Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపెద్దవారికి జూదం వినోదం

పెద్దవారికి జూదం వినోదం

Black & White:
పేకాట /కాసినోల గురించి రోజూ సంచలన వార్తలు!
మీడియా ఫోకస్ చేయని కోణం ఒకటుంది.
ఒక రోజు కాసినో లో అయిదు కోట్లు / పది కోట్లు పోగొట్టుకొన్నారట!

ఎవరు వీరు? ఈ సొమ్ము ఎక్కడినుంచి వస్తోంది?

కష్టపడి సంపాదించిన సొమ్మును ఇలా ఒక్క రోజు జూదంలో ఎవడూ పందెం కాయడు. ఖచ్చితంగా ఇదంతా అవినీతి సొమ్మే. నల్ల ధనమే. ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు పడుంటే, దానితో ఏమి చెయ్యాలో తోచక పొతే, కష్టం విలువ తెలియక పొతే, బతుకు భయం లేకపోతే…. చేసే పనులే ఇవన్నీ.

జూదం పాతది. మహాభారత కాలం లోనే వుంది.
అవినీతి పాతది. చాణుక్యుడే సాక్ష్యం.

కానీ ఒకరో ఇద్దరో కాదు.
వేల మంది…. లక్షల మంది …

ఏదో కొంత మొత్తం కాదు ..
వేల కోట్లు.. లక్షల కోట్లు …. ఇదొక వ్యవస్థ .
సమాంతర వ్యవస్థ కాదు. ఇదే ఇప్పుడు అసలు వ్యవస్థ . .దీనికి ఆది- అంతు లేకుండా పోతుంది .

Casino

ఒక ఓటుకు అయిదు వేలో, పది వేలో ఇస్తే కానీ జనాలు వోటెయ్యరు. ఎమ్మెల్యే కావాలంటే కనీసం వంద కోట్లు పెట్టుబడి పెట్టాలి. వంద కోట్లు పెట్టుబడి పెట్టినోడు ప్రజా సేవ ఎందుకు చేస్తాడు? డబిచ్చి మరీ సేవ చేసే పిచ్చోళ్ళు వుంటారా? ఉండాలనుకోవడం వెర్రితనం కాదా?

వంద కోట్లు పెట్టినోడు వెయ్యి కోట్లు సంపాదించాలని చూస్తాడు. పోలీస్ స్టేషన్ లో ఎసై పోస్ట్ కావాలంటే పది లక్షలు. సీఐ పోస్ట్ కు యాభై. MRO పోస్ట్ కు యాభై. RTO పోస్ట్ కు కోటి . అంత డబ్బు పెట్టి పోస్ట్ సాదించుకున్నోడు ఏమి చేస్తాడు?

అవినీతిని సంస్థాగతం చేస్తాడు. తన పరిధిలో ఉన్న దుకాణానికి ఇంతని రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తాడు పోలీస్. పోలీస్ కు నెలకు ఇరవై వేలు ఇస్తున్నాడు ఒక చిన్న వస్త్ర దుకాణ దారుడు. అదే మాల్ అయితే ఇరవై లక్షలు. వాడికి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? తిరిగి వినియోగ దారుడి నెత్తిన వేస్తాడు.

అద్దె కింత , కరెంటు కింత , పోలీస్ దొర కింత … ఇలా ఇదొక ఖర్చు.
అమ్మకం ధరలో కలిసి పోతుంది . వినియోగదారుడి నెత్తిన పడుతుంది. ఇదొక పెద్ద రింగు వ్యవహారం.

డబ్బు ఎజెండా – పైవాడిది .. కిందివాడిదీనూ!

డబ్బున్నోడికి కులం ఉండదు. మతం ఉండదు. అధికారంలో ఉన్నోడి పంచన చేరుతాడు. డబిచ్చి పనులు చేయించుకొంటాడు . డబ్బు డబ్బును సంపాదిస్తుంది. అందుకే లాక్ డౌన్ వచ్చినా, ఆర్థిక మాంద్యం వచ్చినా వీడి సంపద పెరుగుతూనే ఉంటుంది.

పేదోడు – మహా తెలివైనోడు . ముందుగా లెక్క తేల్చేస్తాడు.
“ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్.. డబ్బు మూట ఇవ్వవొయ్  ప్రజా సేవ లేదు .. కాకర కాయ పులుసు లేదు. ఇంట్లో ఆరు ఓట్లు . లక్ష ఇస్తావా ? మినిమం అరవై! ఇస్తేనే ఓటు”.. అంటాడు. అడ్వాన్స్ గా వసూలు చేసేస్తాడు.

ఎర్రి బాగులోడు.
ఆర్థిక ఎజెండా లేక కార్డు కు పడిపోయేటోడు!
మొత్తం భారాన్ని మోసేటోడు..
ఎవడు? ఇంకెవ్వడు?
మధ్య తరగతోడు.

వీడికి  బతుకే భారం.  పైవాడిని… కిందివాడిని… మొత్తం వ్యవస్థను మోయాలంటే మాటలా?

జరిగింది తెలియదు. జరుగుతున్నది తెలియదు.
ఏమి చెయ్యాలో తెలియదు. ఏమి చేయకూడదో తెలియదు.
తాను మహా తెలివైనోడుఅనుకొంటాడు. తనకన్నీ తెలుసనుకొంటాడు.

పాపం .. ఎర్రి బాగులోడు
మటన్ షాప్ వాడిని నమ్మే గొర్రె !

ఉండాల్సింది ఆర్థిక ఎజెండా!
పన్నులు తగ్గిస్తావా? ధరలు తగ్గిస్తావా? అని అడగాలి.
అంత తెలివి లేదు. అంత సీన్ లేదు.

సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ లో రోజూ మునిగి స్నానం చేస్తాడు.

కుల సెంటిమెంట్
మత సెంటిమెంట్.
ప్రాంత సెంటిమెంట్.
సెంటిమెంటే ఒక సెంటిమెంట్.
అదే వాడి అయివు పట్టు. మెడలో ఉరితాడు.

అయిదు సంవత్సరాలు ఎంత దోచినా రక్తాన్ని ఎంత పీల్చి పిప్పి చేసినా వీడిని ఎలా బకరా చేయాలో రాజకీయుడికి తెలుసు. కుల కార్డు .. మత కార్డు .. సెంటిమెంట్ కార్డు .. ఏదో ఒకటి తీస్తే సరి .” మే… ” .. ” మే… ” అనుకొంటూ పొట్టితోక ఊపుకొంటూ వోటేసేస్తాడు.

అంతేనా?

ఈ మేధావికి ప్రతి రోజు .. ప్రతి గంట పాలిటిక్సే!

Casino

అవతలోడిని తిట్టి పోస్తాడు. తనోడిని దేవుడంటాడు. వార్త పత్రికలు అని ముద్దు పేరున్న పార్టీల కరపత్రాలు చదివి, టీవీ చానెల్స్ అనే ముద్దు పేరున్న పార్టీల అద్దె మైకులు విని, సోషల్ మీడియాలో పైడ్ ఆర్టిస్ట్ ల పోస్ట్ లు చదివి బిపి తెచ్చుకొంటాడు. రోజంతా జుట్టు పీక్కుంటాడు. ఏదో చేసేస్తాననుకుంటాడు.

పార్టీ లు మారుతాయి. జెండా లు మారుతాయి.

మద్యోడి జీవితం మాత్రం అడ్డ కత్తెరలో పోక చెక్క.  తరాలు మారినా బతుకు మారదు

ఆర్థిక ఎజెండా లేని మధ్యతరగతోడు ఉన్నత కాలం రాజకీయుడికి డోకా లేదు. భవిషత్తు పై బెంగ లేదు.

వీడు వాడి పల్లకి మోస్తుంటాడు. వాడు వీడి పాడె కడుతుంటాడు.

ఇదొక అంతులేని వింత కథ!

-వాసిరెడ్డి అమరనాథ్

Also Read : 

చికోటి జంతు ప్రదర్శనశాల

RELATED ARTICLES

Most Popular

న్యూస్