Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశ్రీకృష్ణ కర్ణామృతం-1

శ్రీకృష్ణ కర్ణామృతం-1

అనంతమైన వేదాలను నాలుగుగా పరిష్కరించి; అష్టాదశ పురాణాలు రచించినా వ్యాసుడికి ఇంకా ఏదో వెలితి మిగిలిపోతే…ఆ వెలితి ఏమిటో చెప్పినవాడు నారదుడు. వాల్మీకికి రాముడి కథ చెప్పి రాయమన్నది కూడా నారదుడే. భగవంతుడి కథలను తనివితీరా భాగవతంగా రాయి…ఆ వెలితి తీరిపోతుందని సలహా ఇచ్చాడు నవవిధ భక్తులను సూత్రీకరించిన నారదుడు. అప్పుడు భాగవతం రాశాడు వ్యాసుడు.

వ్యాసుడి భాగవతంలో కృష్ణ కథలు అద్భుతంగా ఉంటాయి. ఆ వ్యాసుడు దర్శించిన కృష్ణుడిని తెలుగువారి ఇళ్లల్లో పిల్లాడిని చేశాడు తెలుగు భాగవతంలో మన బమ్మెర పోతన. సాధారణంగా సంస్కృత శ్లోకాల్లో, స్తోత్రాల్లో బీజాక్షరాలుంటాయి. వాటిని పలికే పద్ధతిలో పలికితే శక్తులుంటాయి. పోతన తెలుగు పద్యాల్లో సంస్కృత మంత్రశక్తులను మించి మహత్వ, కవిత్వ, పటుత్వ శక్తులను నింపాడు. కొన్ని చోట్ల సంస్కృత భాగవతానికి మించిన శబ్ద సౌందర్యం, అర్థ గాంభీర్యం, రస సిద్ధి పోతన సాధించడం తెలుగువారి అదృష్టం. పదహారణాల తెలుగు పద్యానికి, తెలుగుతనానికి, తెలుగు ధనానికి పోతన పెట్టింది పేరు.

“ఓ యమ్మ ! నీ కుమారుడు మాయిండ్లలొ పాలు పెరుగు మననీడమ్మా !
పోయెద మెక్కడికైనను మా యన్నల సురభులాన మంజుల వాణీ!”
అని గోపికలు మన తెలుగులోనే యశదమ్మకు ఫిర్యాదు చేస్తారు.

“నల్లనివాడు, పద్మనయనమ్ముల వాడు…నెమలిపింఛమువాడు…మీ పొదలమాటున లేడుకదమ్మ చెప్పరే!” అని గోపికలు మల్లె పొదలను మన తెలుగులోనే అడిగారు.

“లావొక్కింతయు లేదు…నీవు తప్ప వేరే దిక్కులేదు”
అని మొసలి నోటబడ్డ గజేంద్రుడు మన తెలుగులోనే ప్రార్థించాడు.
పోతన తెలుగు మందార మకరంద మాధుర్యాలను శ్రీకృష్ణుడు జుర్రుకున్నాడు.

“అల వైకుంఠపురంబు లోపల…ఆ మూల సౌధంబులో…” ఉన్న శ్రీకృష్ణుడిని పోతన తెలుగువారికి పట్టించాడు.

తన జన్మ చరితార్థం కావడానికి భాగవతాన్ని తెలుగులోకి అనువదిస్తున్నానని పోతన కావ్యారంభంలో అత్యంత వినయంగా చెప్పుకున్నాడు. తెలుగు భాషను, తెలుగువారిని కూడా చరితార్థులను చేశాడు. పోతన పద్యం పాడడం, వినడం, చదవడం, కనీసం తెలియడం తెలుగువారికి ఒక గుర్తింపు.

…అలా శ్రీకృష్ణకర్ణామృతం శ్లోకాలు పాడడం, వినడం, చదవడం, కనీసం తెలియడం భక్తులకు, సాహిత్యప్రియులకు, శబ్ద సౌందర్యారాధకులకు, ఛందోలంకార వ్యాకరణవేత్తలకు ఒక గుర్తింపు.

లీలాశుకుడి శ్రీకృష్ణ కర్ణామృతం సంస్కృత శ్లోకాలను అంతే గొప్పగా, అంతే అందంగా తెలుగు పద్యాల్లోకి అనువదించాడు మన వెలగపూడి వెంగనామాత్యుడు.

శ్రీకృష్ణ కర్ణామృతం పేరుకు తగ్గట్టు వీనులకు విందు. మనసుకు హాయి. కళ్లముందు కదిలే దృశ్యం. మదిలో నాటుకుపోయే చిత్రం. అందులో కొన్ని కథలు. కొన్ని సంభాషణలు. కొన్ని పులకింతలు. కొన్ని ప్రార్థనలు. కొన్ని పొగడ్తలు. కొన్ని పాడుకోదగ్గ పాటలు. కొన్ని ఆడుకోదగ్గ ఆటలు. కొన్ని అనుభవాలు. కొన్ని మైమరపులు. కొన్ని వేణుగానాలు. కొన్ని యమునాతరంగాలు. కొన్ని బృందావన వెన్నెల విహారాలు. అన్నీ కలిపి మనలో కృష్ణుడిని నిలిపే శబ్దరూపాలు. భావ చిత్రాలు. కాలాతీతుడిని భాషాతీతంగా పట్టుకున్న శ్లోకాలు; పద్యాలు.

కృష్ణాష్టమి సందర్భంగా ధారావాహికలో ఇది మొదటిది.

రేపు:-
లీలాశుకుడు, వెలగపూడి వెంగనామాత్యుడి గురించి.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్