Saturday, January 18, 2025
HomeTrending Newsపాకిస్తాన్ కష్టాలు తీర్చనున్న పసిడి నిల్వలు

పాకిస్తాన్ కష్టాలు తీర్చనున్న పసిడి నిల్వలు

ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ కు మంచి రోజులు రాబోతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి  సంస్థ(IMF) నుంచి రుణాలు, స్నేహపూర్వక దేశాల నుంఛి తీసుకున్న ఆర్థిక సహాయం తీర్చేందుకు ఎంతో సమయం పట్టదు.  కొంతకాలంగా ధరల పెరుగుదల, ఔషధాల కొరత, విద్యుత్ కోతలతో కొన్నాళ్ళుగా పొరుగు దేశంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి.

బలూచిస్తాన్ రాష్ట్రంలోని రెకో డిక్ గనిలో విస్తారమైన బంగారు గనులు ఉన్నట్టు వెల్లడైంది. ప్రభుత్వం ఈ గనిలో 15 శాతం వాటాను సౌదీ అరేబియాకు విక్రయించడాన్ని పరిశీలిస్తోంది. ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) రెకో డిక్ మైనింగ్ ప్రాజెక్ట్‌లో 15 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసింది.

దీంతో పాటు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో మైనింగ్ రంగం చుట్టూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులను ప్రతిపాదించింది. సౌదీ అరేబియా ప్రతిపాదనను సమీక్షించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

ఈ కమిటీ ఫెడరల్ క్యాబినెట్‌కు సిఫార్సులను అందజేస్తుంది. అది ధరపై తుది నిర్ణయం తీసుకుంటుంది. రెకో డిక్ మైనింగ్ ప్రాజెక్ట్‌లో 50 శాతం బారిక్ గోల్డ్ యాజమాన్యంలో ఉంది. మిగిలిన 50 శాతం పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రభుత్వాలు పంచుకుంటాయి. పాకిస్తాన్ ప్రస్తుత ఆర్థిక స్థితి నేపథ్యంలో దేశంలోని బంగారం, రాగి గనులు సంక్షోభాన్ని తగ్గించడంలో సహాయపడటానికి కీలకమైన వనరుగా ఉపయోగపడతాయి. బలూచిస్థాన్‌లోని చగై జిల్లాలో ఉన్న రెకో డిక్ గనిలో మిలియన్ టన్నుల బంగారం సమృద్ధిగా ఉన్నట్లు సమాచారం.

ఈ వనరును ఉపయోగించుకోవడం వల్ల పాకిస్తాన్ ఆర్థిక సవాళ్లను తగ్గించవచ్చు. రెకో డిక్ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద బంగారు, రాగి గనులలో ఒకటి, ఇది దేశానికి కీలకమైన ఆస్తి.

బలూచిస్తాన్ సహజ వనరులకు ప్రసిద్ధి చెందింది. ఆ గనులు బంగారం, రాగి తదితర గణనీయమైన నిల్వలను కలిగి ఉన్నాయి. 1995లో మొదటిసారిగా రెకో డిక్ గనిని తవ్వినప్పుడు మొదటి నాలుగు నెలల్లోనే 200 కిలోల బంగారం, 1,700 టన్నుల రాగి వెలికితీసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆ సమయంలో నిపుణులు గనిలో దాదాపు 400 మిలియన్ టన్నుల బంగారం ఉండవచ్చని అంచనా వేశారు. దీని విలువ $1 ట్రిలియన్ కంటే ఎక్కువ.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం రెకో డిక్ ప్రపంచంలోని అతిపెద్ద అభివృద్ధి చెందని రాగి,బంగారు నిల్వలలో ఒకటని తేలింది. అర్ధ శతాబ్దానికి పైగా సంవత్సరానికి రెండు లక్షల టన్నుల రాగి, రెండున్నర లక్షల ఔన్సుల బంగారాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం, బారిక్ గోల్డ్, ఆంటోఫాగస్టా PLC మధ్య వివాదం కారణంగా మైనింగ్ ప్రాజెక్ట్ పురోగతి నిలిచిపోయింది.
పాకిస్తాన్ అప్పు GDPలో 42 శాతానికి సమానంగా ఉంది.

బిజినెస్ టుడే నివేదిక ప్రకారం పాక్ విదేశీ రుణం 124.5 బిలియన్ల డాలర్లు ఉంది. ఇది దాని GDPలో 42%కి సమానం. IMF నుండి ఆర్థిక సహాయం కొంత ఉపశమనం ఇచ్చినా… దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి సరిపోదు. పాక్ ఆర్థిక వ్యవస్థకు పసిడి నిల్వలు ఉపశమనాన్ని ఇస్తాయి.

బలూచిస్తాన్ లో వేర్పావాదులు ప్రభుత్వంతో డీ అంటే డీ అంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా పాక్ సైన్యం, చైనా సంస్థల ఉద్యోగులపై దాడులు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి వెలికితీస్తున్న సహజవనరుల్లో న్యాయమైన వాటా దక్కటం లేదని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తోంది. ఈ తరుణంలో బంగారు గనుల తవ్వకం పాకిస్తాన్ ప్రభుత్వానికి సవాల్ కానుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్