Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి బలం

ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి బలం

మహారాజరాజశ్రీ గౌరవనీయులయిన పార్టీ అధ్యక్షులవారి పాద పద్మములకు నమస్కరించి ఫలానా నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్రాయునది…

మీరు అనేక సర్వేల తరువాత గెలుపు గుర్రం అని తేల్చి గత ఎన్నికల్లో నిలబెట్టిన అభ్యర్థిని మేము అంతే పట్టుదలతో కష్టపడి గెలిపించాము. గెలవగానే ఆయన/ఆమె ఏకు మేకు కావడంతో మాకు కష్టాలు చెప్పి వస్తున్నాయి. అంతకు ముందు అయన దారిన పోయే దానయ్య. ఇప్పుడు ఆయన/ఆమె ఏ దారినీ వదలకుండా కబ్జాలు చేస్తుండడంతో మాకు ఏదారీ లేక కుక్కతోక పట్టుకుని గోదారి ఈదుతున్నాము.

మా నియోజకవర్గ కేంద్రంలో పేరు మోసిన ఇంజనీరింగ్ కాలేజీ మా ఎమ్మెల్యే భార్య చూసుకుంటున్నారు. మెడికల్ కాలేజీని ఎమ్మెల్యే కొడుకు- కోడలు చూసుకుంటున్నారు. మిగతా వ్యాపారాలన్నీ ఎమ్మెల్యే కూతురు- అల్లుడు చూసుకుంటున్నారు. ఇసుక, లిక్కర్, కాంట్రాక్టులు, రియలెస్టేట్ లాంటి చిన్నా చితక వ్యాపారాలను ఎమ్మెల్యే డ్రైవర్ ద్వారా ఎమ్మెల్యేనే చక్కబెట్టుకుంటున్నారు.

ఖద్దరు వైట్ అండ్ వైట్ గంజి బట్టలు వేసుకుని, ఫార్చ్యూనర్లు కొని…మేము ఎందుకూ కొరగాకుండా పోయాము. ఎమ్మెల్యే కోసం బ్యానర్లు కట్టి కట్టీ…ఫ్లెక్సీలు పెట్టి పెట్టీ…శారీరకంగా అలసిపోయాము. ఆర్థికంగా కుంగిపోయాము. ఒకప్పుడు ఊరవతల పొలంలో గుడిసెలో ఉండిన మా ఎమ్మెల్యేకు ఇప్పుడు దక్షిణ భారత దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇబ్బడి ముబ్బడిగా గుడిసెలతో పాటు పక్కనే ఆకాశహర్మ్యాలు కూడా ఉన్నాయి. ఆయన సొంత తెలివి తేటలతో రాత్రీ పగలు రిక్షాలు తొక్కి, మూటలు మోసి…సంపాదించిన సొమ్ము కాబట్టి అందులో వాటాలు ఇవ్వాలని మేము అడగడం లేదు. అది ఆయన/ఆమె కష్టార్జితం.

మాకు కూడా అలా ప్రజా ప్రతినిధిగా రాత్రీ పగలు రిక్షాలు తొక్కుతూ…ప్రజాసేవ చేసే అవకాశం రావాలంటే…ఈసారి మా ఎమ్మెల్యేకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వద్దని సవినయంగా విన్నవించుకుంటున్నాం. మొన్న మీరు పంపిన మూడు సర్వే బృందాలకు మా ఎమ్మెల్యే మందు- విందు- పొందు ఏర్పాటు చేశారు. ఆ ఫోటోలు, వీడియోలు ఈ అభ్యర్థన వెంట జత చేశాము. కాబట్టి ఆ సర్వేలో ఆయన/ఆమె పేరే మొదటి వరుసలో ఉంటుందని విజ్ఞులయిన మీకు మేము చెప్పాల్సిన పని లేదు.

పై విషయములన్నిటినీ పరిగణనలోకి తీసుకుని...వచ్చే ఎన్నికల్లో ఆరు నూరయినా…అగ్రహారం బీడయినా…మా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకూడదని కోరుచున్నాము. మీరు మా మాట వినని యెడల…ఆయన/ఆమెకే టికెట్ ఇచ్చిన యెడల చిత్తు చిత్తుగా ఓడించి…పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా ఎక్కించి పంపగలవారము అని సవినయముగా హెచ్చరించుచుంటిమి అని తెలియజేసుకుంటున్నాము.

ఇట్లు
ఫలానా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సంతకములు

Enclosed documents:-
1. M L A’s educational institutions in our constituency
2. MLA’s properties in south India and abroad
3. MLA arranging parties to survey teams- photos and videos pen drives
4. MLA daughter’s complaint on his father
5. MLA driver’s second wife’s third property
6. Cases pending on our honourable MLA
7. MLA’s new real estate ventures in 2 metro cities
8. MLA threatening our party leaders- audio and Video files
——————————-

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్