Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమతిమరుపు మా జన్మ హక్కు

మతిమరుపు మా జన్మ హక్కు

Is It Possible To Have Your Digital Data Erased? – Right to be Forgotten

మనసు, మెదడు, మతి- దేనికదిగా వేరు వేరు విషయాలు. మెదడు ఒక అవయవం. మనుషులకు తలలో ఉంటుంది. హార్డ్ వేర్ లాంటిది. మనసు అవయం కాదు. సాఫ్ట్ వేర్ లాంటిది. ఆపరేటింగ్ సిస్టం. కళ్లు, చెవులు ఇతర ఇంద్రియాలతో మనం తీసుకున్న ఇన్ పుట్స్ ను మెదడు రికార్డ్ చేస్తుంది. భద్ర పరుస్తుంది. మనకు కావాలన్నపుడు వెలికి తీసి ఇస్తుంది. గూగుల్ లో సెర్చ్ కొడితే ఫైల్ ను వెతికిపెట్టినట్లు కొన్ని కీ వర్డ్స్ వినపడగానే దానికి సంబంధించిన మొత్తం డేటాను మెదడు మతికి అందిస్తుంది. మతి వెంటనే ఆ డేటాను ఎలా కావాలంటే అలా ప్రకటించడానికి సిద్ధం చేస్తుంది. మతి అంటే గుర్తు. మతిమరపు అంటే గుర్తు లేకపోవడం.

ఉదాహరణకు- ఒక పాట ట్యూన్ వినపడగానే ఆ పాట మనం పాడుతున్నామంటే ఆ పాట మ్యూజిక్, సాహిత్యం, వీలయితే ఆ పాట వీడియో మన మెదడు రికార్డ్ చేసి పెట్టుకుని ఉండాలి. ఎన్నో సార్లు విని ఉండాలి. పాట మనం రాయకపోయినా గాయకుడికంటే ముందే పాడేస్తూ ఉంటాం. ఎందుకంటే మతికి మెదడు వెంట వెంటనే ఆ పదాలను అందిస్తోంది కాబట్టి.
అలాగే చిత్రం, దృశ్యం, శబ్దం, స్థలం, రుచి, వాసన, రంగు…సకలాన్ని మెదడు కొన్ని కొన్ని కీ వర్డ్స్ తోనే గుర్తు పెట్టుకుంటుంది. దూకేప్పుడు ప్యారాచూట్ ఓపెన్ చేస్తేనే అది పని చేస్తుంది. లేకపోతే ప్యారాచూట్ దానికదిగా తెరుచుకోదు. మెదడు కూడా అంతే. ఓపెన్ చేస్తేనే, వాడితేనే పనిచేస్తుంది.

అందుకే-
మెదడు ఉందా? లేదా?
మెదడు పనిచేస్తోందా? మెదడు ఏమన్నా దొబ్బిందా?
చిన్న మెదడు చిట్లిందా?
మెదడు ఉండే మాట్లాడుతున్నావా?
మెదడు లేనోడా!
లాంటి ఎన్నో మాటలు మెదడున్న వారు కనుక్కుని వాడుకలో పెట్టారు.

మరుపు వరమా? శాపమా? అనేది డిబేటబుల్ విషయం. పదమూడు వేల అయిదు వందల కోట్లు అప్పు తీసుకున్న నీరవ్ మోడీకి మరుపు వరం. ఆ రుణమిచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు శాపం. లోన్ విషయం నీరవ్ ఎప్పుడో మరచిపోవడం వల్లే హాయిగా ఉండగలిగాడు. ఆ విషయం మరచిపోకుండా పదే పదే గుర్తు తెచ్చుకోవడం వల్లే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పటికీ చిగురుటాకులా వణికిపోతోంది.

ఇష్టం, అవసరం, ఉపయోగం, సాధన – అన్న నాలుగు విషయాల మీదే జ్ఞాపకశక్తి ఆధారపడి ఉంటుంది.

మెదడులో కణాలు కూడా మాంసమే అయినా మొత్తం నాడీవ్యవస్థను నియంత్రించేది, మనిషిని నడిపించేది మెదడే. స్విచ్ వేయగానే తీగలో కరెంట్ ప్రవహించినట్లు మెదడు ద్వారా అనుసంధానమయిన శరీరంలోని నాడులకు సందేశాలు వెళతాయి. చెయ్యి లేపాలి అని మనం అనుకుంటేనే చెయ్యి లేస్తుంది. అనుకోవడం మెదడులో జరిగే సంకల్పం. చెయ్యి లేవడం మెదడు ఇచ్చిన ఆదేశం. ఇంతకంటే లోతుగా వెళితే న్యూరో ఫిజీషియన్, న్యూరో సర్జన్ ల మనో భావాలు దెబ్బతింటాయి. బాగోదు.

తెలుగులో మతిమరుపు ఒకే మాట ఉంది. ఇంగ్లీషులో డిమెన్షియా మొదటి స్థాయి. ఇంకా ముదిరితే అల్జీమర్స్. మతి మరుపు మెరుపులా రాత్రికి రాత్రి రాదు. నెమ్మదిగా మొదలయి తీవ్రమవుతుంది. మతి మరుపు ఎందుకొస్తుంది అన్నదానికి ఇదమిత్థంగా కారణాలు ఉండవు. వచ్చాక వైద్యం కూడా లేదు. నిద్ర మాత్రలు ఎక్కువగా వాడడం, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, అసలు మెదడును ఎప్పుడూ ఉపయోగించకపోవడం మతిమరుపుకు కొంతవరకు కారణం.

ఈ మతిమరుపుకు భిన్నంగా- మర్చిపోవడం జన్మ హక్కుగా మార్చాలని కొత్త ఉద్యమం మొదలయ్యింది. యూరోప్ దేశాల్లో ఈ ఉద్యమం ఎప్పుడో మొదలయ్యింది. మరచిపోవడం ఒక అవసరంగా, హక్కుగా అక్కడ చట్టాలు కూడా వచ్చాయి. భారతదేశంలో కూడా మరచిపోవడం ఒక హక్కుగా చట్టంలో సవరణలు రాబోతున్నాయి.

Right to be Forgotten హిందీ బిగ్ బాస్ షో లో పాల్గొన్న ఒకానొక అశుతోష్ కౌశిక్ ఢిల్లీ హై కోర్టులో ఒక కేసు వేయడంతో ఈ కొత్త ఉద్యమం వార్తల్లోకి వచ్చింది. తనపై గతంలో వచ్చిన ఆరోపణల వార్తలు, వీడియోలు సోషల్ మీడియా నిండా ఇప్పటికీ వైరల్ గా తిరుగుతున్నాయట. దాంతో అంతులేని మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నాడట. ఆ గతం జ్ఞాపకాలు, గాయాలు మరచిపోయే తన హక్కును కాపాడాలట. తీర్పు ఏమొస్తుందో కానీ- అభ్యర్థన మాత్రం విచిత్రంగా, వైవిధ్యంగా ఉంది.

నిజమే.
మరచిపోవడానికి కొందరు మందు తాగుతారు.
మరచిపోయింది గుర్తు రావడానికి కొందరికి మందులిస్తారు. కొందరికి రావాల్సినవి మాత్రమే గుర్తుంటాయి. ఇవ్వాల్సినవి సహజంగా మరచిపోయి ఉంటారు. కొందరికి గాయాలే గుర్తొస్తుంటాయి.
కొందరికి పీడకలలే గుర్తొస్తుంటాయి.

ఢిల్లీ హై కోర్టులో కౌశిక్ అభ్యర్థనలో మనం కూడా ఇంప్లీడ్ అయి-
గతం గాయాలను మెదడులో శాశ్వతంగా తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరడానికి అవకాశాలేమయినా ఉంటే ఎంత బాగుండేదో? ఇంకొకరు గుర్తు చేయకుండా మరచిపోయే హక్కు గురించి పోరాడవచ్చేమో కానీ- ఈ పోరాటంలో పదే పదే అవే విషయాలు మనకే గుర్తొస్తే?
అయినా ఇదంతా మెదడున్న వారిగోల! అందరికీ ఈ ప్రమాదం లేదు. ఈ అభ్యర్థన అవసరం రానే రాదు. వచ్చినా ఏదీ గుర్తుండి చావదు!

నెవర్ మైండ్!
మైండ్ డజంట్ మైండ్!

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్