Sunday, January 19, 2025
HomeTrending NewsGHMC voting: నేతలు, పార్టీల దన్నుతోనే ఓట్ల మాయ

GHMC voting: నేతలు, పార్టీల దన్నుతోనే ఓట్ల మాయ

తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమైన అంకం ముగిసింది. ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగితే ఎవరి భవితవ్యం ఏంటో తేలనుంది. ఈ దఫా ఎన్నికల్లో ఎప్పటి మాదిరిగానే రాజధానిలో పోలింగ్ శాతం తగ్గింది. పోలింగ్ రోజు ప్రైవేటు సంస్థలు సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ దఫా ఎన్నికల సంఘం కరాఖండీగా వ్యవహరించింది. దీంతో చిరుద్యోగాలు చేసుకునే వారికి సెలవు లభించింది.

గ్రేటర్ హైదరాబాద్ శివారులోని కాలనీల ప్రజలు ఎక్కువగా వలస వచ్చిన వారు. వీరిలో అధిక శాతం గ్రామాల్లోనే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీనిపై ఎవరికి తోచిన రీతిలో వారు రాజధాని ఓటర్లపై సెటైర్లు వేస్తున్నారు. వాస్తవాలని పరిశీలిస్తే ఓటింగ్ తగ్గటానికి విభిన్న కారణాలు ఉన్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం 46.68 శాతం ఓటింగ్ నమోదు కాగా… మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా పాతబస్తీలోని యాకుత్ పుర నియోజకవర్గంలో 39.6 శాతం ఓటింగ్ జరిగింది. మునుగోడు విషయానికొస్తే దిలసుఖ్ నగర్, ఎల్ బి నగర్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. ఇవన్నీ GHMC పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాల వారికి స్వగ్రామాల్లో, ఇటు హైదరాబాద్ లో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి.

గ్రామాల్లో ఓట్లు వేసేందుకు వచ్చే వారికి దారి ఖర్చులు..ఒక రోజు ముందు వచ్చిన వారికి మద్యం, మాంసం తదితర సౌకర్యాలు కల్పించారు. రాజధానిలో అభ్యర్థులు ఓటర్లను నేరుగా కలిసే పరిస్థితి ఉండదు. ద్వితీయ శ్రేణి నాయకులే కలిసి వెళతారు. శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ దక్కేది శూన్యం. దీనికి తోడు వరుసగా సెలవులు రావటం కుటుంబంతో సహా గ్రామాలకు వెళితే బంధువులు, స్నేహితులను కలిసేందుకు అవకాశం ఉంటుంది.

మునుగోడు ఉపఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలన్నీ ఎల్బి నగర్ పరిసరాల్లో ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాయి. 40 శాతం ఓటర్లు ఇక్కడే ఉన్నారని మంత్రి కేటిఆర్ తో సహా అన్ని పార్టీల నేతలు మునుగోడు కోసం హైదరాబాద్లో సభలు సమావేశాలు నిర్వహించి ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు.

తెలంగాణ గ్రామీణ ఓటరు మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ కు చెందిన లక్షలమందికి హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయి. ఏపిలో పంచాయతి, శాసనసభ ఎన్నికలను పరిశీలిస్తే ఇక్కడి నుంచి బస్సుల్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. పార్టీలే రవాణా సౌకర్యం కల్పించి తీసుకెళ్ళాయి. కూకట్ పల్లి నియోజకవర్గంలో సుమారు 50 వేల దొంగ ఓట్లు సీమంధ్ర వారివి ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ 50 వేలమంది నియోజకవర్గంలో నివాసం ఉండేవారు కాదు. కేవలం ఓట్ల కోసం నమోదు చేయించారని…ఓ ప్రధాన పార్టీ నేత అనుచరగణం ఈ తతంగం చేస్తుంటారని చెప్పుకుంటారు.

తెలంగాణ గ్రామీణ ఓటరు, సీమాంధ్ర ఓటర్ల తరహాలోనే పాతబస్తీలో ఓట్ల వ్యవహారం ఉంది. ఇక్కడ అదనంగా కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్ ప్రాంతాలు, మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్ ప్రాంతాల వారికి లెక్కకు మించి పాతబస్తీలో ఓట్లు ఉన్నాయి. పార్టీలు వారి అవసరాలకు అనుగుణంగా ఈ ఓట్లను వినియోగించుకుంటాయి.

రెండు చోట్ల ఉన్నవారికి శాసనసభ, లోకసభ సమయంలోనే ఇబ్బంది ఎదురవుతుంది. వాటికి ఎదో ఒక చోట ఓటు వేస్తారు. స్థానిక సంస్థలు, GHMC ఎన్నికలు వీరికి ముఖ్యం. ఈ రెండు ఒకేసారి జరిగే అవకాశం లేకపోవటంతో ఇరు ప్రాంతాల్లో ఓట్లు కొనసాగిస్తున్నారు. రాజధానిలో అత్యల్ప ఓటింగ్ శాతానికి ఈవిధమైన కారణాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు, నేతల దన్నుతోనే దొంగ ఓట్ల మాయ జరుగుతోందనేది కాదనలేని వాస్తవం. ఎన్నికల సంఘం పూనుకుంటే ఓట్ల మాయను కట్టడి చేయవచ్చు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్