారు. ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో బస్తాకు 300 రూపాయల నష్టంతో మిల్లర్లకు అమ్ముకుంటున్నారని, మామిడి నేలరాలిందని, మొక్క జొన్న కూడా మొలకెత్తిపోయిందని… ఈ రైతులకు కూడా భరోసా ఇవ్వాలని పవన్ కోరారు.
ప్రకృతి విపత్తులతో నష్టపోయే రైతులు, కౌలురైతుల వేదనను కళ్ళారా చూశానని, కౌలు రైతు భరోసా యాత్రలో వారి ఇబ్బందులు స్వయంగా విన్నానని పేర్కొన్నారు. విపత్తుల కారణంగా నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకు వస్తామని, దీనిపై రైతు ప్రతినిధులు, వ్యవసాయ, ఆర్ధిక శాస్త్రవేత్తలతో చర్చిస్తున్నట్లు పవన్ వెల్లడించారు.