Historic blunder:
ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా నిత్యం ఊపిరి సలపని పనుల్లో ఉంటున్నా…తనలోని సాహితీ పిపాసిని భద్రంగా కాపాడుకుంటున్నవారు వాడ్రేవు చినవీరభద్రుడు. త్రిబుల్ ఆర్ సినిమా మీద ఆయన సమీక్ష ఇది
నిన్న రాత్రి RRR అనే సినిమా చూశాను. మూడు గంటల ఏడు నిమిషాలు. తెలుగులో అబ్సర్డ్ సాహిత్యం, అబ్సర్డ్ నాటకం రాలేదన్న చింత తీరిపోయింది. బహుశా ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘమైన అబ్సర్డ్ సినిమా మరొకటి ఉండదనుకుంటాను. అటువంటి సినిమా కథని కన్సీవ్ చెయ్యగలిగిన ఆ టీమ్ ప్రతిభా పాటవాలముందు నోరు తెరుచుకుని నిలబడిపోవడం తప్ప మరేమీ చెయ్యలేననిపిస్తోంది.
తమ సినిమాలో ప్రస్తావించిన వ్యక్తులు, ప్రదేశాలు, సంఘటనలు ప్రతి ఒక్కటీ కల్పితాలనీ, తమ సినిమా పూర్తి అభూత కల్పన అని మొదట్లోనే ఒక డిస్ క్లెయిమర్ రాసుకున్నారు కాబట్టి నిజానికి ఆ కథ గురించి గాని, ఆ సినిమా గురించి గాని ఏమీ మాటాడకూడదు.
ఈ సినిమా వల్ల తమ మనోభావాలు గాయపడ్డాయనో, చరిత్రను వక్రీకరించారనో మరొకటో ఇంకొకటో న్యాయపరమైన చిక్కులో, వివాదాలో వస్తాయని ఇటువంటి డిస్ క్లెయిమర్ రాసి ఉండవచ్చు. కాని మామూలుగా ఇటువంటి డిస్ క్లెయిమర్ ఎందుకు రాస్తారంటే, దాదాపుగా యథార్థ సంఘటనల ఆధారంగా, అత్యంత వాస్తవికంగా ఒక కథ చెప్తూ, అటువంటి కథ నిజంగానే ప్రేక్షకులకి ఆ యథార్థ సంఘటనని గుర్తు చేస్తుంది కాబట్టి, దానివల్ల రాబోయే చిక్కులనుండి బయటపడటానికి.
ఈ సినిమా నిజంగానే అభూత కల్పన కాబట్టి ఇటువంటి డిస్ క్లెయిమర్ అవసరం లేదు, నిజానికి. కాని ఇందులో అన్నీ అభూత కల్పనలే అయి ఉంటే నాకు ఇబ్బంది ఉండేకాదు. కాని అదిలాబాదు, ఢిల్లీ, ఆగ్రా, విశాఖపట్టణం లాంటి స్థలాలూ, లాలా లజపత్ రాయి, నిజాం వంటి చారిత్రిక వ్యక్తులూ, గోండులూ, భారతీయులూ, బ్రిటిష్ వాళ్ళు లాంటి తెగల, దేశాల, జాతుల పేర్లు ప్రస్తావించారు కాబట్టి, సినిమా చూస్తున్నప్పుడు నాకు కలిగిన సందేహం, ఆ స్థలాలూ, ఆ పేర్లూ కూడా అభూతకల్పనలేనా అని.
గత ఇరవై ముప్పయ్యేళ్ళుగా మన పాఠశాలల్లోగాని, కళాశాలల్లోగాని, మన వార్తాపత్రికల్లోగాని, సమాచార ప్రసార సాధనాల్లోగాని చరిత్ర, సామాజిక శాస్త్రం, మానవవిజ్ఞాన శాస్త్రం లాంటివి ఎక్కడా కనిపించకపోవడం వల్లా, తెల్లవారితే మన టెలివిజన్ లో సినిమా వాళ్ళే కనిపిస్తూండటం వల్ల, ప్రస్తుతం సినిమా వాళ్లే మన జాతీయ నాయకులు కాబట్టి ఏ ఇద్దరు హీరోల్ని చూపించినా అదే చరిత్ర అయిపోతుందని ఈ చిత్రదర్శకుడు గట్టి నిర్ణయానికి వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. కాని నా సమస్య ఏమిటంటే, వీళ్ళు తీసే సినిమాల్లో నిజంగానే కొందరు చారిత్రిక వ్యక్తుల, సమకాలిక జాతుల, దేశాల, పోరాటాల పేర్లు వాడుతుంటారు. ప్రజాస్మృతిలో బలంగా ఉన్న కొందరు ఆరాధ్య పోరాట వీరుల పేర్లు కావాలని తమ సినిమాల్లో చొప్పిస్తారు. ఇదే నాకు ఈ సినిమా పట్ల ఉన్న ప్రధాన అభ్యంతరం.
ఉదాహరణకి, ఈ సినిమా మొదట్లోనే ఒక హీరో ప్రతాపాన్ని పరిచయం చేయడానికి ఒక సన్నివేశం కల్పించి అందులో లాలా లజ్ పత్ రాయిని కలకత్తాలో అరెస్టు చేసారని చెప్తారు. లాలా లజపత్ రాయి పంజాబ్ కేసరి. ఆయన్ను ఏ రోజూ కలకత్తాలో అరెస్టు చేయలేదు. 1927 లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పంజాబ్ లో చేసిన శాంతియుత నిరసన ప్రదర్శనలో ఆయన్ని బ్రిటిష్ పోలీసులు తీవ్రంగా గాయపరిచారు. ఆ గాయాల వల్ల ఆయన మరణించడం, దానికి ప్రతీకారంగా ఒక భగత్ సింగ్ పుట్టుకురావడం, ఇది చరిత్ర. కాని దురదృష్టవశాత్తూ ఈ సినిమా కథ రాసినవాడు లాలా లజ్ పత్ రాయి అనే పేరు ఎప్పుడో విన్నాడు. ఆ పేరు సినిమాలో వాడుకుంటే బాగుంటుందనుకున్నాడు. చివర్లో రాయ్ అని ఉంది కాబట్టి ఏ బెంగాలీనో అయివుంటాడనుకున్నాడు. అంతే. కాని విషాదం ఏమిటంటే, ఈ అభూత కల్పన కూడా ఇప్పుడు చరిత్రగా మారిపోతుంది. లాలా లజ్ పత్ రాయి మీద ప్రస్తుతం వికీపీడియా లో ఉన్న ఎంట్రీ చూడండి. అందులో ఈ సినిమా గురించీ, ఈ సన్నివేశం గురించీ కూడా రాసేసారు.
ఇక నిజంగానే నా గుండె బద్దలైన విషయం సినిమాలో గోండుల గురించిన ప్రస్తావన. సినిమాలో ఒకటి రెండు సార్లు అడవిలో ఒక పల్లెనీ, కొందరు మనుషుల్నీ చూపించి అది అదిలాబాదు అడవి అనీ, అది గోండు పల్లె అనీ, వాళ్ళు గోండులనీ చెప్తాడు. అయ్యో! నీకు గోండులంటే ఎవరో తెలుసా? వాళ్ళెలా ఉంటారో ఎప్పుడన్నా చూసావా? వాళ్ళ పల్లెలు ఎలా ఉంటాయో తెలుసా? నువ్వు అదిలాబాద్ అని రాయకుండా మాహిష్మతీపురం అనీ, వాళ్ళు కాలకేయులు అనే ఒక జాతి అనీ రాసి ఉంటే నాకే బాధా ఉండేది కాదు. కాని ఒకప్పుడు మధ్యభారతదేశంలో రాజులుగా అదిలాబాద్, ఈశాన్య మహారాష్ట్ర, నైరుతి మధ్యప్రదేశ్ లను పరిపాలించి, మొఘల్ చక్రవర్తులనుంచి, నిజాందాకా దుర్మార్గులైన పాలకుల్ని ఎదిరిస్తూ వచ్చిన ఒక సాహసోపేతమైన, సాంస్కృతికంగా సుసంపన్నమైన ఒక గిరిజన జాతిని నువ్వు subhuman beings గా చూపించావే, నీది బుద్ధిమాంద్యమని సరిపెట్టుకోనా లేకపోతే arrogance అనుకోనా? Sardar Harpal Singh గారూ, మీరు రోజూ ఫేస్ బుక్ లో పెడతారే, గోండుల, గోండు పండగల, గోండు పల్లెల ఫొటోలు, వాటి లింక్ పంపకూడదా ఈ దర్శకుడికి!
గోండు మగవాళ్ళు పంచెకట్టుకుంటారు. తెల్లచొక్కా వేసుకుంటారు. తలపాగా కట్టుకుంటారు. వాళ్ళ నడకలో, నడవడిలో అపారమైన ఆత్మగౌరవం తొణికిసలాడుతుంది. ‘నీ బాంచెన్ ‘ అని ఒక గోండు నోటమ్మట నేనెప్పుడూ వినలేదు. అటువంటి గోండుల్ని అర్థనగ్నంగా చూపిస్తున్నప్పుడు, వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలియనప్పుడు, నువ్వెప్పుడూ చూసి ఉండనప్పుడు, వాళ్ళని గోండులు అని ఎందుకు ప్రస్తావించాలి? మరేదైనా పేరు పెట్టుకుని ఉండవచ్చు కదా.ఇగ్నొరెన్సు ని క్షమించవచ్చు. యారొగెన్సుని క్షమించలేం. అంతా అభూతకల్పనగాతీసిన సినిమాలో చివర బోస్, పటేల్, భగత్ సింగ్ లాంటి స్వాతంత్య్ర వీరుల బొమ్మలు ఎందుకు కనిపించాయి? ఇక అత్యంత విషాదకరమైన హాస్యమేమిటంటే, వాళ్ళతో పాటు శివాజీ బొమ్మ కూడా కనిపించడం. బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వాళ్ళ బొమ్మలన్నీ చూపించాలనుకున్నప్పుడు, ఈ మధ్య ఎక్కడ చూసినా శివాజీ పేరు కూడా తరచూ వినిపిస్తోంది కాబట్టి, ఏమో ఆయన కూడా బ్రిటిష్ వారితో పోరాడేడేమో, ఎందుకొచ్చిన గొడవ ఆయన్ని చూపించకపోతే బాగుండదని, పనిలో పని ఆయన బొమ్మ కూడా ఒకసారి చూపించేశాడు దర్శకుడు! లేదా ముందే డిస్ క్లెయిమర్ లో రాసుకున్నట్టుగా, ఆ బోసూ, పటేలూ, కిత్తూరు రాణి చెన్నమ్మ లాంటి పేర్లన్నీ కూడా నిజజీవితంలో పేర్లని పోలి ఉన్నట్టు కనిపించినా అభూత కల్పనలే అనుకోవాలా?
కన్యాశుల్కంలో రామప్పంతులు గిరీశం రాసిన ఉత్తరం చదువుతూ మధ్యలో ‘ఇంగ్లిషు కూడా వెలిగిస్తున్నాడయ్యా గుంటడూ ‘ అంటాడు. ఈ సినిమా లో కూడా ఇంగ్లిషు బాగానే వెలిగించాడు గుంటడు. ఆ ఇంగ్లిషు గురించి, ఆ ఇంగ్లిషు వాళ్ళ చిత్రణ గురించీ, ఆ పాలన గురించీ దర్శకుడికి ఎంత తెలియదో చెప్పడం మొదలుపెడితే అదో పెద్ద వ్యాసమవుతుంది.
ఒకప్పుడు శ్రీ శ్రీ ఒక పత్రికని పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రిక అన్నాడు. ఈ సినిమా పెట్టుబడికీ, అభూతకల్పనకీ పుట్టిన విషపుత్రిక. నీకు చరిత్ర, యాంత్రొపాలజీ, సోషియాలజీ ఏవీ తెలియకపోయినా పర్వాలేదు, కనీసం వార్తాపత్రికలు చదవకపోయినా పర్వాలేదు, నీ దగ్గర డబ్బులుంటే, కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసే నలుగురు కుర్రాళ్ళు తెలిసి ఉంటే, ఇద్దరు స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వగలిగితే చాలు, నువ్వేమి తీసినా ప్రజలు ఎగబడి చూస్తారన్న యారొగెన్సు తప్ప మరేదీ ఈ సినిమాలో కనిపించలేదు. ఈ మధ్య అల్లూరి సీతారామరాజు, కొమురం భీం ప్రజల ఇమేజినేషన్ లో బలంగా ఉన్నారు కాబట్టి (రెండు రాష్ట్రాల్లోనూ ఈ ఇద్దరి పేర్ల మీదా రెండు జిల్లాలు కూడా ఏర్పడ్డాయి) వాళ్ళల్లో ఒకరు 1924 లో, మరొకరు 1940 లో ప్రాణత్యాగం చేసినప్పటికీ, వాళ్ళిద్దరి పేర్లూ స్ఫురించేలాగా ఇద్దరు హీరోల్ని పెట్టి సినిమా తీస్తే, మొదటివారం కలెక్షన్లతోనే మొత్తం పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందన్న ధీమా తప్ప మరేమీ కనిపించలేదు ఈ సినిమాలో.
అన్నట్టు, సినిమా మొదట్లో మరొక డిస్ క్లెయిమర్ కూడా ఉంది. ఈ సినిమాలో ఏ జంతువుల్నీ నిజంగా హింసించలేదు అని. ఈ సినిమా చూశాక నాకు ఏమి అర్థం అయ్యింది అంటే ప్రస్తుతం అన్నిటికన్నా పెద్ద మూగజీవి చరిత్ర అని. అయ్యా. మీరు జంతువుల్ని నిజంగా హింసించారో లేదో నాకు తెలియదు గాని, చరిత్రని మాత్రం అడుగడుగునా హింసించారు. జంతురక్షణ కు చట్టాలున్నట్టుగా, చరిత్ర రక్షణకు, చారిత్రిక వ్యక్తుల పేర్లకూ, వారి నిరుపమాన బలిదానాలకూ కూడా చట్టాలు వస్తే తప్ప ఇటువంటి హింస ఆగదనుకుంటాను.
Also Read :