ద్వాపర యుగం. కృష్ణుడిని తన ఆస్తిగా అనుకుంటూ ఉంటుంది సత్యభామ. అలా ఎవరనుకుంటే వారికి గుణపాఠం చెబుతూ ఉంటాడు కృష్ణుడు. ఆయనకదో లీల. మధ్యలో నారదుడు ఊరికే ఉండడు కదా? రుక్మిణి- సత్యభామ మధ్య పోటీ పెట్టదలుచుకుంటాడు. తులాభారం వేసి టోకుగా కృష్ణుడిని కొనేస్తాను అంటుంది సత్యభామ. సరే అంటాడు నారదుడు. ఏడు వారాల నగలు, అంతః పురంలో దాచి ఉంచిన వజ్ర వైఢూర్య మరకత మాణిక్య గోమేదిక పుష్యరాగ కెంపులన్నీ వేసింది. త్రాసులో ముల్లు ఇసుమంత కదల్లేదు. కృష్ణుడు పైకి లేవలేదు.
అమ్మా! నువ్వు కొనలేక పోయావు. నేను బయట మార్కెట్లో నా ఇష్టమొచ్చిన రేటుకు కృష్ణుడిని వేలం వేసుకుంటాను. వెళ్లొస్తాం. లే కృష్ణా! అని భుజం పట్టుకుని లేపబోతాడు. అప్పుడు సత్యభామకు సత్యం బోధపడుతుంది. రుక్మిణి దగ్గరికి పరుగెత్తుతుంది. రుక్మిణి భక్తితో ఒక తులసీ దళం తీసుకుని తులాభారం దగ్గరికి వస్తుంది. కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అటువైపు త్రాసులో తులసీదళం పెట్టి నమస్కరించి నిలుచుంటుంది. ఒక్కసారిగా కృష్ణుడు కూర్చున్న తక్కెడ పైకి లేస్తుంది. హమ్మయ్య! లేక పొతే ద్వారక నడిబజారు వేలంలో కృష్ణుడిని ఎవరు కొనుక్కునేవారో అని సత్యభామ ఊపిరి పీల్చుకుంటుంది.
పల్లవి:-
తులసీ దళములచే సంతోషముగా పూజింతు
అనుపల్లవి:-
పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను
చరణం:-
సరసీరుహ పున్నాగ చంపక పాటల కొలువగ
కరవీర మల్లికా సుగంధ రాజసుమముల్
ధరనివి యొక పర్యాయము ధర్మాత్ముని
సాకేత పురవాసుని శ్రీరాముని వరత్యాగరాజసుతుని
-త్యాగయ్య కీర్తన
“కొలువైతివా దేవి నాకోసము…తులసీ దయాపూర్ణకలశీ!” -దేవులపల్లి కృష్ణశాస్త్రి
“తులదూచ లేము విలువను
తులదూచగ గలిగె హరిని తులసీ దళమే
ఇల తులసియున్న యిల్లే
నిలయము సిరి, హరికి నరుడ నిజమే కాదా!” -గోలి హనుమచ్చాస్త్రి
“తులసి లేని యింట జలమైన ముట్ట రా
దండ్రు పెద్ద లవని తరుల లోన
నతి పవిత్ర మిద్ది యాహరి కొలువౌను
తులసి కోట లోన లలన గూడి” -మిస్సన్న
హిందూ ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో తులతూగే తులసి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన ఆచారాల్లో శాస్త్రీయతను పాశ్చాత్యులు నిరూపిస్తే తప్ప మనం ఒప్పుకోము. అలా తులసి మొక్క ఉన్నా, తులసి ఆకులు తిన్నా, తులసి తీర్థం తీసుకున్నా…కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని అని తాజాగా రుజువయ్యింది.
ఆధ్యాత్మికంగా తులసిలో లక్ష్మీదేవితోపాటు సకల దేవతలు ఎలా కొలువై ఉంటారు? తులసికి పూజ చేస్తే అందరికీ పూజ చేసినట్లు ఎలా అవుతుంది? తులసీ దళాలతో పూజ చేస్తే పరమాత్ముడు ఎందుకు పరమానందంతో మనకు వరాలిస్తాడన్న చర్చను కాసేపు పక్కనపెట్టి…కేవలం ఆధునిక భౌతిక ప్రపంచ శాస్త్రీయ దృక్పథంతోనే తులసిని చూద్దాం.
శాస్త్రీయమైన అధ్యయనాల తరువాత అమెరికా నేషనల్ మెడిసిన్ లైబ్రరీ అధికారికంగా ప్రకటించిన ప్రకారం తులసి వల్ల ఉపయోగాలు:-
- జీవన క్రియల పెంపు
- రోగ నిరోధకశక్తి పెంపు
- గుండెపోటు నియంత్రణ
- ఒత్తిడి నియంత్రణ
- కొలెస్ట్రాల్ నియంత్రణ
- లిపిడ్ ప్రొఫైల్ కు మంచిది
- యాంటీ బ్యాక్టీరియాగా జలుబును తగ్గిస్తుంది
- మెదడులో డొపమైన్- సెరోటోనిన్ ను బ్యాలెన్స్ చేస్తుంది. తద్వారా ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి.
- యాంటీ ఇన్ఫ్లమేటరి, యాంటీ యాక్సిడెంట్ గా గాయాలను మాన్పుతుంది.
తులసి ఉన్న ఇంట్లోకి దయ్యాలు, దుష్టశక్తులు అడుగు పెట్టలేవని ఇదివరకు విఠలాచార్య సినిమాల్లో, క్షుద్రశక్తుల నవలల్లో చూశాము, చదివాము. అందులో దాగిన రహస్యమేమిటో ఇలాంటి పరిశోధన ఫలితాలతో సమన్వయం చేసుకోవచ్చు.
ఈసారి ఆలయాలకు వెళ్ళినప్పుడు అడిగి మరీ తులసి తీర్థం భక్తితో, బాధ్యతతో, ఆరోగ్య స్పృహతో, శాస్త్రీయ దృక్పథంతో తీసుకోండి. ఒక్క తులసీ దళానికి అవతారపురుషుడే తక్కెడలో తేలిపోయాడు. అలాంటి తులసి చేసే అద్భుతాలను తెలుసుకుని ఆరోగ్యాలను కాపాడుకోండి. త్యాగయ్యతో గొంతు కలిపి తులసీ దళములతో సంతోషముగా పూజ చెయ్యండి.
-పమిడికాల్వ మధుసూదన్
998990018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు