Friday, April 19, 2024
HomeTrending Newsరాష్ట్రంలో దండిగా వరి దిగుబడి - మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలో దండిగా వరి దిగుబడి – మంత్రి హరీష్ రావు

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందించడం వలన, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం వలన అధిక పంట ఉత్పత్తి సాధ్యమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో యాసంగి పంట అంటే వెనుక మడి ఎండకుండా పంట పండేది కాదన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఇవాళ గుంట కూడా ఎండకుండా బంగారం లాగా రెండు పంటలు పండుతున్నాయన్నారు.

గతంలో వానకాలం వచ్చిందంటే వర్షాల కోసం రైతులు ముఖాలను మొగులు వైపు పెట్టి వర్షాల కోసం ఎదురుచూసేవారని, నేడు ముఖాలు మొగులు వైపు చేసే పరిస్థితి లేదు..కాలంతో పని లేదు కాళేశ్వరం నీళ్లు పుష్కలంగా ఉన్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కొంతమంది హైదరాబాద్ లో కూర్చుని కాలేశ్వరం ఫలితం రాలేదని ఎద్దేవా చేస్తున్నారని, వారు హైదరాబాద్ ని వదిలి గ్రామాల్లో తిరిగితే పచ్చని పల్లెలలో ఉండే రైతులు సమాధానం చెప్తారన్నారు. భూగర్భ జలాల సమృద్ధిగా ఉండడంతో కొత్తగా బోర్లు వేయాల్సిన అవసరం లేక పల్లెల్లో బోరుబండ్లు, క్రేన్లు కనబడడం లేదన్నారు. వరిధాన్యానికి క్వింటాలకు 2060 రూపాయల మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, చివరి గింజల వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తాము. రైతులందరూ తప్పనిసరిగా ప్రభుత్వ వరి ధాన్య కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు.

ధాన్యం ఎండేలా… కోసిన వెంటనే రెండు రోజులు పొలంలో ఎండబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి హరీష్ రావు రైతులకు సూచించారు. వరి ధాన్యం కొన్న మూడు రోజుల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అయ్యేలా ప్రభుత్వం నిధులను సమకూర్చిందన్నారు. ఈ వానకాలం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒక కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందన్నారు. రాష్ట్రంలో 20వేల వరి కోత యంత్రాలు, మరియు కూలీలు ఎంతమంది ఉన్నా కూడా వరిధాన్యం కోయడానికి ఎదురు చూసేంత విపరీతమైన ధాన్యం రాష్ట్రంలో పండిందన్నారు. పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో సరిగ్గా వరిధాన్యం పండక మిల్లర్లు వరిధాన్యం కొనేందుకు రాష్ట్రానికి వస్తున్నారన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం రైతుల బావుల వద్ద మోటార్లకు మీటర్ పెట్టి రైతులకు బిల్లులు పంపియాలని అలా చేస్తేనే రాష్ట్రానికి ఇచ్చే 30 వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెబుతున్నారని మంత్రి వెల్లడించారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకొని వేల కోట్ల రూపాయల కేంద్రం వద్ద నుండి తీసుకున్నారన్నారు.  పెద్ద రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రండి. ఆయిల్ ఫామ్ తోటలు పెంచడానికి ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ పెంపకంతో మూడు సంవత్సరాల తర్వాత రెట్టింపుకు మించి ఆదాయం వస్తుంది. మరియు నెల నెల జీతం లాగా ఆదాయం ప్రతి నెల వస్తుందన్నారు. పామాయిల్ పంట అమ్ముకోవడానికి ఎక్కడికో వెళ్ళకుండా నరమెట్ట లోనే 300 కోట్ల రూపాయలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందన్నారు. ఆయిల్ ఫామ్ తో పాటు సెరికల్చర్ పంటలను పండించాలి. దానికి కూడా ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్