రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారిందని, వైసీపీ నాయకుల అరాచకాలకు కాపలా కాయడమే పోలీసుల విధిగా తయారైందని మాజీ మంత్రి, టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. స్వయంగా ఓ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసే స్థాయికి రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులు తయారయ్యారని, సొంతపార్టీ ఎంపీ కుటుంబానికే రక్షణ కల్పించలేని సిఎం జగన్ కు ఆ పదవి అవసరమా అని కన్నా ప్రశ్నించారు. వైసీపీ నేతల అక్రమాలకు పోలీసు వ్యవస్థ ఓ కంచె లాగా రక్షణ కల్పిస్తోందన్నారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో కన్నా మీడియాతో మాట్లాడారు. విశాఖ సంఘటనపై ఎంపి ఫోన్ చేసి చెప్పే వరకూ పోలీసులకు ఈ విషయం తెలియకపోవడం సిగ్గుపడాల్సిన అంశమని, దీనిపై డిజిపి స్పందించిన తీరు దారుణంగా ఉందన్నారు. బాపట్ల ఘటన కూడా అత్యంత బాధాకరమన్నారు.
సహకారరంగాన్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, జేబుదొంగలు తయారయ్యారని కన్నా విమర్శించారు. సహకార సంఘాలకు ఎన్నికలు జరపకుండా త్రిసభ్య కమిటీ పేరుతో లూటీ చేస్తున్నారన్నారు. ఇసుకలో జిల్లాకో పాలెగాడిని పెట్టి ఏ విధంగా దోచుకున్తున్నారో అదే విధంగా సహకారం సంఘంలో కూడా కమిటీని నామినేట్ చేసి కేంద్ర ప్రభుత్వం, నాబార్డ్, రైతుల సొమ్ము, ఎన్సిడిసి సొమ్ము దోచుకుంటున్నారని కన్నా మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సహకార శాఖను కూడా చూస్తున్న హోం మంత్రి అమిత్ శా, ఈడీ, నాబార్డు ఛైర్మన్ లకు ఫిర్యాదు చేశామన్నారు. గుంటూరు జిల్లాలో రూ.500 కోట్లు కాజేశారని, రాష్ట్రంలో అనేక చోట్ల రైతులకు తెలియకుండా వారి పేరిట దొంగ పాస్ పుస్తకాలతో వందల కోట్ల అవినీతి చేస్తున్నారని కన్నా ఆరోపణ చేశారు. రాష్ట్రం మొత్తంగా ఐదు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించి దోషులను జైలుకు పంపాలని కన్నా డిమాండ్ చేశారు.