Queen of Kilasa: పాలస్తీనా గాజా హమాస్- ఇజ్రాయిల్ యుద్ధం; పరస్పర రాకెట్ బాంబుల దాడులు; కూలిన భవనాలు; పోయిన ప్రాణాలు; అంతర్జాతీయంగా ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారు? అగ్రరాజ్యాలు ఎందుకు రెండుగా చీలి అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి? ఇన్ని దశాబ్దాలయినా రావణకాష్ఠంలా రగులుతూనే ఎందుకుంది? యుద్ధం ఎక్కడయినా ప్రాణాలను తీస్తుంది. గాయాలను మిగులుస్తుంది. శ్మశానపు బూడిదను పంచుతుంది…ఇంతటి పరమ సీరియస్, హృదయవిదారక వార్తల మధ్య ఒక ఆటవిడుపు వార్తకు రావాల్సినంత ప్రాధాన్యం రాలేదు. ఇంతటి విధ్వంసానికి, విషాదానికి విరుగుడుగా పడి పడి కడుపుబ్బా నవ్వుకోవడానికి పనికొచ్చే వార్త ఇది.
నిత్యానందను మనమిప్పుడు కమెడియన్ గా చూస్తున్నాం కానీ…కొన్ని దశాబ్దాలపాటు ఆయన కామెడీని సీరియస్ భక్తిగా చూసింది మనమే కదా? జంతువులచేత స్పష్టమయిన సంస్కృతంలో మాట్లాడింపజేసే బ్రెయిన్ మ్యాపింగ్ విద్య కనుక్కున్నాను అని ఆయనన్నప్పుడు గంగిరెద్దుల్లా బుర్రలు ఊపి…చప్పట్లు చరిచింది మనమే కదా? నిజానికి నాడు-నేడు నిత్యానంద ఒక స్టాండ్ మీదే ఉన్నాడు. మన స్టాండే మారింది.
ఆశ్రమంలో నిత్యానంద ఒక సినీనటితో పడకమీద సన్నిహితంగా ఉన్న వీడియోను ఆ ఆశ్రమంలోనే చాలా కాలం పనిచేసిన వ్యక్తి లోకానికి చూపినప్పటినుండి ఆయనకు కష్టాలు చెప్పి రావడం మొదలయ్యింది. కేసు, పోలీసులు, మీడియా విచారణతో స్వామివారి తపస్సుకు కించిత్ భంగమయ్యింది. దాంతో ఈ పలుగాకుల పాడులోకాన్ని గాలికి వదిలి…మారువేషంలో దేశం విడిచి(సాధారణ భాషలో దీన్ని పోలీసులకు చిక్కకుండా పరార్ అంటారు) ఎక్కడో ఈక్విడార్ వెళ్లాడు. పుట్టుకతో వచ్చిన విద్య పుడకలతోగానీ పోదు.
అహం బ్రహ్మాస్మి- నేనే బ్రహ్మను అన్నది తప్ప నిత్యానందకు మరో విద్య తెలియదు. బ్రహ్మ ప్రాథమికమయిన డ్యూటీ సృష్టి చేయడం. వెంటనే తను పరారై వచ్చి నిలుచున్న ద్వీపాన్ని ఒక దేశంగా సృష్టించాడు. దానికి “కైలాసం” అని నామకరణం చేశాడు. దేశం అన్న మాటకు వ్యుత్పత్తి ప్రకారం- దిశ ఉన్నది అని తప్ప ఇంకేరకమయిన అర్థాలూ ఉండవు. ఆ కోణంలో కైలాసానికి దిశలున్నాయి. ఐక్యరాజ్యసమితికి ప్రతినిధులనే పంపే స్థాయి దశలూ ఉన్నాయి. అన్నిటికీ మించి నిత్యబ్రహ్మ ద్వీపం నడిమధ్యలో చెదరని చిరునవ్వుతో,చిన్ముద్రతో, బ్రహ్మ వర్ఛస్సుతో ఉండనే ఉన్నాడు. అంతకంటే ఇంకేమి కావాలి?
మనం సంసారులుగా అష్టకష్టాలు పడుతూ…వాటినుండి విముక్తికి బాబాలు, స్వాములు, పీఠాలు, ఆశ్రమాలు అనుకుంటూ వెళతాము కానీ…సన్యాసి స్వాముల కష్టాలు పగవారికి కూడా వద్దు. ఆశ్రమాల్లో జరిగే రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, పై ఎత్తుల ముందు బయట జరిగేవి సముద్రంలో కాకి రెట్టంత కూడా ఉండవు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వార్గాలను(ఆరుగురు శత్రువులను) జయించడమెలాగో ప్రవచనాలు చెబుతూ…స్వాములు వాటితోనే యుద్ధం చేస్తూ ఉంటారు. కోటికొక్కరిని తప్ప మిగతా స్వాములందరినీ ఆ అరిషడ్వార్గాలు ఎప్పుడూ జయిస్తూనే ఉంటాయి. ఓహో! ఇలా అరిషడ్వార్గాల మాయలో చిక్కుకోకూడదన్న మాట అని ఎందరో స్వాములు మనకు నడిచే ఉదాహరణలుగా మిగులుతూ ఉంటారు.
ప్రవచనంలో పిట్టకథలతో దారి తప్పకుండా మళ్లీ నిత్యానంద కైలాసం దగ్గరికే వెళితే- ఎవరి సాన్నిహిత్యం వల్ల పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి అయిన భారత దేశాన్ని వదిలి నిత్యానంద ఎవరికీ తెలియని, నరమానవుడు సులభంగా చేరుకోలేని కైలాసం సృష్టించుకున్నాడో ఆ సినీనటి అయిన తన ప్రియాతిప్రియ శిష్యురాలినే కైలాసానికి ప్రధానిగా చేశాడు. పూర్వ వాసనలు వదలవు కదా?
సాధారణంగా బయట ఎన్నికయిన అధికార పార్టీ గవర్నర్ ప్రమాణస్వీకారానికి పిలిచేవరకు నిరీక్షిస్తుంది. ఇక్కడ స్వాములవారు ప్రధానిగా ప్రకటించడం ఆలస్యం “రంజితమే రంజితమే మనసు కాస్త రంజితమే…” అన్న డబ్బింగ్ పాట పాడుకుంటూ నటిగారు ప్రధానిగా జీవించడం మొదలుపెట్టారు. మొత్తం కైలాసం ఆర్థిక, సాంఘిక, రాజకీయ, అంతర్జాతీయ వ్యవహారాలన్నీ తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. రెండు మూడేళ్ళుగా ఈ పనులు చేస్తున్న శిష్యగణం మనోభావాలు దెబ్బతిన్నాయి. కైలాసం పెత్తనం మీద కొత్త ప్రధానికి- పాత శిష్యులకు అంతర్గత ఆధిపత్య పోరు మొదలయింది. దేశం పెరిగి వ్యవహారాలు ఇతరుల చేతుల్లోకి వెళుతున్నట్లు లోలోపల దిగులుపడి నిత్యానందే తన ప్రియశిష్యురాలిని ప్రధానిని చేశాడని పిచ్చి శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు- పాపం!
ఇది కదా భూగోళం ఉత్కంఠతో చదవాల్సిన వార్త! ఇది కదా ఇజ్రాయిల్- గాజా గొడవకంటే అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలు ప్రాధాన్యం ఇవ్వాల్సిన వార్త!
మరింత సీరియస్ హాస్యం కోసం వెనకటికి “కౌపీన సంరక్షణార్థం” అన్న సామెత ఏర్పడిన కారణం కూడా గుర్తుచేసుకోవాలి. లేకపోతే ఫలశ్రుతి దక్కదు! చిరిగిపోయిన గోచిగుడ్డ నుండి మొదలయి…అంతులేని మహా సంసార ప్రయాణం దాకా నిరాఘాటంగా సాగిన కథ మళ్లీ మళ్లీ తెలుసుకోదగ్గదే.
ఒకానొక ఊరు. పంటపొలాలతో, ధన ధాన్యాలతో పచ్చగా, హాయిగా ఉంది. ఊరిని ఆనుకుని ఊరికి కొండగుర్తుగా ఒక కొండ. ఆ కొండ మీద ఒక శిథిలాలయ మంటపం. ఎక్కడ నుండి, ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ…ఒక సన్యాసి వచ్చి ఆ మంటపం కింద గూడు కట్టుకున్నాడు. పశువుల కాపర్లు ఎవరయినా కొండమీదికి వెళ్లినప్పుడు తాము తెచ్చుకున్న సద్ది మూట విప్పి ఓ ముద్ద పెడితే తింటాడు. పెట్టకపోతే పెట్టాలని చేయి చాచి అడగడు. వచ్చినవారే దయదలిచి ఒక కాయో పండో ఇచ్చి వెళ్లేవారు.
సన్యాసికి ఒంటి మీద ఒక గోచీ గుడ్డ, కొమ్మకు ఆరేసుకున్న మరో గోచీ గుడ్డ తప్ప ఇంకెలాంటి స్థిర చరాస్తులు లేవు. ఉండాలని కోరుకోలేదు. కాలం అలా గడిచిపోతూ ఉంటే కాలం ఎందుకవుతుంది?
ఆరేసుకున్న గోచీ గుడ్డను ఎలుకలు కొరకడంతో సన్యాసికి ఎక్కడలేని కష్టాలు మొదలయ్యాయి. సర్వసంగ పరిత్యాగి ఈ విషయం మీద లోలోపల చాలా నలిగిపోతున్నాడు. ఒక శుభ ముహూర్తాన తన బాధను పశుల కాపర్లతో పంచుకున్నాడు. అయ్యో స్వామీ! ఇదా మీ బాధ? అందుకా ఈ మధ్య దిగులు దిగులుగా ఉన్నారు? రేప్పొద్దున కొండ మీదికి వచ్చేప్పుడు ఒక పిల్లిని తీసుకొచ్చి ఇక్కడ వదిలి వెళతాం. మీ సమస్యకు శాశ్వత పరిష్కారం అన్నారు. అన్నట్లుగానే పొద్దున్నే చంకలో పిల్లిని పెట్టుకుని వెళ్లారు. సన్యాసి రెండ్రోజులు గమనించాడు. ఎలుకలు మాయం. గోచీ గుడ్డ భద్రం.
అయితే ఆ కొండమీద సరయిన ఆహారం దొరకక పిల్లి మూడో రోజుకు కళ్లు తేలేసింది. సన్యాసి మనసు చివుక్కుమంది. మళ్లీ పశుల కాపర్లనే సలహా అడిగాడు. ఒంటరి పిల్లి బిక్కు బిక్కుమంటూ ఉంది. పైగా పిల్లికి పాలు పోయాలి…అని రెండో పిల్లిని కూడా ప్రవేశపెట్టారు. పాల క్యాన్, గిన్నెలు, ప్లేట్లు ఎలాగూ ఉంటాయి. వారం తిరగ్గానే సన్యాసి మళ్లీ మొహం వేలాడేసుకుని ఉండడాన్ని పశుల కాపర్లు జీర్ణించుకోలేకపోయారు. ఏమి స్వామీ! ఏమయ్యింది? అని అడిగారు. జంట పిల్లులు మ్యావ్ మ్యావ్ అని నా దుంప తెంచుతున్నాయి…అని బాధపడ్డాడు. మరుసటి రోజు ఉదయాన్నే రెండు అడవి కుక్కలను ప్రవేశపెట్టారు. తోడుగా రెండు ఆవులను కూడా ముందు జాగ్రత్తగా తెచ్చి కట్టి పడేసి, ఒక గుడిసె, పందిరి వేసి పెట్టారు.
సన్యాసి ఇవన్నీ చూసుకోలేక తపస్సు దారి తప్పుతోందని గ్రహించి ఊళ్లో ఈ విద్యలన్నీ తెలిసిన ఒక అనాథ యువతిని కొండమీద ఆశ్రమంలో ప్రవేశపెట్టారు. ఒకానొక కారు చీకటి కమ్మిన వేళ ఆ యువతిలో సన్యాసికి కాంతి రేఖ కనిపించింది. అంతే పెళ్లి కాకుండానే శోభనం జరిగిపోయింది. విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు పంచాయతీ పెట్టి శాస్త్రోక్తంగా పెళ్లి చేశారు. ఇంత సంసారంతో ఈ కొండమీద ఉండలేను…కొండ దిగి ఊళ్లోకి వచ్చేస్తాను అని సంసారిగా మారిన సన్యాసి చేసిన డిమాండును ఊరి జనం పెద్ద మనసుతో అంగీకరించారు. ఊరవతల సరికొత్త సంసారి సువిశాలమయిన గృహాశ్రమం కట్టుకుని పిల్లాపాపలతో, గొడ్డూ గోదాతో హాయిగా కాలం గడపసాగాడు. ఈ సన్యాసి సంసారిగా ఎందుకు మారాడు అని ఎవరయినా అడిగితే…ఆరోజు నుండి “కౌపీన సంరక్షణార్థం” అని సమాధానం వస్తోంది. కౌపీనం అంటే గోచీ గుడ్డ. సంరక్షణార్థం అంటే రక్షించుకోవడానికి. గోచీ గుడ్డను రక్షించుకోవడానికి జరిగిన సన్యాసి పరిణామక్రమ సిద్ధాంతమిది.
ఇందులో పేర్లు, తేదీలు మారుతూ ఉంటాయి కానీ…కోటా శ్రీనివాసరావు చెప్పినట్లు మిగతాదంతా సేమ్ టు సేమ్!
షేమ్ టు షేమ్!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018