బంగ్లాదేశ్ తో జరిగిన వామప్ మ్యాచ్ లో ఇండియా 52 పరుగులతో విజయం సాధించింది. ఎల్లుండి నుంచి మొదలు కానున్న మహిళల టి20 వరల్డ్ కప్ టోర్నమెంట్ కోసం జరుగుతోన్న వామప్ మ్యాచ్ లు నేటితో ముగిశాయి. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
స్టెలెన్ బాష్క్ లో జరిగిన నేటి మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు యస్తికా భాటియా (10); షఫాలీ వర్మ (9) తో పాటు వన్ డౌన్ లో దిగిన హర్లీన్ డియోల్ (10) విఫలమయ్యారు. ఆ తర్వాత రిచాఘోష్ 56 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో మెరుపు దాడి చేసి 91 పరుగులతో నాటౌట్ గా నిలవగా, జెమీమా రోడ్రిగ్యూస్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 41; చివర్లో పూజా వస్త్రాకర్ నాలుగు బంతుల్లో రెండు భారీ సిక్సర్లతో 13 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ నైగర్ సుల్తానా(40); ఓపెనర్ ముర్షీదా ఖాతున్ (32) లు ఇద్దరే రాణించారు.
ఇండియా బౌలర్లలో దేవికా వైద్య రెండు, రాజేశ్వరి గైక్వాడ్, అంజలి శర్వాణి, దీప్తి శర్మ, రాధా యాదవ్, షఫాలీ వర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.