గాంధీ భవన్ లోని  తమ వార్ రూమ్ లో పోలీసులు దాడి చేసి 50 కంప్యూటర్లు, విలువైన డాటా దొంగిలించారని పిసిసి అధ్యక్షుడు, ఎంపి ఏ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీసుపై దాడి చేశారని,  అదుపులోకి తీసుకున్న తమ పార్టీ కార్యకర్తలను ఎక్కడకు తీసుకు వెళ్ళారో కూడా సమాచారం ఇవ్వలేదని, దీనితో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. ఢిల్లీ తెలంగాణా భవన్ లో రేవంత్, పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

అధికారం కాపాడుకోవడం కోసమే సిఎం కెసిఆర్ ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తమ ఆఫీసుపై ఇలా దాడికి పాల్పడడం హేయమని, వారు పోలీసులా దొంగాలా  అంటూ ప్రశ్నించారు. కిరాయి గూండాల్లా పోలీసులు వ్యవహరించారని, తాము సేకరించిన విలువైన డేటాను చోరీ చేశారని ధ్వజమెత్తారు. ఆఫీసు మీద దాడి జరిగిన సందర్భంలో తమ నేతలు వెళ్లి ప్రశ్నిస్తే తాము హైదరాబాద్ కమీషనర్ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్ క్రైమ్ పోలీసులమని చెప్పారని వివరించారు. ఎలాంటి వారెంట్, నోటీసు లేకుండా దాడి చేయడం, దౌర్జ్యన్యంగా వ్యవహరించడం తగదన్నారు.  పెద్దలు జానారెడ్డి ఈ విషయమై డిజిపికి ఫోన్ చేస్తే తనకు సమాచారంలేదని చెప్పారన్నారు.  తాను రాత్రి చాలాసేపు డిజిపి, నగర పోలిస్ కమిషనర్, సైబర్ క్రైమ్ డిజి, డిసిపిలకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వారు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.

ఓడిపోతున్నాననే భయంతోనే కెసిఆర్ ఈ రకంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం, ప్రజల హక్కుల కోసం ఢిల్లీ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ఘాటుగా విమర్శిందారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంటే నోటీసులు ఇవ్వకుండా దాడులు చేయడం ఏమిటని నిలదీశారు. తెలంగాణా భవన్ నుంచి ర్యాలీగా బిఆర్ఎస్ ఆఫీసుకు వెళ్లి అక్కడ ముట్టడి కార్యక్రమం చేపడతామని రేవంత్ చెప్పారు.  ఈ అంశంపై  ఆందోళనలు నిర్వహిస్తామని, న్యాయ పరంగా, పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనిపై పోరాటం చేస్తామని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *