Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆయువు పోస్తుందా ఆయుధమేదైనా?

ఆయువు పోస్తుందా ఆయుధమేదైనా?

“నీకు తెలియనిదా నేస్తమా?
విద్వేషం పాలించే దేశం ఉంటుందా?
విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా?
ఉండుంటే అది మనిషిది అయి ఉంటుందా?
అడిగావా భూగోళమా?
నువ్వు చూశావా ఓ కాలమా?

రా ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం
ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా?
ఆయువు పోస్తుందా ఆయుధమేధైనా?
రాకాసుల మూకల్లె మార్చద పిడివాదం?
రాబందుల రెక్కల సడి ఏ జీవన వేదం?
సాధించేదేముంది ఈ వ్యర్ధ విరోధం?
ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం
రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం
ఈ పూటే ఇంకదు అందాం
నేటి దైన్యానికి ధైర్యం ఇద్దాం

రా ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం
అందరికి సొంతం అందాల లోకం కొందరికే ఉందా పొందే అధికారం?
మట్టి తోటి చుట్టరికం మరిపించే వైరం
గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం?
ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం?
నీకు తెలియనిదా నేస్తమా
ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం?
చెంత చేరననే పంతమా?
ఖండాలుగ విడదీసే జండాలన్ని
తలవంచే తలపే అవుదాం ఆ తలపే మన గెలుపని అందాం”

కంచె సినిమాలో సిరివెన్నెల పాట ఇది.

దేశాల యుద్ధాల నెగళ్ళలో చలికాచుకునే ప్రపంచం. ఆయుధాల వ్యాపారాలకు యుద్ధాల మార్కెట్లను తయారుచేసే పెద్దన్న దేశాలు. యుద్ధాల బూచిలో విజయాల స్వప్నాలను నిజం చేసుకునే మహానేతలు. అర్థంలేని వైషమ్యాల్లో అర్థంకాకుండా చనిపోయి ప్రశ్నించలేని సిపాయిల కుత్తుకలు.
దేశం ఏదయినా విద్వేషం గెలుపు సూత్రం.
దేశం ఏదయినా విధ్వంసం బలవంతపు అంగీకారం.
“ఇక్కడ నేను క్షేమం – అక్కడ నువ్వు కూడా…

ఇప్పుడు రాత్రి, అర్ధ రాత్రి
నాకేం తోచదు నాలో ఒక భయం
తెల్లని దళసరి మంచు రాత్రి చీకటికి అంచు

దూరంగా పక్క డేరాలో కార్పోరల్ బూట్స్ చప్పుడు
ఎవరో గడ్డి మేట నుంచి పడ్డట్టు –

నిశ్శబ్దంలో నిద్రించిన సైనికుల గురక
చచ్చిన జీవుల మొరలా వుంది…

పోదు నాలో భయం-
మళ్ళీ రేపు ఉదయం
ఎడార్లు నదులూ అరణ్యాలు దాటాలి
ట్రెంచెస్ లో దాగాలి

పైన ఏరోప్లేను, చేతిలో స్టెన్ గన్
కీయిస్తే తిరిగే అట్ట ముక్క సైనికులం

మార్చ్!
వన్ టూ త్రీ షూట్ డెడ్ ఎవడ్?
నువ్వా నేనా?

కేబుల్ గ్రాం యిప్పించండి కేరాఫ్ సో అండ్ సో
(మీ వాడు డెడ్.)

సృహతప్పిన ఎనెస్తిషియాతో
వెన్నెముక కర్రలా బిగిసింది

యుద్ధం యుద్ధం…
లిబియాలో బెర్లిన్లో స్టాలిన్ గ్రాడ్ లో

స్వార్థం పిచ్చి కుక్కలా పెరిగింది…
నేనిది వరకటి నేను కాను
నాకు విలువల్లేవు
నాకు అనుభూతుల్లేవు
చంపడం, చావడం
మీసం దువ్వడం లాంటి అలవాటయ్యింది

కనిపించే ఈ యూనిఫారం క్రింద ఒక పెద్ద నిరాశ, అనాగరికత బ్రిడ్జీ క్రింద నది లాగా రహస్యం గా వుంది

వదల లేని మోపు ఊబిలాగా వుంది
నేనంటే నాకే అసహ్యం
అందుకే మరీ మరీ చంపుతాను, మరీ మరీ తాగుతాను
ఇంకేం చేసినా ఎవరూ ఒప్పుకోరు…

తిరిగి ఎప్పుడు మన ఊరు వస్తానో!
నిన్ను చూస్తానో?
ఎన్నాళ్ళకి? ఎన్నాళ్ళకి?

కొన్ని వేల మైళ్ళ దూరం మన మధ్య
ఒక యుగంలా అడ్డు పడింది

ఇంక సెలవ్ మై డియర్!
నిద్ర వస్తోంది మత్తుగా నల్లగా
అడుగో సెంట్రీ డేరా ముందు గోరీలా నిలబడ్డాడు …

మళ్ళీ జవాబు వ్రాయ్ సుమీ!
ఎన్నాళ్ళకో మరీ
సెలవ్! అబ్బా! చలి!
చలి గుండెల మీద కత్తిలా తెగింది
నీ రూపం నా దేహానికి వెచ్చగా తగిలింది”

దాదాపు డెబ్బయ్, డెబ్బయ్ అయిదేళ్ల కిందట దేవరకొండ బాల గంగాధర తిలక్ రాసిన కవిత ఇది. నాలుగు పదుల వయస్సు మాత్రమే బతికి తన అక్షరాలను వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో ఆడుకునే అమ్మాయిల్లా తీర్చి దిద్దినవాడు తిలక్. కవితా సతి నొసట నిత్య రస గంగాధర తిలకం- అని శ్రీ శ్రీ అంతటి వాడు పొంగి పరవశించిన కవిత తిలక్ ది. తెలుగు లేఖా సాహిత్యంలోనే ఆణిముత్యంలాంటి కవిత ఇది. ఒకప్పుడు తిలక్ రాసిన నీవులేవు నీపాట ఉంది…. ఈ సైనికుడి ఉత్తరం కవితలు చదవనివారు అసలు ఉండేవారే కాదు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏ దేశం కోసమో, ఏ దేశంతోనో, ఎక్కడో యుద్ధం చేసే మన సైనికుడి మానసిక సంఘర్షణను తిలక్ ఈ కవితలో ఒక డాక్యుమెంటరీ కంటే అద్భుతంగా రికార్డు చేశాడు. ఆ మధ్య క్రిష్ చక్కగా తెరకెక్కించిన కంచె సినిమా కథకు మాతృక ఈ కవితే.

ఎవరి దేశం ఎవరి సొంతం? ఎవరు ఆక్రమణదారులు? పొరుగు దేశాన్ని ముక్కలు చేసి రెండు కొత్త దేశాలను సృష్టించిన రష్యా…ఇదే సూత్రంతో ఎన్ని దేశాలనయినా సృష్టించగలదు. ఉక్రెయిన్ మీద యుద్ధానికి రష్యా చెప్పుకునే కారణాల్లో బలమెంత? నిజమెంత?

విద్వేషం పాలించే దేశాలు ఉన్నాయి. విధ్వంసం నిర్మించే నరకాలు ఉన్నాయి. భూగోళం చూస్తోంది. ఈకాలం వింటోంది. సరిహద్దుల కోటగోడలను నిర్మించడమే నవీన నీతి. ఆయువు తీసే ఆయుధమే ఇప్పటి పాఠం. రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యాన్ని ఈపూటే ఇంకింపజేయడమే ఇప్పటి యుద్ధ ధర్మం. ఖండాలుగా విడదీసే జెండాలే ఇప్పటి అజెండా.

సిరివెన్నెల పాటలు, తిలక్ కవితలు వినపడాల్సినవాళ్లకు వినపడవు. వినిపించినా అర్థం కాదు. అర్థమయినా ఆయుధం వదలరు. ఆయుధం వదిలినా పగను వదులుకోరు. యుద్ధం ఏదయినా మొదట చచ్చేది సైనికులే. ఆపై చావల్సినవాళ్లు సామాన్యులే.

అన్నట్లు-
ఆసియా ఖండంలో ఉద్రిక్తలు; రష్యా- ఉక్రెయిన్; గాజా గొడవల నేపథ్యంలో ప్రపంచ ఆయుధాల మార్కెట్ పంట పండిందట. ప్రపంచంలో పేరున్న వంద ఆయుధ తయారీ కంపెనీలు గడచిన ఒక్క సంవత్సరం అమ్మిన ఆయుధాల విలువ అక్షరాలా 53లక్షల కోట్లట. యాభై మూడు తరువాత ఎన్ని సున్నాలు పెడితే ఈ లెక్క సరిపోతుంది అన్నది సన్నాసులో, సున్నాసులో తీరుబడిగా చేసుకోవాల్సిన పని. బూడిద చేసే సున్నాలకు విలువేముంది? అని మనమనుకుంటే…బూడిదచేయడంలోనే అంతులేని వ్యాపారం దాగి ఉందని ఆయుధవ్యాపారులు చెప్తారు.

నిజజీవితంలో జరక్కపోయినా సినిమా తెరమీద 84 ఏళ్ళక్రితం ది గ్రేట్ డిక్టేటర్ సినిమా ముగింపులో ది గ్రేట్ చార్లీ చాప్లిన్ ప్రపంచశాంతిని కోరుతూ…యుద్ధం వద్దేవద్దని చెప్పిన అనన్యసామాన్యమైన ఉపన్యాసం వినండి:-

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్