వీసా అవ‌క‌త‌వ‌క‌లు వెలుగుచూడ‌టంతో భార‌త్‌లోని ఐదు రాష్ట్రాల నుంచి విద్యార్ధుల‌ను ఆస్ట్రేలియా యూనివ‌ర్సిటీలు ఇప్ప‌టికే నిషేధించ‌గా తాజాగా మ‌రో రెండు యూనివ‌ర్సిటీలు ఈ జాబితాలో చేరాయి. విక్టోరియాకు చెందిన‌ ఫెడ‌రేష‌న్ యూనివ‌ర్సిటీ, న్యూ సౌత్‌వేల్స్‌లోని వెస్ట్ర‌న్ సిడ్నీ యూనివ‌ర్సిటీ భార‌త విద్యార్ధుల‌ను బ్యాన్ చేశాయి. వీసా అక్ర‌మాల నేప‌ధ్యంలో పంజాబ్‌, హ‌ర్యానా, ఉత్త‌రాఖండ్‌, యూపీతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం జ‌మ్ము క‌శ్మీర్ నుంచి విద్యార్ధుల‌కు ప్ర‌వేశాలు క‌ల్పించ‌రాద‌ని ఆస్ట్రేలియా యూనివ‌ర్సిటీలు నిర్ణ‌యించాయి.

ఈ ఐదు రాష్ట్ర‌ల నుంచి పెద్ద‌సంఖ్య‌లో త‌ప్పుడు వీసా ద‌ర‌ఖాస్తులు పెరుగుతుండ‌టంతో ఆయా వ‌ర్సిటీలు ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నాయి. పంజాబ్‌, హ‌ర్యానా, ఉత్త‌రాఖండ్‌, యూపీ, జ‌మ్ము క‌శ్మీర్‌ల నుంచి విద్యార్ధుల‌ను రిక్రూట్ చేసుకోరాద‌ని ఈ యూనివ‌ర్సిటీలు ఎడ్యుకేష‌న్ ఏజెంట్ల‌కు సూచించింద‌ని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. భార‌త్‌లోని నిర్ధిష్ట ప్రాంతాల నుంచి హోం వ్య‌వ‌హారాల శాఖ‌చే తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతున్న వీసా ద‌ర‌ఖాస్తుల సంఖ్య పెరుగుతున్న‌ట్టు వ‌ర్సిటీ దృష్టికి వ‌చ్చింద‌ని ఏజెంట్ల‌కు రాసిన లేఖ‌లో ఫెడ‌రేష‌న్ యూనివ‌ర్సిటీ తెలిపింది.

ఇది తాత్కాలికంగా త‌లెత్తిన అంశంగా తొలుత తాము భావించినా ఈ ట్రెండ్ కొన‌సాగుతున్న‌ద‌ని వెల్ల‌డైంద‌ని ఆ లేఖ‌లో వ‌ర్సిటీ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. గ‌త నెల‌లో విక్టోరియా యూనివ‌ర్సిటీ, ఎడిత్ కొవ‌న్ యూనివ‌ర్సిటీ, టొరెన్స్ యూనివ‌ర్సిటీ, స‌ద‌ర‌న్ క్రాస్ యూనివ‌ర్సిటీ వంటి ప‌లు ఆస్ట్రేలియ‌న్ యూనివ‌ర్సిటీలు వీసా అక్ర‌మాలు వెలుగుచూడ‌టంతో ఆయా రాష్ట్రాల విద్యార్ధుల‌ను బ్యాన్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *