ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ లో రిషభ్ పంత్ సత్తా చాటాడు. 111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 146 పరుగులు చేయడంతో ఇండియా తొలిరోజు గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. పంత్ కు జడేజా అండగా నిలిచాడు, వీరిద్దరూ ఆరో వికెట్ కు 222 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. శుభమన్ గిల్-17 ; పుజారా-13; కోహ్లీ-11; హనుమ విహారీ-20; శ్రేయాస్ అయ్యర్-15 పరుగులు మాత్రమే చేసి శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్ మొదటి నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి మొదలు పెట్టాడు. టెస్ట్ మ్యాచ్ లా కాకుండా వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. పంత్ ఔట్ తర్వాత వచ్చిన శార్దూల్ ఠాకూర్ కేవలం ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. జడేజా 163 బంతుల్లో 10 ఫోర్లతో 83తో క్రీజులో ఉన్నాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ మూడు; మ్యాటీ పాట్స్ రెండు; బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.