బ్రిటన్ ప్రధాని పీఠం వైపు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అడుగులు వేస్తున్నారు. నాలుగో రౌండ్‌లో కూడా ఆయనే విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవికి ఇప్పటి వరకు నాలుగు రౌండ్ల పోరు జరగ్గా, ప్రతి రౌండ్ లోనూ రిషి స్పష్టమైన అధిక్యం సాధించారు. రెండో స్థానంలో వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్‌, మూడో స్థానంలో విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్ కొనసాగుతున్నారు. తాజా రౌండ్‌ నుంచి కెమి బడెనోచ్‌ ఎలిమినేట్‌ కావడంతో ప్రధాని పోటీలో ముగ్గురే నిలిచారు. ఈ టాప్‌ త్రీలోనూ రిషి సునాక్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండడం ప్రధాని పదవిపై మరిన్ని ఆశలు రేకెత్తిస్తున్నాయి.

కన్జర్వేటివ్‌ పార్టీ నేతను ఎన్నుకునేందుకు గానూ మంగళవారం మరోదఫా వడపోత ఎన్నిక జరిగింది. ఇందులో రిషి సునాక్‌కు 118 ఓట్లు వచ్చాయి. రెండోస్థానంలో ఉన్న పెన్నీ మోర్డాంట్‌కు 92 ఓట్లు రాగా, మూడోస్థానంలో ఉన్న లిజ్‌ ట్రస్ 86 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న కెమి బడెనోచ్‌కు కేవలం 59 ఓట్లు రావడంతో ప్రధాని పదవి పోటీ నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది.

ఇలా, గురువారం జరిగే చివరి రౌండ్‌ నాటికి బరిలో ఇద్దరే మిగులుతారు. తుది రౌండ్‌లో నిలవాలంటే 120 ఓట్లు అవసరం. అయితే, ఇప్పటివరకు కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలు మాత్రమే ఈ ఎన్నికల్లో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత తుది అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో 1,60,000 మంది అర్హులైన కన్జర్వేటివ్‌ పార్టీ ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నుకుంటారు. తుది పోరులో గెలిచిన వ్యక్తిని సెప్టెంబర్‌ 5న ప్రకటిస్తారు. ఇలా కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా విజయం సాధించేవారే బ్రిటన్‌ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపడుతారు.

Also Read : ప్రధాని రేసులో రిషి సనక్ ముందంజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *