పాకిస్థాన్ లో ఏడాది కాలంగా ఉగ్రవాద గ్రూపుల నేతలపై వరుసగా దాడులు జరగటం…మృతి చెందటం అందరిని నివ్వెరపరిచింది. దాడులకు గురైన ఏ నేత గాయాలతో, ఇతర కారణాలతో బతికి బట్ట కట్టలేదు. దాడి చేయటం అంటూ జరిగితే వారిని అంతం చేయటమే లక్ష్యంగా సాగాయి.
భారత్ హిట్ లిస్టులో ఉన్న ఉగ్రవాదులంతా వరుసగా హత్యలకు గురికాడం వెనక ఎవరు ఉన్నారన్నది తెలియడం లేదు. పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) అధికారంలోకి వచ్చాక ఈ తరహా దాడులు, మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఉగ్రవాద నేతలను అంతమొందించే పని ఉదృతంగా జరుగుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటే జవాబుదారిగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా బలూచిస్థాన్ సెనేటర్ అన్వర్-ఉల్-హక్ కాకర్ ను మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రతిపక్ష నాయకుడు రజా రియాజ్ ఏకాభిప్రాయంతో తీసుకొచ్చారు. ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రధానిని నామినేట్ చేసిన పిఎంఎల్(ఎన్) వర్గాలపైనే అనుమానాలు బలపడుతున్నాయి.
దేశంలో ఆర్మీ జోక్యం మితిమీరి పోయింది. దేశ ప్రజలు పెరుగుతున్న ధరలతో ఆందోళన చెందుతుంటే ఆర్మీకి బాధ్యత లేదు. ఖజానా నుంచి మొదట ఆర్మీ కేటాయింపులు పూర్తైన తర్వాత మిగిలింది ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఎదిరించిన ప్రధానులను గద్దె దించటం ఆర్మీ చీఫ్ లకు వెన్నతో పెట్టిన విద్య. 75 ఏళ్లలో ఒక్క పాకిస్తాన్ ప్రధాని కూడా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదంటే ఆర్మీ కుట్రలు అర్థం చేసుకోవచ్చు.
2015లో మోదీ-నవాజ్ షరీఫ్ భేటీ తర్వాత 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి జరిగింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరోసారి దెబ్బతిన్నాయి. ముష్కర మూకల పైశాచికత్వంతో పొరుగు దేశాలతో సంబంధాలు క్షీణించటం..ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
దేశంలో అస్థిరత తొలగి, రాజకీయంగా, ఆర్థికంగా దేశాన్ని గాడిలో పెట్టాలంటే టెర్రర్ జాడలు లేకుండా చేయటమే మంచిదని దేశంలోని ప్రధాన పార్టీలు ఒకతాటి మీదకు వచ్చినట్టుగా తెలిసింది. దేశంలో ఇంత మంది హతమవుతున్నా ఏ పార్టీ స్పందించటం లేదు. దేశంలో ఉగ్రవాదుల అలజడి, టెర్రరిస్టు కార్యకలాపాలను చూసి ఆర్మీ కూడా ఈ విషయంలో పట్టనట్టుగా వ్యవహరిస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ హత్యలపై పాక్ మిత్ర దేశం చైనా కూడా సంబందం లేనట్టుగా వ్యవహరిస్తోంది. భారత వ్యతిరేక శక్తులకు కొమ్ము కాసే డ్రాగన్ ఎందుకు మౌనం పాటిస్తుందో ప్రశ్నార్థకంగా మారింది. పాక్ ప్రజలు భారత్ తో సఖ్యత కోరుకుంటున్నారు. చైనా కబంద హస్తాల నుంచి బయటపడకపోతే దేశానికి నష్టమని పాక్ మేధావులు కొద్దిరోజులుగా హెచ్చరిస్తున్నారు.
ఉగ్రవాదుల హతం.. సమాజ హితం కోసం అని భావించాలి. పాక్ – భారత్ దేశాల మధ్య సయోధ్య నెలకొంటే రెండు దేశాల అభివృద్ధి రాకెట్ వేగంతో సాగుతుంది. ఇందుకు ఇరుదేశాల రాజకీయ నేతలు చిత్తశుద్దితో సంకల్పిస్తేనే సాధ్యం అవుతుంది.
-దేశవేని భాస్కర్