Saturday, November 23, 2024
HomeTrending Newsఆధిపత్యాన్ని అంగీకరించని ఓటరు..

ఆధిపత్యాన్ని అంగీకరించని ఓటరు..

Ruling Party Voter Verdict :

హుజురాబాద్ ఉపఎన్నికల్లో తెరాస ఓటమి, బిజెపి గెలుపు మీద రాజకీయ పార్టీలు, విశ్లేషకులు, నేతలు ఎవరికి తోచిన ఉహాగానాలు వారు చేస్తున్నారు. ధర్మాన్ని గెలిపించారని, పాలకులకు గుణపాఠం చెప్పారని ఓటర్లను అభినందిస్తున్నారు. పాలకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పటం తెలంగాణ ఓటర్లకు కొత్త కాదు. అందులో ఉత్తర తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడంలో సిద్ధహస్తులని చెప్పవచ్చు. ఆధిపత్యాన్ని అంగీకరించని ఉత్తర తెలంగాణ ప్రజలు అనేకసార్లు ఈ విషయం రుజువు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస ఎమ్మెల్యేలు రాజీనామా చేయటం మళ్ళీ గెలవటం జరిగింది. మూకుమ్మడిగా చేసిన రాజీనామాలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పార్టీలు, రాజకీయాలు పక్కన పెడితే అధికార పార్టీ ఆధిపత్య ధోరణి కోణంలో పరిశీలిస్తే ఓటరు తీర్పు ఏవిధంగా ఉందో అర్థం అవుతుంది.

ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం కావొచ్చు, పౌరహక్కుల సంఘాలు, పాలక వర్గాల అణచివేత, ఆధిపత్య కులాల అహంకారం తదితర కారణాలతో మొదటి నుంచి ప్రజలు తిరుగుబాటు పంథాలోనే వ్యవహరిస్తున్నారు. పాలక వర్గం ఆధిపత్యం చెలాయిస్తే ఎంతటి వారైన సరే అధికార పార్టీకి ఎదురొడ్డి నిలిచారు.

టిటిడిపి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత తెరాస నేత ఎల్ రమణ చంద్రబాబు హయంలో మంత్రిగా ఉండి కరీంనగర్ ఎంపిగా గెలవటంతో జగిత్యాల ఉపఎన్నిక అనివార్యం అయింది. దీంతో 1996లో జగిత్యాల ఉపఎన్నిక జరిగింది. కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సి టి జీవన్ రెడ్డి బరిలో దిగగా తెలుగుదేశం నుంచి బండారి వేణు పోటీ చేశారు. ఆ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక్కో మంత్రిని ఇంచార్జ్ గా నియమించి, జగిత్యాల పట్టణంలో వార్డుల వారిగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పచెప్పారు. ఉత్కంఠగా సాగిన పోరులో జీవన్ రెడ్డి 53 వేల పైచిలు మెజారిటితో గెలిచారు.

ఇక 2001 లో కెసిఆర్ పోటీ చేసిన సిద్ధిపేట ఉప ఎన్నికల నుంచి మొదలు పెడితే నిన్నటి హుజురాబాద్ వరకు చైతన్యవంతమైన ఉత్తర తెలంగాణ ప్రజలు అధికార పార్టీ హద్దులు మీరితే ఓటుతో తమ సత్తా ఎంటో  చాటారు. ఉప సభాపతి పదవికి, తెలుగుదేశం పార్టికి రాజీనామా చేసి సిద్ధిపేట నుంచి శాసనసభకు పోటీ చేసినపుడు కెసిఆర్ ఒంటరిగానే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కెసిఆర్ ను నిలువరించేందుకు అగ్రనేతలు అందరిని మొహరించినా, అధికార బలాన్ని ప్రదర్శించినా ప్రజలు కెసిఆర్ వెన్నంటి ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్ రావు కరీంనగర్ పార్లమెంటు సభ్యత్వానికి 2006లో రాజీనామా చేయగా అదే ఏడాది డిసెంబర్ లో ఉప ఎన్నికలు జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వాదం లేదని నిరూపించేందుకు భారీ కసరత్తే చేశారు. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎల్ రమణ, బిజెపి నుంచి కేంద్ర మాజీమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు రంగంలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చతురంగ బలగాలను మొహరించి కరీంనగర్లో కాంగ్రెస్ గెలుపు కోసం గట్టిగా కృషి చేశారు. హుజురాబాద్ లో ఇప్పుడు జరిగిన అన్ని ప్రలోభాలు అప్పుడు కరీంనగర్ లో కూడా జరిగాయి. అయితేనేం కరీంనగర్ లోక్ సభ పరిధిలోని ఓటర్లు రెండు లక్షల పైచిలుకు మెజారిటీతో కెసిఆర్ కు విజయం కట్టబెట్టారు.

2019 లోక్ సభ సాధారణ ఎన్నికల్లో నిజామాబాదు ఎంపిగా కవిత పోటీ చేసినపుడు ఇందూరు ప్రజలు ఇదే నిరూపించారు. సిఎం కెసిఆర్ హిందుగాళ్ళు బొందుగాల్లు అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే సృష్టించాయి. ఎంపి గా కవిత కొందరికే అందుబాటులో ఉండటం, ఆమె పేరుతో కొందరు చోట మోటా నేతలు నియోజకవర్గంలో రుబాబుగా వ్యవహరించటం, కెసిఆర్ వ్యాఖ్యలు కవితకు ఓటమి రుచి చూపగా ఎన్నికలకు కొత్తైన ధర్మపురి అరవింద్ ను ప్రజలు అందలం ఎక్కించారు.

గత ఏడాది(2020) ఇదే సమయంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ సలహాలతో మంత్రి హరీష్ రావు ఎన్ని మంత్రాంగాలు చేసినా ప్రజలు ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. సానుభూతి పవనాలు వీయలేదు. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించారు. ఇప్పుడు హుజురాబాద్ లో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ నెలల తరబడి మకాం వేసినా ఓటరు మహాశయుడు అధికార పార్టీని కరుణించ లేదు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన నేతల సొంత గ్రామాలు, నియోజకవర్గాల్లో మెజారిటీ సాధించారు. హుజురాబాద్ లో మొహమాటం లేకుండా అధికార పార్టీని “చీరి దోర్ణం” కట్టినంత పనిచేశారు. తెరాస నేతల సొంత గ్రామాలు, మండలాల్లో కూడా బిజెపినే ఆధిక్యం కనబరిచింది.

2001లో కరీంనగర్ సింహగర్జన నుంచి ప్రజల నైజం ఏంటో చూస్తున్న కెసిఆర్ దుబ్బాక, హుజురాబాద్ లో ఎలా లెక్క తప్పారు. అందరి మాదిరిగానే అధికారం మాయలో పడ్డారా? చుట్టూ చేరిన నేతల భజన మాదిరి సర్వే సంస్థలు కూడా భజన నివేదికలు ఇస్తున్నాయా? దళితబందు గొప్ప పథకంగా ప్రారంభించినా అది హుజురాబాద్ ఉపఎన్నికల కోసమే అనే  వాదన ప్రజల్లోకి బాగా వెళ్ళింది. పైగా ఎస్సి ల కోసం దళితబంధు తీసుకొస్తే బిసీ ల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఉదయించాయి. హుజురాబాద్ కేంద్రంగా ఎస్సి కమిషన్ చైర్మన్ పదవి, బీసి కమిషన్ చైర్మన్ పదవి ఇలా ఎన్ని తాయిలాలు ఇచ్చినా ఓటరు మహాశయుడు ఎక్కడా బయట పడలేదు.

తెలంగాణ ఉద్యమ సమయంలో అధికార పార్టీ దగ్గర నోట్లు, బహుమతులు తీసుకోండి ఉద్యమకారులను గెలిపించండి అని పిలుపు ఇచ్చిన కెసిఆర్ కు హుజురాబాద్ ప్రజలు తమ తీర్పుతో అదే విషయం ఇప్పుడు గుర్తు చేశారు.

-భాస్కర్ దేశవేని

RELATED ARTICLES

Most Popular

న్యూస్