Monday, April 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంలేనివాడికి తిండి దొరకదు! ఉన్నవాడికి తిన్నదరగదు!!

లేనివాడికి తిండి దొరకదు! ఉన్నవాడికి తిన్నదరగదు!!

“ఇల్లు ఇల్లంటావు!
ఇల్లాలు అంటావు!
నీ ఇల్లు ఎక్కడే చిలుకా?

అల్లంత దూరాన…
వల్లకాటిలోన
నీ ఇల్లు ఉన్నదే చిలుకా!

అస్థిరమ్ములైన ఆస్తిపాస్తులకొరకు
గస్తీలు నీకేల చిలుకా?

వెళ్లిపోయెడి నాడు
వెంట ఏదీ రాదు…
కళ్లు తెరవవె
చిట్టి చిలుకా?

జబ్బ పుచ్చుక యముడు
దబ్బు దబ్బున లాగ…
తబ్బిబ్బు పడనేల చిలుకా?”
అని అనాదిగా తెలుగు తత్వం తత్వబోధ చేస్తూనే ఉంది.

“తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంట రాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెరుగు బంగారంబు మ్రింగ బోడు
విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని
కూడ బెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి
దాన ధర్మము లేక దాచి దాచి
తుదకు దొంగలకిత్తురో! దొరలకవునో!
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు?
భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర!”

వచ్చేప్పుడు ఎవరూ తల్లి గర్భంలో నుండి ధనం తీసుకురాలేదు. వెళ్లిపోయేప్పుడు వెంట తీసుకుపోలేదు. లక్షాధికారైనా అన్నం మెతుకులే తినాలి కానీ…బంగారపు మెతుకులు తినలేడు. తినకూడదు. నానా గడ్డి కరచి; వేళకు తినీ తినక…డబ్బు కూడబెట్టి విర్రవీగడమే తప్ప…ఆ ధనాన్ని తినలేడు. దాన ధర్మాలు చేయకుండా దాచి…దాచిన సొమ్ము చివరకు ఆదాయపుపన్ను వారికో, దొంగలకో చేరుతుంది- తేనె తుట్టెలో తేనెటీగలు పెట్టుకున్న తేనెను పొగబెట్టి తేనెటీగలను తరిమి…దారిన పోయేవారు అనుభవించినట్లు అని కవి శేషప్ప తేల్చి చెప్పాడు.

“పాంచభౌతికము దుర్భరమైన కాయం బిదెప్పడో విడుచుట యెఱుకలేదు,
శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని,
నమ్మరాదామాట నెమ్మనమున
బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక
ముదిమియందో, లేక ముసలియందొ,
యూరనో, యడవినో, యుదకమధ్యముననో,
యెప్పుడో యేవేళ నే క్షణంబొ?

మరణమే నిశ్చయము, బుద్ధిమంతుఁడైన
దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు,
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!”

భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం- పంచభూతాలతో నిర్మితమైన ఈ దేహంలో ప్రాణం ఏ క్షణాన పోతుందో ఎవరూ నమ్మకంగా చెప్పలేరు. వందేళ్ల ఆయుస్సు అని ప్రమాణం చెప్పారు కానీ…ఆ మాటను నమ్మడానికి వీల్లేదు. బాల్యంలోనో, ప్రాయంలోనో, వార్ధక్యంలోనో…ఊళ్లోనో, ఇంట్లోనో, అడవిలోనో, నీళ్లల్లోనో, ఎప్పుడో ఏ క్షణమో మరణమొక్కటే నిశ్చయం అని కూడా అదే నృసింహ శతకంలో కవి శేషప్పే తేల్చి చెప్పేశాడు.

ఇవన్నీ డబ్బులేనివారి, డబ్బు సంపాదించడం చేతకానివారి మాటలు;
జీవితం ఉన్నది అనుభవించడానికే;
ఇంద్రభవనంలాంటి ఇళ్ళు, విలాసవంతమైన కార్లు కొనడానికే- అన్నది ఆధునిక భౌతిక ప్రపంచపు వాదన.

సంపాదించింది దర్జాగా ఖర్చు పెట్టుకోవాలి;
సంపదను పదిమంది ముందు ప్రదర్శించాలి;
సంపదకు చిహ్నమైనవాటిని పోగుచేసుకుంటూ వెళ్ళాలి- అన్నది ఆధునిక సంపన్నుల ధోరణి.

145 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో ఎన్ని కోట్లమందికి తలదాచుకోవడానికి కనీసం ఒక పూరి గుడిసె, రేకుల షెడ్డయినా లేదన్నది ఇక్కడ అప్రస్తుతం. వికసిత భారత్ లో యాభై కోట్ల రూపాయలు, అంతకుమించి విలువ చేసే విల్లాలకు(ఇళ్ళకు) విపరీతమైన డిమాండ్ అట. అతి విలాసవంతమైన ఇళ్ళు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట.

Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv

సాధారణ, మధ్యతరగతి గృహాల అమ్మకం నత్తకు నడకలు నేర్పుతుంటే విలాసవంతమైన, అత్యధిక ధర ఉన్న గృహాల అమ్మకం దాదాపు 500 శాతం పెరిగిందట.

….యాభై కోట్ల ఇల్లు కొన్నవారు తరువాత కొనాల్సింది వందకోట్ల ఇల్లే!

…అంటే లేనివారు మరింత లేనివారయ్యారు. ఉన్నవారు మరింత ఉన్నవారయ్యారు. ఉన్నవారి యాభై కోట్ల గృహాల్లో పని చేయాల్సింది లేనివారే. తాము కలలో కూడా ఊహించని ఇంద్రభవనాల్లో పనులు చేస్తూ…పాడుకోవడానికి-
# ఇల్లు ఇల్లంటావు..
# తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు…
# పాంచభౌతికము దుర్భరమైన కాయంబిది…
లాంటి తత్వాలు, తాత్విక పద్యాలు పనికివస్తాయి!

లేనివాడికి తిండి దొరకదు!
ఉన్నవాడికి తిన్నదరగదు!!

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్