DK Pattammal: A Meastro and Her Timeless Music
జాతీయ గాన కోకిల అని ప్రశంసించబడిన ప్రమూముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు డి.కె.పట్టమ్మాళ్ (D.K.Pattammal) గురించి కొన్ని సంగతులు….
తమిళనాడులోని కాంచీపురం సమీపంలో ఉన్న తామల్ అనే ఊళ్ళో డి.కె. పట్టమ్మాళ్ 1919లో జన్మించారు ఆవిడ తండ్రి కృష్ణస్వామి దీక్షితర్ భక్తిపాటలు పాడటంలో సిద్ధహస్తులు. ఆయన తమ కుమార్తెకు చిన్నవయస్సులోనే పాటలు నేర్పించారు. తల్లిదండ్రులు ఆవిడకు పెట్టిన పేరు అలమేలు. అయితే ఆవిడను ముద్దుగా పట్టా అని పిలిచేవారు. చివరికి ఆ పేరే స్థిరపడిపోయింది. ఆవిడ నాలుగో ఏట నుంచే పాడటం మొదలుపెట్టారు.
భగవాన్ రమణ మహర్షి వద్దకు తండ్రి మూడు నెలల బిడ్డగా ఉన్నప్ఫుడే ఆవిడను తీసుకువెళ్ళారు. రమణ మహర్షి ఆవిడ నాలుకపై తేనె పూసి ఆశీర్వదించారు. సంగీత జ్ఞానం, మధురస్వరంతో నువ్వు పాటలు పాడటానికి రమణ మహర్షి దీవెనలే కారణమని తండ్రి తరచూ చెప్తుండేవారు.
ఓ పద్ధతి ప్రకారం కర్నాటక సంగీతం నేర్చుకునే అవకాశం దొరకలేదు. తెలుగు మాష్టారు దగ్గర కొంత కాలం నేర్చుకున్నారు. అయినా తమ కూతురిని వేదిక ఎక్కించి పాడటానికి తండ్రి ఒకింత ఆలోచనలో పడ్డారు.
పట్టమ్మాళ్ చదువుకున్న స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అమ్ముక్కుట్టి అమ్మాళ్ ఆవిడ శక్తిసామర్థ్యాలను గుర్తించి తండ్రితో పట్టుబట్టి వేదికపై పాడించడానికి అనుమతి పొందారు.
కచ్చేరీలలో ప్రముఖ సంగీత విద్వాంసులు పాడటాన్ని వోని ఆవిడ తమ ప్రతిభను మెరుగులుదిద్దారు.
ప్రత్యేకించి నాయనా పిళ్ళై గారి కచ్చేరీలు ఆవిడను ఆకట్టుకున్నాయి. తానెలాగైనా వేదికలెక్కి పాడాలనే ఆరాటం కలిగింది. తెల్లవారుజామున నాలుగున్నరకల్లా లేచి పట్టుదలతో సాధన చేస్తూ వచ్చారు.ఆవిడ సోదరులూ బాగా పాడేవారే.గాంధీజీ కాంచీపురం వచ్చినప్పుడు, భారతియార్ పాట పాడి ఆయన ప్రశంసలు పొందిన ఆవిడ 1929లో మొదటిసారిగా ఆకాశవాణిలో పాడారు. అప్పుడు ఆవిడ వయస్సు పదేళ్ళు.
1932లో ఎగ్మూరులోని మహిళా మండ్రంలో ఆవిడ మొదటిసారిగా ప్రేక్షకుల ముందు కచ్చేరీ చేశారు.
ఆ తర్వాత కాంగ్రెస్ సమావేశాలలో తరచూ పాడుతూ వచ్చిన ఆవిడ తమిళ కీర్తనలను పాడి జనం మధ్య ఆదరణ పొందారు.
ఆవిడ పాడిన గ్రామ్ ఫోన్ రికార్డులు తెగ అమ్ముడుపోయవి.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రాత్రంతా ఆవిడ “విడుదలై విడుదలై'”, ఆడువోం పల్లు పాడువోం” అనే దేశభక్తి గీతాలు పాడారు. ఈ పాటలను ఆకాశవాణి ప్రసారం చేసింది. అయితే వాటికి పారితోషికం వద్దన్నారావిడ.
గాంధీజీ తనువులు బాసిన రోజున కూడా ఆవిడ ఆకాశవాణిలో పాటలు పాడారు. వీటికీ ఆవిడ పారితోషికం తీసుకోలేదు.
ముత్తుస్వామి దీక్షితుల పాటలంటే ఆవిడకు ప్రాణం. పాపనాశం శివన్ ఆవిడను చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. త్యాగభూమి (1939) సినిమాలో ఆవిడ తొలిసారిగా దేశ సేవై సెయ్య…అనే పాట పాడారు. అనంతరం పలు సినిమాలలో ఆవిడ పాటలు పాడారు. అయితే ఆవిడ దేశభక్తి లేదా భక్తి పాటలు మాత్రమే పాడేందుకు మొగ్గుచూపేవారు.
దేశ విదేశాలలో ఆనేక కచ్చేరీలు ఇచ్చిన ఆవిడ దగ్గర సంగీతం నేర్చుకున్న వారెందరో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఆవిడ తమ శిష్యురాలైన జపాన్ కు చెందిన అకికోతో తిరువయ్యారులో పాడించారు.
పద్మవిభూషణ్, పద్మభూషణ్, కళైమామణి, సంగీత కళానిధి, సంగీత నాటక ఆకాడమీ, సంగీత కళాశిఖామణి, కాళిదాస్ సమ్మాన్ వంటి అనేక బిరుదులు పొందిన ఆవిడ 2009లో తన తొంభయ్యో ఏట కన్నుమూశారు.
– యామిజాల జగదీశ్
Also Read:
Also Read: