రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్ మరోసారి కుండబద్దలు కొట్టింది. దేశ పౌరులకు తక్కువ ధరకు ఇంధనం సరఫరా చేయటం ప్రభుత్వ నైతిక బాధ్యత అని.. అది ఎక్కడి నుంచైనా కొనుగోలు చేస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని ఏ దేశం చెప్పలేదని..భారత్ పై ఎలాంటి ఒత్తిడి లేదని అమెరికా రాజధాని వాషింగ్టన్ వేదికగా తెగేసి చెప్పారు. భారత మంత్రి తీవ్ర స్థాయి సమాధానంతో అమెరికా మీడియా మరో ప్రశ్న అడగలేకపోయింది.
అమెరికా పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి – ఆ దేశ పెట్రోలియం మంత్రి జెన్నిఫర్ గ్రాహోల్మ్ తో వాషింగ్టన్ లో సమావేశం ఆయారు. చమురు, సహజ వాయువులో రెండు దేశాల పరస్పర సహకారంపై మంత్రులు చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి పూరి… త్వరలోనే అమెరికా, భారత్ గ్రీన్ ఎనర్జీపై అవగాహనకు రానున్నాయని భారత మంత్రి ప్రకటించారు. ప్రపంచంలో చమురు తక్కువ ధరకు ఎక్కడ దొరికినా భారత్ కొనుగోలు చేస్తుందని, దేశ ప్రజల అవసరాల కోసం తప్పదని కేంద్రమంత్రి పూరి వెల్లడించారు.
అమెరికా వేదికగానే భారత్ తన వైఖరి స్పష్టం చేయటం ఇది రెండోసారి. ఇటీవలే అమెరికా పర్యటనలో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ను పాశ్చాత్య మీడియా ప్రతినిధులు రష్యా చమురుపై ప్రశ్నల పరంపర వేయగా జై శంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. రష్యా నుంచి యూరోప్ కొనుగోలు చేస్తున్న దానితో పోలిస్తే అందులో భారత్ పది శాతం మాత్రమె కొనుగోలు చేస్తోందని వెల్లడించారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని భారత విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.
Also Read : భద్రతామండలిలో సంస్కరణలు కీలకం భారత్