Revanth In A Doubt That Both Telugu Cms Trying To Unite Both The States :
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కెసియార్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నేటి గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో స్పష్టంగా బైట పడిందని పిసిసి అధ్యక్షుడు, ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించలేక పోయిందని, ప్రాజెక్టులన్నీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి వెళుతున్నాయని అయన అందోళన వ్యక్తం చేశారు. సమర్ధవంతంగా వాదించే లాయర్ ను పెట్టకపోవడంవల్లే రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టుపై కేసిఆర్ మరణ శాసనం రాస్తున్నారని, రాజకీయ స్వార్ధం కోసం రెండు తెలుగు రాష్ట్రాల సిఎంలు కృష్ణా జలాల వివాదాన్ని కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు.
కాగా నిన్న ఏపీ మంత్రి పేర్ని నాని ‘మల్లీ కలిసిపోదాం’ అంటూ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. జగన్, కేసిఆర్ మొదటి నుంచీ కవల పిల్లల్లా కలిసే వెళుతున్నారని, ఉమ్మడిరాష్ట్రంకోసం ఇద్దరూ ఆలోచన ఇద్దరూ కలిసి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేయడం, ఇప్పుడు పేర్ని నాని ఇలా మాట్లాడడం అనుకోకుండా జరిగినవి కావని అయన అనుమానం వ్యక్తం చేశారు. జల వివాదాలు రేపి మళ్ళీ రెండు రాష్ట్రాలూ కలిపే కుట్ర జరుగుతోందని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవినీతి కేసుల్లో జగన్ జైలుకు వెళతాడు కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి కెసియార్ సిఎం కావాలనుకుంటున్నారని, లేకపోతే నాని వ్యాఖ్యలను టిఆర్ఎస్ ఎందుకు ఖండించలేదని రేవంత్ ప్రశ్నించారు.
“కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోంది. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం…మంత్రి పేర్ని నానీ “సమైక్య రాష్ట్ర” ప్రతిపాదన తేవడం… కేసీఆర్, జగన్ ల “ఉమ్మడి” కుట్ర. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్…!” అంటూ ట్వీట్ చేశారు.
Must Read : మా వల్లే కెసిఆర్ ప్రజల్లోకి వచ్చాడు – షర్మిల