Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

రాజ్యంగాన్ని, న్యాయ స్థానాలను, జాతీయ పతాకాన్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ దేశంలో ఉండే అర్హతే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం కోర్టు ఆదేశాలిచ్చినా పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించకపోవడమంటే ముమ్మాటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమేనని మండిపడ్డారు. మహిళా గవర్నర్ ను అడుగడుగునా అవమానిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.

గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మువ్వెన్నెల పతకాన్ని ఎగరేసి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, చింతల రామచంద్రావరెడ్డి, వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన జరుగుతోంది. ముఖ్యమంత్రికి కోర్టులంటే, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. అంబేద్కర్ అంటే గౌరవం లేదు. గవర్నర్, మహిళలంటే అసలే గౌరవం లేదు. గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడానికి కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవాలి. గతంలో గవర్నర్లకు సాష్టాంగ నమస్కారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్… ఉన్నత చదువు చదివిన మహిళా గవర్నర్ ను మాత్రం అవమానిస్తున్నారు. చివరకు కోర్టు తీర్పులను, కేంద్ర గైడ్ లైన్స్ ను కూడా పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా పరేడ్ గ్రౌండ్ రిపబ్లిక్ వేడుకలు నిర్వహించడం లేదు. ఇది ముమ్మాటికీ అంబేద్కర్ ను అవమానించడమే. ఆయనకు రాజ్యాంగమంటే చికాకు. అందుకే అవమానిస్తున్నడు.

బీఆర్ఎస్ పార్టీ మహిళలను గౌరవించడమంటే ఇదేనా? అనేక రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించినవ్. నీతో కలిసొచ్చే ముఖ్యమంత్రులను అడుగు… గవర్నర్లను రిపబ్లిక్ వేడుకలకు ఆహ్వానించవద్దని, గవర్నర్లను నాలుగు గోడలకే పరిమితం చేయాలని చెప్పే దమ్ముందా? తెలంగాణలో ఆయన నిజాం అనుకుంటున్నడు. కల్వకుంట్ల రాజ్యంగాన్ని అమలు చేయాలనుకుంటున్నడు. తనకు తానే నియంత అనుకుంటున్నడు. హిట్లర్ లాంటి వ్యక్తినే కాలగర్భంలో కలిసిన చరిత్రను గుర్తుంచుకోవాలి.

అంబేద్కర్ జయంతి, వర్ధంతికి రాడు. జరుపుకోనీయడు. రాజ్యాంగాన్ని అవమానిస్తాడు. జాతీయ పతాకాన్ని, రాజ్యంగాన్ని అవమానించే మీకు ఈ దేశంలోనే ఉండే అర్హత లేదు. పక్క దేశంలో వంతపాడే, ఈ దేశాన్ని అసహ్యించే సీఎంకు ఇక్కడ ఉంటే అర్హత లేదు. గణతంత్ర దినోత్సవం రోజున కూడా సీఎంకు ఫక్తు రాజకీయాలే కావాలి. పూర్తి డిప్రెషన్ లో ఉన్నడు. బాబా సాహెబ్ అందించిన రాజ్యాంగంతో తలెత్తుకుని సగర్వంగా బతుకుదామా? కల్వకుంట్ల రాజ్యాంగంలో తలదించుకుని బానిసలాగా బతుకుదామా? తెలంగాణ సమాజం ఆలోచించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com