అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు యాత్రను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 30న యాత్ర ప్రారంభం కానుండగా.. దేశంలో కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో భక్తులను అనుమతించేందుకు దేవస్థానం బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది యాత్రికుల భద్రత కోసం జమ్మూకశ్మీర్ ప్రభుత్వం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) వ్యవస్థను ప్రవేశపెట్టనున్నది. దీనితో యాత్రికుల కదలికలను ట్రాక్ చేయనున్నారు.
దేశవ్యాప్తంగా 566 చోట్ల పేర్లు నమోదు చేసుకునేందుకు అమర్‌నాథ్ యాత్ర కోసం దేవస్థానం బోర్డు (SASB) అవకాశం ఇచ్చింది. ఈ సందర్భంగా దేవస్థానం బోర్డ్ మార్గదర్శకాలను జారీ చేసింది. 13 సంవత్సరాల కంటే తక్కువ, 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారు రిజిస్ట్రేషన్‌కు అర్హులు కాదు. అలాగే ఆరు వారాలు దాటిన గర్భిణులకు సైతం అవకాశం లేదని పేర్కొంది. రిజిస్ట్రేషన్ కోసం shriamarnathjishrine.com వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. దరఖాస్తుతో పాటు ఎస్‌ఏఎస్‌బీ సూచించిన ఆసుపత్రిల నుంచి తప్పనిసరిగా ధ్రువీకరణపత్రం, నాలుగు ఫొటోలతో పాటు రూ.120 ఫీజు చెల్లించాలన్నారు.