Rishabh Pant: శ్రీలంకతో జరుగుతోన్న మొదటి టెస్ట్ లో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 357 పరుగులు చేసింది. రిషభ్ పంత్ నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు చేసి లక్మల్ బౌలింగ్ లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. హైదరాబాదీ ఆటగాడు హనుమ విహారీ 58; వందో టెస్టు ఆడుతున్న విరాట్ కోహ్లీ 45 పరుగులు చేసి ఔటయ్యారు. కోహ్లీ 38 పరుగుల వద్ద టెస్టుల్లో 8 వేల పరుగుల క్లబ్ లో చేరాడు. మనదేశం నుంచి సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వివిఎస్ లక్ష్మణ్ ల తరువాత ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా కోహ్లీ రికార్డు కెక్కాడు.
పంజాబ్, మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరుతుతోన్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 28 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్ 33 పరుగులు చేసి ఎంబుల్డేనియా బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. లంకతో జరిగిన టి 20 సిరీస్ లో ప్లేయర్ అఫ్ ద సిరీస్ గెల్చుకున్న శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్ లో నిరాశ పరిచి 25 పరుగులకే ఔటయ్యాడు.
తొలిరోజు మ్యాచ్ ముగిసే సమయానికి రవీంద్ర జడేజా-45; రవిచంద్రన్ అశ్విన్-10 పరుగులతోను క్రీజులో ఉన్నారు. లంక బౌలర్లలో… లసిత్ ఎంబుల్డేనియా రెండు; సురంగ లక్మల్, విశ్వా ఫెర్నాండో, లాహిరు కుమార, ధనుంజయ డిసిల్వా తలా ఒక వికెట్ సాధించారు.