కరోనా సోకిన వ్యాధి గ్రస్తులకు చికిత్సలో ఉపయోగించే రెమిడిసివర్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య స్పష్టం చేశారు. మంగళవారం రాజ్యసభలో TRS రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రెండవ దశ కరోనా వ్యాపించినప్పుడు మే నెలలో ఒకేసారి ఎక్కువమందికి రెమిడిసివర్ అవసరం ఏర్పడడంతో సప్లై డిమాండ్ కు మధ్య వ్యత్యాసం ఏర్పడిందన్నారు. దీనితో కేంద్రం అప్పటికి అప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకొని 40 సంస్థలకు అప్రూవల్ ఇవ్వడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ కారణంగా 38 లక్షల సామర్ధ్యం నుంచి ఒకేసారి 122 లక్షల రెమిడిసివర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్లు మంత్రి మన్సుఖ్ చెప్పారు.
వీటితోపాటు నిరుపేదలకు అందుబాటులో ఉండే విధంగా 29 లక్షల రెమిడిసివర్లు ఉచితంగా రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం రెమిడిసివర్లు కావలసిన మేరకు అందుబాటులో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. నిర్దేశించిన దానికంటే ఎక్కువ ధరలకు విక్రయించకుండా ఉండడానికి బ్లాక్ మార్కెటింగ్ నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మెడిసిన్ కొరత లేకుండా చూసేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన వివరించారు దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులకు పంపించినట్లు మంత్రి మన్సుఖ్ వివరించారు.