Kandikonda No More: సినీ గేయ రచయిత, కవి కందికొండ యాదగిరి మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ హైదరాబాద్ మోతీనగర్ లోని సాయి శ్రీనివాస్ టవర్స్ లో మరణించారు. అయన స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం.

కందికొండ తాను చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం మొదలుపెట్టారు. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సినీ సంగీత దర్శకుడైన చక్రితో పరిచయం ఏర్పడింది.  మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపాడు.  తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో ‘మళ్లి కూయవే గువ్వా’ పాట రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ వరుస అవకాశాలతో పాటలు రాసి గేయరచయితగా నిలదొక్కుకున్నాడు.

కందికొండ సినీరంగంలో అడుగుపెట్టిన నాటి నుండి పన్నెండేళ్ళ సినీ ప్రస్థానంలో వేయికి పైగా పాటలు వ్రాశారు.  తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. బతుకమ్మ నేపథ్యంలో ఆయన రాసిన పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా, జనాల నోటన మార్మోగాయి.  తెలంగాణా యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టిమనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి ఆయన కథకుడిగా కూడా విశేష ఆదరణ పొందారు.

సిఎం సంతాపం:
ప్రముఖ కవి, గేయ రచయిత  కందికొండ’ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న  కందికొండ (యాదగిరి) మృతి కి సీఎం కేసిఆర్ సంతాపం తెలిపారు.

తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్లు బిడ్డ కందికొండ మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటని సీఎం అన్నారు.  పాటల రచయితగా  తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించిన  తెలంగాణ బిడ్డ కందికొండ’ అని సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు.

కందికొండ ను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా ఫలించక పోవడం దురదృష్టమని సీఎం అవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *